Ramya Krishnan: మంత్రి రోజాకు సపోర్ట్ చేసి అడ్డంగా బుక్ అయిన రమ్యకృష్ణ

రోజా చాలా సందర్భాల్లో ప్రత్యర్థులపై వ్యక్తిగత కామెంట్లు చేసేవారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడే.. నాడు టిడిపి మహిళా మంత్రులపై నిండు శాసనసభలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Written By: Dharma, Updated On : October 11, 2023 3:33 pm
Follow us on

Ramya Krishnan: ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టుంది హీరోయిన్ రమ్యకృష్ణ పరిస్థితి. మంత్రి రోజా వ్యవహారంలో ఇటీవల రమ్యకృష్ణ స్పందించారు. ఆమెపై అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. వ్యక్తిగత కామెంట్స్ చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ, సీఎం జగన్ స్పందించి రోజాకు న్యాయం చేయాలని కోరారు. సహచర నటిగా రమ్యకృష్ణ స్పందించడం ధర్మమే. కానీ రోజా రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం ఇది తప్పిదంగా కనిపిస్తోంది.

రోజా చాలా సందర్భాల్లో ప్రత్యర్థులపై వ్యక్తిగత కామెంట్లు చేసేవారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడే.. నాడు టిడిపి మహిళా మంత్రులపై నిండు శాసనసభలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళా మంత్రి బాడీ షేమింగ్ పై కూడా మాట్లాడారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సీఎం జగన్ ప్రాపకం కోసం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై వ్యక్తిగత కామెంట్స్ కు దిగేవారు. కొద్ది రోజుల కిందట అసెంబ్లీలో భువనేశ్వరి పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సైతం రోజా స్పందించలేదు. పైగా వెకిలి నవ్వులతో సమర్థించేలా ప్రవర్తించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత స్వీట్లు పంచి మరి సంబరాలు చేసుకున్నారు.

సాధారణంగా కుటుంబ సభ్యులు అరెస్టుతో ఆ ఇంటి మహిళలు ఆవేదనలో ఉంటారు. అటువంటి సమయంలో సైతం నారా భువనేశ్వరి, బ్రాహ్మణి లను రోజా టార్గెట్ చేసుకున్నారు. అందుకే టిడిపి నేతలకు టార్గెట్ అయ్యారు. ఈ క్రమంలోనే రోజా సహచర హీరోయిన్లు స్పందించడం టిడిపి నేతలకు రుచించడం లేదు.భువనేశ్వరి, బ్రాహ్మణీలపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మీరంతా ఏమయ్యారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. రోజాకు సంఘీభావంగా రమ్యకృష్ణ ప్రత్యేక వీడియో విడుదల చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పుడు రోజా కంటే రమ్యకృష్ణనే టిడిపి శ్రేణులు టార్గెట్ చేసుకుంటున్నాయి.

కరోనా లాక్ డౌన్ సమయంలో రమ్యకృష్ణ మద్యం బాటిళ్లతో పట్టుబడిన సంగతి తెలిసిందే. మహాబలిపురం నుంచి తన కారులో తెస్తున్న మద్యం బాటిళ్లు పోలీస్ తనిఖీల్లో పట్టుబడ్డాయి. కారు డ్రైవర్ పై కేసు నమోదు తో రమ్యకృష్ణ బయటపడ్డారు. కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మంత్రి రోజాకు రమ్యకృష్ణ మద్దతు తెలపడం, బండారు సత్యనారాయణమూర్తి కఠినంగా శిక్షించాలని కోరడంతో ఆ వీడియోలు టిడిపి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. చర్చకు దారి తీస్తున్నాయి.