Chandrababu: ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు ఇంట్లో రాజ్యశ్యామల యాగం ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 50 మంది రుత్వికుల ఆధ్వర్యంలో యాగం మొదలైంది. మూడు రోజులపాటు జరగనున్న పూజా కార్యక్రమాల్లో తొలిరోజు చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు.ప్రస్తుతం ఎన్నికల వ్యూహాల్లో చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. జనసేనతో సీట్ల సర్దుబాటు, బిజెపితో పొత్తు చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మూడు రోజులు పాటు రాజశ్యామల యాగం నిర్వహిస్తుండడం విశేషం. గత డిసెంబర్ లోనూ చంద్రబాబు నివాసంలో యాగం జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు చండీయాగం, సుదర్శన,నరసింహ హోమం నిర్వహించారు.
గత ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్ ఇటువంటి హోమాలే నిర్వహించారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ సైతం హోమాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో రాజశ్యామల యాగం అంటే ముందుగా గుర్తొచ్చేది స్వామి స్వరూపానందేంద్ర. తెలంగాణలో కెసిఆర్, ఏపీలో సీఎం జగన్ తో చాలాసార్లు స్వరూపనంద స్వామి రాజశ్యామల యాగాలు చేయించారు. వారిద్దరూ అధికారంలోకి రాగలిగారు. అయితే చంద్రబాబు ఇటీవల యాగాలు చేపడుతున్నా..అవి ఆయన స్వగృహంలోనే జరుపుతుండడం విశేషం.
మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ లోని తన నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఫామ్ హౌస్ లో స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రమే విజయం అందుకున్నారు. కెసిఆర్ కు ఓటమి తప్పలేదు. ఇప్పుడు చంద్రబాబు సైతం అదే యాగం నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో రిత్వికులు యాగం నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు చంద్రబాబు నివాసంలో ఈ యాగక్రతువు కొనసాగునుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విజయం అందుకుంటారో? లేదో? చూడాలి.