తెలంగాణలో కాకతీయులు ఏలిన ఓరుగల్లు నగరానిది ఘనమైన చరిత్ర. ప్రత్యేకించి వారి కాలంలో శోభిల్లిన శిల్పకళానైపుణ్యాన్ని చూస్తే.. ఎవ్వరైనా అబ్బుర పడాల్సిందే. ఖిలా వరంగల్, వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం సహా.. ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు నాటి కాలంలో చేపట్టారు. ఇందులో రామప్ప ఆలయం అద్వితీయమైన ఘనత సాధించింది. ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.
ఈ ఆలయం ప్రత్యేకత ఏమంటే.. దేశంలో ఏ ఆలయమైనా అందులో కొలువైన దేవుడి పేరుతో పిలవబడుతుంది. లేదంటే.. దాన్ని ఎవరి హయాంలో నిర్మించారో ఆ రాజు పేరుతోనైనా పిలుస్తారు. కానీ.. రామప్ప ఆలయాన్ని మాత్రం దాన్ని నిర్మించిన శిల్పి పేరుతో పిలవబడుతోంది. కేవలం రామప్ప ఆలయానికి మాత్రమే ఈ విశిష్టత ఉంది. ఈ గుడి నిర్మాణంలో చూపించిన ఇంజనీరింగ్ నిపుణతకు, శిల్పకళకు యునెస్కో ప్రతినిధులు సైతం ఆశ్చర్యచకితులయ్యారు. ఆ విధంగా.. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చింది.
తాజాగా చైనాలో జరిగిన యునెస్కో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోటీ పడిన ఇతర దేశాల కట్టడాలను వెనక్కి నెట్టి రామప్ప ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఏ దేశంలోని ఆలయాలకు ఈ గుర్తింపునివ్వాలనే చర్చలో పలు దేశాలు భారత్ ను వ్యతిరేకించగా.. పదిహేడు దేశాలు మద్దతుగా నిలిచాయి. దీంతో.. వరల్డ్ హెరిటేజ్ గుర్తింపులో రామప్పకు చోటు లభించింది. ఖిలా వరంగల్, వేయి స్తంభాల గుడి సైతం పోటీ పడినప్పటికీ.. ఇతర సాంకేతిక కారణాలతో ఈ రెండు ఆలయాల తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి.
రామప్ప ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే.. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు శివుడి మీద భక్తితో 1213లో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణానికి ఏకంగా.. 40 ఏళ్ల సమయం వెచ్చించారు. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతను రామప్ప అనే శిల్పికి అప్పగించారు. ఆయన అద్భుతమైన కళానైపుణ్యానికి ముగ్ధులైన జనం.. ఆయన పేరుమీదనే.. రామప్ప ఆలయంగా పిలుస్తున్నారు.
ఈ టెంపుల్ నిర్మాణాన్ని చూస్తే.. ఆశ్చర్యమేస్తుంది. ఈ ఆలయం నిర్మాణానికి మూడు మీటర్ల లోతు భూమిని తవ్వి, అందులో పూర్తిగా ఇసుకను నింపారు. ఈ ఇసుక ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకున్నారు. అనంతరం ఇసుకపై రాల్లను పేర్చుకుంటూ వచ్చి, కక్ష్యా మంటపం నిర్మించారు. అక్కడి నుంచి ఆలయం నిర్మాణం చేపట్టారు. ఇక, ఈ టెంపుల్ నిర్మాణానికి వాడిన ఇటుక చాలా తక్కువ బరువు ఉంటుంది. అంతేకాదు.. అవి నీటిలో తేలియాడుతాయి కూడా. ఇలాంటి ఇటుకలతో నిర్మించిన ఆలయం దేశంలోనే మరెక్కడా లేదు.
అంతేకాదు.. ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలు సందర్శకులను అలరిస్తాయి. సూద రంధ్రం లాంటి సూక్ష్మమైన శిల్పాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక ఆలయం బరువును మోస్తున్న పిల్లర్లను ఏనుగులుగా చెక్కారు. ఇవి దేనికవే భిన్నంగా ఉండడం గమనార్హం. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి కాబట్టే.. యునెస్కో గుర్తింపు దక్కింది. దీనివల్ల విదేశీ పర్యాటకులు పెరిగే ఛాన్స్ ఉంది. స్థానికంగా ఉపాధి పెరుగుతుంది. ఈ కట్టడం పరిరక్షణకు, అభివృద్ధికి యునెస్కో నిధులు కూడా మంజూరు చేస్తుంది. మొత్తానికి.. రామప్ప ఆలయం ఇన్నాళ్లకు అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది.