
Rajdeep Sardesai- KCR: ఆయన మాట మాట్లాడితే బంగారు తెలంగాణ అంటాడు. బంగారు తెలంగాణను పూర్తి చేశాం. బంగారు భారత్ వైపు అడుగులు వేస్తున్నాం అని చెప్తున్నాడు. పనిలో పనిగా తన పార్టీ పేరులో ఉన్న తెలంగాణలో తీసేసాడు. అందులో భారత్ ను చేర్చాడు.. సరే దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఆ మార్పు ఉండాలేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ప్రణాళికలు వేరే ఉన్నాయని, వాటికి సంబంధించిన డబ్బూ దస్కం భారీగానే వెనుకేశాడని, ఇప్పుడు వాటిని ఖర్చు పెట్టేందుకు గట్టి ప్లాన్ రూపొందించాడని బయటకు పొక్కింది. అది చెప్పింది ఎవరో కాదు… ఆయనకు ఇష్టమైన జర్నలిస్ట్.
రాజ్ దీప్ సర్దే శాయ్ ఓ వీడియోలో పేర్కొన్న మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. మోడీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ గా చేస్తే, దేశంలోని విపక్ష పార్టీల ఎన్నికల ఖర్చు మొత్తం భరించేందుకు కేసీఆర్ చెప్పారని ఓ వీడియోలో పేర్కొన్నాడు.. తన సహచర నేతలతో ఓ ప్రైవేట్ సమావేశంలో కెసిఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు రాజ్ దీప్ వివరించాడు. అయితే గత కొంతకాలంగా దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసిఆర్ సన్నద్ధమవుతున్నారు. ఇందుకు గానూ తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. గతంలోనూ దేశంలోని ప్రతిపక్షాల తీరును కూడా ఆయన ఎండగట్టారు. మోదీకి చెక్ పెట్టేంత సీన్ ప్రతిపక్ష నాయకులకు లేదని చురకలు అంటించారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అవసరమైతే మోడీ వ్యతిరేక బాధ్యత తాను తీసుకుంటానని అప్పట్లో కెసిఆర్ వ్యాఖ్యానించారు. అయితే వాటికి రాజ్ దీప్ విడుదల చేసిన వీడియో బలం చేకూర్చుతోంది.
అయితే విపక్ష పార్టీలకు చైర్మన్ గా ఉండేందుకు కేసిఆర్ ను వారు అంగీకరిస్తారా, కెసిఆర్ ప్రతిపాదనను వారు ఆమోదిస్తారా? కెసిఆర్ ను ప్రథముడిగా ఒప్పుకుంటారా అనేది తేలాల్సి ఉంది. రాజ్ దీప్ వ్యాఖ్యానించినట్టు దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు అంటే 20వేల కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల మాదిరి అయితే ఆ డబ్బు ఇంకా ఎక్కువ ఖర్చు కావచ్చు. కానీ అంత భరించేంత స్థాయి కేసీఆర్ దగ్గర ఉందా? అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఔను చెబుతున్నారు రాజ్ దీప్.

భారత రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత దేశ వ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను కూడగట్టాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే కెసిఆర్ పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర ప్రాంతాలకు స్వయంగా వెళ్లారు. త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లను కలిసి మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన జెడిఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని అనేకమార్లు హైదరాబాదు నగరానికి రప్పించుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామికి ఆర్థిక సహాయం చేస్తానని మాట ఇచ్చినట్టు, ఇప్పటికే కొంతమేర ముట్ట చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మహారాష్ట్రలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు భారత రాష్ట్ర సమితిలో కెసిఆర్ సమక్షంలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర లాంటి చోట్ల ఇప్పటివరకు అసలు ఉనికిలోని భారత రాష్ట్ర సమితిలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు చేరడం వెనుక మతలబు ఏమిటి అనే దానిపైన చర్చ నడుస్తోంది.. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లోనూ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాల ఏర్పాటు, వాటి నిర్వహణ వంటి వాటికోసం కేసీఆర్ ఏమాత్రం వెనకాడకుండా డబ్బులు ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం కూడా జరుగుతున్నది. అంతేకాదు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నాయకులు హైదరాబాద్ వచ్చేందుకు ప్రత్యేకంగా విమానాలు పంపిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలు గమనిస్తే రాజ్ దీప్ చెప్పిన విషయంపై విశ్వసనీయత పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.