
న్యాయస్థానాలు ఇచ్చే కొన్ని తీర్పులు చూస్తే.. ఈ సమాజంలో ఇంకా న్యాయం బతికే ఉందన్న భావన కలుగుతుంది. కానీ.. కోర్టులు ఇచ్చే కొన్ని తీర్పులు చూస్తే మాత్రం.. అసహ్యం కలగకడమే కాదు.. ఆవేదనతో కూడిన ఆవేశం వ్యక్తమవుతుంది. బాధతో కూడిన భయం కూడా కలుగుతుంది. సరిగ్గా ఇలాంటే తీర్పు వెలువడింది బెర్లిన్ లో! అత్యాచారానికి గురైన బాధితురాలి కేసులో ఓ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ తీర్పు ఇచ్చింది కూడా ఓ మహిళా జడ్జి కావడం మరింత విస్మయపరిచే అంశం. ఆ వివరాలేంటో చూద్దాం.
గతేడాది ఫిబ్రవరిలో బెర్లిన్ లో ఓ నైట్ క్లబ్ లో 17ఏళ్ల మైనర్ బాలికపై 33 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. నిందితుడిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో అతడికి నాలుగు సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై బాధితురాలు, ఆమె బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యంతరం తెలిపారు. అనంతరం.. ఈ తీర్పును పునఃపరిశీలించాలని అప్పీల్ చేశారు.
దీంతో.. విచారణ చేపట్టిన కోర్టు ఇచ్చిన తీర్పు చూసి బాధితులతోపాటు యావత్ ప్రపంచం విస్మయం వ్యక్తం చేసింది. బాధితురాలిపై ఆ దోషి కేవలం 11 నిమిషాలే అత్యాచారం చేశాడని, పైగా.. ఆమెకు తీవ్రగాయాలేవీ కాలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం. అందువల్లే జైలు శిక్షను తగ్గించినట్టు తీర్పులో పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ తీర్పు తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తింది. బాధితులతోపాటు వందలాది మంది ఆ కోర్టు ముందు ధర్నా చేపట్టారు. అయితే.. ఈ తీర్పు వెలువరించిన జడ్జి కూడా ఓ మహిళా న్యాయమూర్తి కావడం గమనార్హం. ఒక మహిళా న్యాయమూర్తి ఇలాంటి తీర్పు ఇవ్వడం పట్ల ఆగ్రహావేశాలు వ్యకమయ్యాయి.