Ram Gopal Varma Konda Movie: కొండా మురళి-సురేఖ చరిత్ర ఇదీ.. ఆర్జీవీ తన సినిమాలో ఏం చూపిస్తాడు?

Ram Gopal Varma Konda Movie: ఏ సరుకైనా మార్కెట్ లో డిమాండ్ ఉన్న వరకే అమ్ముడు పోతుంది. అవసరం లేకుంటే అలా అటక మీద మిగిలి పోతుంది. కొన్ని సరుకులు విభిన్నం. అట్లాంటి సరుకుల ను కొత్త సంచిలో పోసి అమ్మ గలిగేవాడు ఆర్జీవీ. ముంబాయి మాఫియాను, బెజవాడ రౌడీయిజాన్ని, అనంతపురం పరిటాల రవిని, కాపు నేత వంగవీటి రంగాను సినిమాటిక్ గా చూపి ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొన్న వాడు. ఇప్పుడు కొండా మురళీధర్ రావు […]

Written By: Bhaskar, Updated On : June 16, 2022 12:14 pm
Follow us on

Ram Gopal Varma Konda Movie: ఏ సరుకైనా మార్కెట్ లో డిమాండ్ ఉన్న వరకే అమ్ముడు పోతుంది. అవసరం లేకుంటే అలా అటక మీద మిగిలి పోతుంది. కొన్ని సరుకులు విభిన్నం. అట్లాంటి సరుకుల ను కొత్త సంచిలో పోసి అమ్మ గలిగేవాడు ఆర్జీవీ. ముంబాయి మాఫియాను, బెజవాడ రౌడీయిజాన్ని, అనంతపురం పరిటాల రవిని, కాపు నేత వంగవీటి రంగాను సినిమాటిక్ గా చూపి ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొన్న వాడు. ఇప్పుడు కొండా మురళీధర్ రావు అలియాస్ మురళి పై “కొండా”0త నమ్మకం పెట్టుకున్నాడు. కొండాను ఆర్జీవీ నిజంగా చూపగలడా? అసలు కొండాలో ఉన్న సినిమాటిక్ కోణం ఎంత? దాన్ని ఆర్జీవీ ఒడిసి పట్టుకున్నది ఎంత?

Konda Murali, Surekha, ram gopal varma

అంతటా సినిమాటికే..

ఎక్కడో వంచనగిరిలో పుట్టి ఏ రాజకీయ అనుభవం లేని కుటుంబం నుంచి వచ్చిన కొండా మురళి… రాజకీయంగా ఎదిగిన తీరు, ఆయ‌న జీవ‌న గ‌మ‌నంలో క‌నిపించే వెలుగునీడ‌లు సినిమాటిక్‌గానే క‌నిపిస్తాయి. హనుమకొండ ఎల్బీ కళాశాలలో బీఏ చదువుతున్న సమయంలో తన క్లాస్‌మేట్‌ అయిన సురేఖను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఈ విషయంలో ఆర్‌ఎస్‌యూ(రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌) బాధ్యుడు పోలం సుదర్శన్‌రెడ్డి (ఆర్కే) జోక్యం ఇప్పటికీ ఓ సంచలనమే

Also Read: Union Minister Shobha Karandlaje: ఏపీ ఆదాయం విదేశాలకు తరలిపోతోందా? అసలేంటి కథ?

కుక్కను కాల్చి బెదిరించాడు

1987లో బీఏ పూర్తికాగానే తన స్వగ్రామం వంచనగిరిలో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేసిన సంద‌ర్భంలో.. ఊరి కూడలిలో కుక్కను కాల్చి చంపి మరెవరూ పోటీ చేయవద్దని హెచ్చరిక చేశార‌ని ఓ ప్ర‌చారం ఉంది. అలా కేవ‌లం 24 ఏళ్ల వయస్సులో సర్పంచ్‌గా ఎన్నిక కావడం ఇప్పటికీ అక్కడ చర్చల్లో ఉంటుంది.

సురేఖ ను వెలుగులోకి ఎందుకు తెచ్చారంటే

రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అనుసరించిన మార్గాలు ప్రతికూలంగా మారడంతో తన భార్య సురేఖను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చిన తీరు, ఆ తర్వాత ఎమ్మెల్యేను, మంత్రిని చేసిన తీరు ఇప్పటికీ ఆసక్తికరంగానే ఉంటుంది.

బూర్జువా, పీపుల్స్ వార్ తో చెట్టాపట్టాల్

ఒకపక్క బూర్జువా రాజకీయ పార్టీలో కొనసాగుతూ, మరోపక్క పీపుల్స్‌వార్ నేత ఆర్కేతో సంబంధాలు కలిగివుండటం ఇప్పటి వయసు మళ్ళిన రాజకీయ తరానికి విసుకుగా ఉంటుంది.

