Ramesh Rupa Raelia : అతని పేరు రమేష్ రూప రేలియా.. స్వస్థలం గుజరాత్ రాష్ట్రంలోని గొండాల్ నగరం.. రమేష్ కుటుంబానిది పేదరిక నేపథ్యం.. చిన్నప్పటి నుంచి అనేక ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో 2005లో గొండాల్ నగరానికి వచ్చాడు. అక్కడ వ్యవసాయం మొదలు పెట్టాడు.. అప్పట్లో అతడు ఆవుల కాపరిగా నెలకు ₹80 సంపాదించేవాడు. కానీ ఆ తర్వాత పారిశ్రామికవేత్తగా మారాడు. ఆవుల మందకు యజమానిగా ఆవిర్భవించాడు. ప్రస్తుతం అతడి టర్నోవర్ ఏడాదికి 8 కోట్ల కంటే ఎక్కువ. రమేష్ కు సొంత భూమి లేదు. అతడు జైన కుటుంబానికి చెందినవాడు. కౌలుకు కాస్త భూమి తీసుకున్నాడు. జైనులు పంటల సాగు విధానంలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించరు.. ఆవులను ఇష్టంగా చూసుకుంటారు.. ఆ ఇష్టమే రమేష్ కు కూడా అబ్బింది. కౌలుకు తీసుకున్న భూమిలో రమేష్ ఉల్లి పంట వేశాడు. దానిద్వారా 35 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. తర్వాత కొన్ని ఆవులను తీసుకొచ్చి పెంచడం మొదలుపెట్టాడు.. అలా అతని ఆవుల మంద పెరిగింది. దానికి శ్రీ గిరి గౌ కృషి జాతన్ అనే సంస్థను ఏర్పాటు చేసి.. దాని పేరు మీద గోశాలను నిర్వహిస్తున్నాడు. ఆవులను కొనుగోలు చేసి పాల వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. గీర్ ఆవుపాలతో నెయ్యి తయారీ కూడా మొదలుపెట్టాడు. ఎటువంటి రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ నెగి పేరుతో విక్రయాలు మొదలుపెట్టాడు. ఈ నెయ్యి నాణ్యంగా ఉండడంతో వినియోగదారుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది.. దీంతో ఆవుల సంఖ్యను పెంచాడు. మరింత పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. ఉల్లి, పచ్చి పశుగ్రాసాన్ని సాగు చేయడం మొదలు పెట్టాడు. ఆవుల కోసం షెడ్లను ఏర్పాటు చేశాడు.
123 దేశాలకు..
రమేష్ వద్ద ప్రస్తుతం వందలకొద్దీ ఆవులు ఉన్నాయి. ఈ ఆవులకు ప్రతిరోజు ఉదయం దాణా, మధ్యాహ్నం పచ్చి పశుగ్రాసం, సాయంత్రం ఎండు గడ్డి, ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలు పెడతారు. అందువల్ల అవి విస్తారంగా పాలు ఇస్తాయి. ఒక్కో ఆవు సరాసరి ఐదు నుంచి ఏడు లీటర్ల పాలు ఇస్తుంది.. ఈ పాలను బయట ఇతర ప్రాంతాలకు విక్రయిస్తుంటాడు రమేష్. మిగతా పాలను వేడి చేసి పెరుగుగా మార్చుతారు. ఆ పెరుగు మీద మీగడను వెన్నగా మార్చి.. ఆ తర్వాత నెయ్యి తయారు చేస్తారు. పెరుగును చిలికి మజ్జిగగా మార్చి అమ్ముతారు. నెయ్యి తయారీలో పూర్తిగా ఆర్గానిక్ విధానాన్ని అవలంబిస్తారు.. అందువల్ల ఈ నెయ్యికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ నెయ్యిని 123 దేశాలకు రమేష్ ఎగుమతి చేస్తున్నాడు. రమేష్ వద్ద 250 గిర్ జాతికి చెందిన ఆవులు ఉన్నాయి.. ఈ పాలు, నెయ్యి వ్యాపారం ద్వారా ప్రతి సంవత్సరం 8 కోట్లకు మించి రమేష్ వ్యాపారం చేస్తున్నాడు..