
E.E Saida: నిజాయితీ.. నిఖార్సుగా పనిచేయం అనేది కత్తిమీద సామే. పురుష ఉద్యోగులు ఒత్తిడిని తట్టుకోలేకపోతుంటారు. అటువంటిది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మహిళా అధికారిణి చుక్కలు చూపించింది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లను లెక్కచేయగా దాడు చేసింది. శభాష్ అనిపించుకుంది నగరపాలక సంస్థకు చెందిన పర్యావరణ ఇంజనీరు సైదా.
రాజమండ్రిలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంది. అధికారులు ఎంతచెప్పినా వ్యాపారులు వినకపోవడంతో ఈఈ సైదా ప్లాస్టిక్ కట్టడికి నడుంబిగించింది. నగరపాలక సంస్థ పారిశుధ్య ఉద్యోగులతో ఉదయాన్నే హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు ప్రధానంగా ఉండే మార్కెట్ కు చేరుకుంది. ఒక్కొక్క షాపును తనిఖీ చేయడం మొదలుపెట్టారు.
గుట్టగుట్టలుగా ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లను వెలికితీశారు. దాడులు చేసే క్రమంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు వచ్చాయి. అయినా, ఆమె వెరవక పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని తెగేసి చెప్పింది. చివరకు విషయాన్ని కార్పొరేషన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కొంతమంది నేతలు మార్కెట్ కు వెళ్లి హడావుడి చేశారు. అయినా లెక్క చేయలేదు. ఇంత పెద్ద మొత్తంలో సరుకు పట్టుబడటం మొదటిసారని అక్కడి ప్రజలు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నగర పాలక సంస్థలో ప్లాస్టిక్ వినియోగం నియంత్రణకు ఈఈ సైదా దాడులకు వస్తున్నారంటే దుకాణదారులు భయపడే పరిస్థితికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం పథకాల పర్యవేక్షణ విభాగంలో పని చేస్తున్న ఈమె ఇటీవల గుంటూరు నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. మహిళా సాధికారత అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వాలు.. ఇటువంటి మహిళా అధికారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.