Konda Murali, Surekha

బెదిరింపులు అక్రమ ఆయుధాలు

హత్యలు, బెదిరింపులు, అక్రమ ఆయుధాలు కలిగిఉండటం వంటి 19 కేసుల్లో నిందితుడిగా ఉండి, కోర్టు విచారణలో నిర్దోషిగా బయటపడటం న్యాయ కోవిదులకి ఆశ్చర్యం గొలుపుతుంది..

కొల్లి ప్రతాప్ రెడ్డి హత్య కేసులో

2002 ఏప్రిల్‌లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కొల్లి ప్రతాప్‌రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సమయంలో అప్పటి వరంగల్‌ ఎస్పీ నళిన్‌ ప్రభాత్‌.. మురళికి బేడీలు వేసి హనుమకొండ చౌరస్తాలో, వంచనగిరిలో పరేడ్‌ చేయించిన ఘటన, ఆ తర్వాత రౌడీషీట్ ఓపెన్ చేయించిన ఘటన…ఎప్పుడో ఒకప్పుడు అందరికీ యాదికే వస్తుంటుంది.

మాంగళ్యాన్ని కాపాడండి

తన భర్తను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు హత్య చేయడానికి కుట్ర చేస్తున్నాడని, తన మాంగళ్యం కాపాడాలని నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యే సురేఖ అప్పటి సీఎం చంద్రబాబును వేడుకోవడం ఒక స్టిగ్మా లాగా మురళిని వేధిస్తూనే ఉంటుంది.

– ఎర్రబెల్లి దయాకర్ రావు – కొండా మురళి మధ్య యుద్ధం విచిత్రంగా కనిపిస్తుంది. ఇద్దరిదీ ఒకే నియోజకవర్గం కాదు, ఎన్నికల బరిలో ఏనాడూ ముఖాముఖి తలపడలేదు. రాజకీయాల్లో ఎర్రబెల్లిది ఒక తరహా ఇమేజ్. అందుకు విరుద్దం మురళి. అయితే ఒకరినొకరు కెలుక్కోవడం “టామ్ అండ్ జెర్రీ” ని తలపిస్తూనే ఉంటుంది.

ఆర్కే తో రచ్చ

2003లో పీపుల్స్‌వార్‌ జిల్లా కార్యదర్శి ఆర్కేతో సంబంధాలు కలిగిఉన్నారన్న ఆరోపణలపై కొండా మురళి–సురేఖలపై ‘పోటా’ కేసు నమోదుకావడం, అది రాజకీయంగా రచ్చ కావడం ఇప్పటికీ ఓ వర్గానికి అంతు పట్టకుండా ఉంటుంది.
ఆర్కేకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను మురళి సమకూర్చాడని పోలీసులు ప్రకటించడం, దానిని ఆర్కే ఖండిస్తూ ప్రజలే తమకు బుల్లెట్ ప్రూఫ్ అని జవాబివ్వడం సినిమాటిక్ గానే ఉంటుంది.

Konda Murali, rk

జిలానీ బేగానికి అన్నం పెట్టడం

పీపుల్స్ వార్ గెరిల్లా పై తీవ్ర నిర్బంధం ఉన్న రోజుల్లో వరంగల్ సెంట్రల్ జైలు నుంచి విడుదలైన నక్సలైట్ జిలానీబేగంను తన వాహనంలో ఇంటికి తీసుకువెళ్ళి, భోజనం పెట్డించి పంపించడం సినిమాలాగే ఉంటుంది.

ఆర్కే సహకారం

హత్యా రాజకీయాల ఆరోపణల్లో కూరుకుపోయి, పలు కేసులో నిందితుడిగా నమోదై ఉన్నప్పటికీ, మురళికి అప్పటి పీపుల్స్‌వార్‌ జిల్లా కార్యదర్శి ఆర్కే ఒక్క హెచ్చరిక కూడా చేయకపోవడం ఓ క్లాసిఫైడ్ లాగా ఉంటుంది.

Also Read: Producer Dil Raju Into The TRS Party: TRS పార్టీలోకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఎక్కడి నుండి పోటీ చెయ్యబోతున్నాడో తెలుసా?

గడ్డం గీసింది అందుకే

-కొండా ముర‌ళి-సురేఖ‌ల‌కు వైఎస్‌తో ఉన్న అనుబంధం, ఆయ‌న అండ‌, ఆద‌ర‌ణ ఒక ఎత్త‌యితే, గ‌డ్డం తీసేసి ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో క‌నిపించు అని వైఎస్ చేసిన సూచ‌న‌… దానిని ముర‌ళి ఆచ‌రించిన తీరు.. క్లీన్ ఇమేజ్ లాగే కనిపిస్తుంది. 2009లో వైఎస్‌ రెండోసారి సీఎం అయినప్పుడు.. సురేఖ మంత్రి కావడం, వైఎస్‌ మరణానంతరం జగన్‌కు సీఎం చాన్స్‌ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తన మంత్రి పదవిని కొనగోటితో విసిరిపారేయడం అభిమానానికి కొత్త అర్థం చెప్పినట్టే కనిపిస్తుంది.

