State Bank of India : ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది ప్రత్యేక స్థానం. దేశీయ బ్యాంకింగ్ రంగంలో కూడా అగ్రస్థానంలో నిలుస్తోంది ఈ శాఖ. అటువంటి ఎస్బిఐ చరిత్రలో తొలిసారి ఇద్దరు తెలుగు వ్యక్తులు మంచి పదవుల్లో నియమితులు కావడం గమనార్హం. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్ గా తెలుగువాడైన అమర రామ్మోహనరావు నియమితులయ్యారు. వచ్చే మూడేళ్ల కాలానికి ఆయన ఎస్బిఐ ఎండిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎస్బిఐ చైర్మన్ గా ఇటీవలే తెలుగు వ్యక్తి శ్రీనివాసులు శెట్టి నియమితులైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎండిగా ఆంధ్రప్రదేశ్ లోని చీరాలకు చెందిన రామ్మోహన్ రావు నియామకం అయ్యారు. ప్రభుత్వ బ్యాంకులు, కంపెనీలకు సారధులను అన్వేషించే ది ఫైనాన్స్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో ఈ ఏడాది సెప్టెంబర్ లోనే స్టేట్ బ్యాంక్ ఎండి పదవికి రామ్మోహన్ రావు పేరును సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన ఎస్బిఐ డిప్యూటీ ఎండిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతకుముందు ఎస్.బి.ఐ ఎండి గా ఉన్న శ్రీనివాసులు శెట్టి బ్యాంక్ చైర్మన్ గా నియామకమైన క్రమంలో ఆ పోస్ట్ ఖాళీ అయింది. ఇప్పుడు అదే ఎండి పోస్టులో రామ్మోహన్ రావు బాధ్యతలు చేపట్టడం ఖాయంగా తేలింది.
* నాలుగో ఎండిగా బాధ్యతలు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో చైర్మన్ తో సహా నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు ఉంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు రామ్మోహన్ రావు నాలుగో ఎండిగా నియమితులయ్యారు. ఏపీలోని చీరాలకు చెందిన రామ్మోహన్ రావు ఇంజనీరింగ్ పట్టా పొందారు. 1991లో విశాఖలో ప్రొబేషనరీ ఆఫీసర్గా విధుల్లో చేరారు. ప్రస్తుతం బ్యాంకు డిప్యూటీ ఎండిగా పనిచేస్తున్న ఆయన 33 సంవత్సరాలుగా ఎస్బిఐలో వివిధ విభాగాల్లో పని చేశారు. గత ఏడాది ఆగస్టు వరకు ఎస్బిఐ అనుబంధ సంస్థ ఎస్బిఐ కార్డ్స్ ఎండి, సీఈఓ గా సేవలందించారు. దానికి ముందు ఎస్బిఐ గోపాల్ సర్కిల్ సిజిఎం గాను సేవలందించారు.
* చైర్మన్ గా శ్రీనివాసుల శెట్టి
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇద్దరు తెలుగువాళ్లు ఉన్నత సేవలు అందించడం విశేషం. ఇప్పటికే బ్యాంకు చైర్మన్ గా శ్రీనివాసుల శెట్టి ఉన్నారు. ఇప్పటివరకు ఎండిగా ఉన్న ఆయన.. చైర్మన్ గా పదోన్నతి పొందారు. ఎండిగా రామ్మోహన్ రావు ప్రమోట్ అయ్యారు. అంటే ఎస్బిఐ ఇద్దరు తెలుగువారి చేతుల్లో ఉందన్నమాట. మొత్తానికైతే జాతీయస్థాయిలో తెలుగు వారికి ఇది అరుదైన గౌరవంగా చెప్పవచ్చు.