ఫ్యాక్షన్ రాజకీయాలకు బీజం

వ‌రంగ‌ల్‌లో ఫ్యాక్ష‌న్ త‌ర‌హా రాజ‌కీయాల‌కు బీజం వేసింది ముర‌ళీయేన‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక ప్ర‌చారం ఉంది. ముర‌ళి కూడా త‌న‌ను తాను ఫ్యాక్ష‌న్ త‌ర‌హా రాజ‌కీయ నేత‌గా ఫోకస్ కావ‌డానికి ఇష్ట‌ప‌డిన‌ట్టు క‌నిపించ‌డం ఆసక్తిగా ఉంటుంది..

బేడీలు వేసిన చేతులే సెల్యూట్ చేశాయి

-2002లో కొల్లి ప్ర‌తాప్‌రెడ్డి హ‌త్య కేసులో ముర‌ళిని బేడీలు వేసి ప‌రేడ్ చేయించిన పోలీసులు… 2009లో సురేఖ తొలిసారి మంత్రి అయి, త‌న భ‌ర్త ముర‌ళితో క‌లిసి వ‌రంగ‌ల్ కు వ‌చ్చిన‌ప్పుడు, అదే పోలీసులు అధికార లాంఛ‌నాల‌తో స్వాగ‌తం ప‌ల‌క‌డం, ఐపీఎస్‌లు సైతం సెల్యూట్ చేయ‌డం.. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లోనిభిన్న పార్శ్వాల‌కు నిద‌ర్శ‌నంగా కనిపిస్తాయి.

Konda Murali , Surekha

– 2010లో మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సురేఖ.. తెలంగాణ ఉద్యమనేతలను బండబూతులు తిడుతూ, ఉద్యమకారులపైకి రాళ్లు విసిరి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఒకింత రచ్చ గానే ఉంటుంది.
సీన్‌ కట్‌ చేస్తే, 2014లో టీఆర్‌ఎస్‌లో చేరడం, వరంగల్‌ తూర్పు టికెట్‌ తెచ్చుకోవడం, అలవోకగా ఎమ్మెల్యేగా గెలుపొందడం, తెలంగాణ ఉద్యమంతో మమేకం కాకుండానే ఇదంతా జరగడం యాదృచ్ఛికంగానే ఉంటుంది.
2018 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం టికెట్‌ కేటాయించకపోవడంతో, ధిక్కార స్వరం వినిపించి తిరిగి కాంగ్రెస్‌లో చేరడం, పరకాల టికెట్‌ తెచ్చుకోవడం, టీఆర్ఎస్ లో చేరడం తప్పని పశ్చాత్తాపం ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌ను ఉతికి ఆరేయడం కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంది.
మురళి తన రాజకీయ జీవితంలో రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో స్వయంగా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోయారు. భార్యను నాలుగు సార్లు ఎమ్మెల్యేను చేసిన వ్యక్తి.. బరిలోకి దిగలేకపోవడం కొత్త ఆలోచన కలిగిస్తుంది.

కొండగిరి సాయి

సాయినాథుడికి మురళి పరమభక్తుడు. తన ఇలాఖాలోని కోటగండి వద్ద సాయినాథుడికి గుడి కట్టించి తన ఇంటిపేరు కలిసేలా కొండగిరి సాయినాథుడి ఆలయంగా నామకరణం చేయడం భక్తికి పీక్స్ లాగా కనిపిస్తుంది. ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాల వేళ.. 9 రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటం నార్మాలిటీకి భిన్నంగా ఉంటుంది సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా.. ఆమె నిమిత్తమాత్రం. కర్త,కర్మ, క్రియ అంతా మురళీనే. ముందూవెనుకా ఆయనే కథ నడిపించే వారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఆయనే మెయింటేన్‌ చేసేవారు. ప్రతిరోజూ తెల్లవారుజాము 5 గంటల నుంచే ఆయన నివాసం వద్ద వందలాదిమంది కనిపించడం సర్వసాధారణంగా ఉండేది. ఈ తరహా ఫాలోయింగ్‌ తమకు లేకపోవడం ఇతరులకి మింగుడు పడకుండా ఉంటుంది.

అబ్బుర పులి కొండా మురళి

ప్రజాక్షేత్రంలో మురళికి పక్కా మాస్ ఫాలోయింగ్ కనిపిస్తుంది. ‘అబ్బర పులి… కొండా మురళి’ లాంటి టైటిల్స్ తో ఆయన అభిమానులు యాడ్స్ ఇవ్వడం, ఫ్లెక్సీలు ప్రదర్శించడం విచిత్రంగా ఉంటుంది.
తనను నమ్ముకున్న, తనను ఆశ్రయించిన వారికి వెంటనే స్పందించి ‘పని’ చేసి పెడ‌తార‌ని ఎప్పటికీ ప్ర‌చారంలో ఉంటుంది.
వరంగల్‌ జిల్లా రాజకీయ రక్తచరిత్రను తడిమినప్పుడు మురళి ప్రముఖంగా కనిపిస్తారు. తన ప్రత్యర్థులతో నిత్య యుద్ధం జరిగేది. ఇరువర్గాల మధ్య జరిగిన గొడవల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.. మరెంతోమంది క్ష‌త‌గాత్రుల‌య్యారు. అయితే ఏ ఒక్క కేసులోనూ ఆయనకు శిక్ష పడకపోవడం న్యాయ వ్యవస్థ తీరును దఖలు పరుస్తుంది.
అగ్రకుల అహంకార నేతలను మురళి బలంగా ఢీకొట్టగలిగినా.. తనదైన శైలిలో వారికి చుక్కలు చూపించగలిగినా.. ఆ తరహా ఛాయలు తనలోనూ ఉండటం, అవి అనేకసార్లు బయటపడటం ఒక వైరుధ్యంగానే కనిపిస్తుంది.
నక్సల్‌ నేత ఆర్కేను మురళి వాడుకున్నారా… మురళిని ఆర్కే వాడుకున్నారా.. అనేది ఎప్పటికీ తేలని అంశం. అయితే ఇద్దరి సంబంధాలపై ప్రచారంలో ఉన్న అనేక అంశాలు రహస్యంగానే కనిపిస్తాయి.
‘మురళిని ఎందుకు స్పేర్‌ చేస్తున్నారు…?’ అని ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆర్కే మౌనం వహిస్తూ సమాధానం దాటవేయడం ఎర్ర జెండాలోనూ భూర్జువా విధానాలు ఉన్నాయి అని అనిపిస్తుంది.
పెత్తందారీ వ్యవస్థతో కాకుండా పెత్తందారీ నేతలతో మురళి రాజకీయ పోరాటం సాగించారు. అయితే అది ప్రజల కోసం కాకుండా, తన రాజకీయ ఎదుగుదల కోసం చేయడం తేడాగా అనిపిస్తుంది
మురళి రాజకీయ ప్రవేశం accidental కాదు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలను గోల్ గా మలుచుకున్నారు. రాజకీయాలలో వేగంగా ఎదిగేందుకు అవసరమైన అవకాశాలను ఒడుపుగా అందిపుచ్చుకున్నారు. తనవైన పద్ధతులను అనుసరించారు. ఆయనతో ఎవరూ సుదీర్ఘకాలం సహవాసం చేయలేరనే వ్యాఖ్య వాస్తవానికి దర్పణంగా నిలుస్తుంది

అందుకే వర్మకు నచ్చాడా

Konda Murali , Surekha, ram gopal varma

అగ్రెసివ్‌గా, అఫెన్సివ్‌గా ముందుకుసాగడం మురళి రాజకీయశైలి ఇవే ఆర్జీవీ దృష్టిలో మురళిని విలక్షణ నేతగా ఫోకస్‌ చేసినట్టు కనిపిస్తుంది. కొండా మురళి–సురేఖల రాజకీయ జీవితానికి సంబంధించి బయటి ప్రపంచానికి తెలియనివి మరెన్నో ఉన్నాయి. సినిమా తీయడానికి అవసరమైనంత ‘సరుకు’ కొండా మురళి–సురేఖల జీవితాల్లో పుష్కలంగా ఉంది. అయితే వర్మ తన సినిమాలోకి ఈ అంశాలను ఎలా తీసుకుంటాడు..? ఎన్ని తీసుకుంటాడు..? వాటిని ఎలా ప్రజెంట్‌చేస్తాడు.. ? అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఎవరిని విలన్‌గా చూపిస్తాడు..? కొండా చిరకాల శత్రువు ఎర్రబెల్లి దయాకర్‌రావునా..? కొండా రాజకీయ జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టిన కేసీఆర్‌నా..?
58 ఏళ్ల ముర‌ళికి వ‌ర్మ సినిమా ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది? వీటి అన్నింటికి త్వరలో విడుదలయ్యే సినిమానే సమాధానం చెబుతుంది.

Also Read: AB Venkateswara Rao: జగన్ తో ఫైట్.. అతడే గెలిచాడు..

Tags