పగబట్టినట్లే వానలు.. ఎందుకిలా?

భాగ్యనగరంపై వరుణుడు పగబట్టినట్లుగా ఉన్నాడు. అందుకే మహానగరాన్ని మహా వరదలతో ముంచెత్తుతున్నాడు. మూడు నాలుగు రోజుల క్రితమే కుండపోతతే హైదరాబాద్‌ను ముంచిన వర్షం.. నిన్నటి సాయంత్రం మరోసారి బీభత్సం సృష్టించింది. సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఎడతెరపి లేకుండా కురిసింది. మరోమారు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఓల్డ్‌ మలక్‌పేటలో రోడ్డుపై వెళ్తున్న ఓ కూలీ కరెంట్‌ షాక్‌తో చనిపోయాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాములుగా గుర్తించారు. Also Read: ప్రగతి భవన్ టూ గజ్వేల్ రాకపోకలపై […]

Written By: NARESH, Updated On : October 18, 2020 4:57 pm
Follow us on

భాగ్యనగరంపై వరుణుడు పగబట్టినట్లుగా ఉన్నాడు. అందుకే మహానగరాన్ని మహా వరదలతో ముంచెత్తుతున్నాడు. మూడు నాలుగు రోజుల క్రితమే కుండపోతతే హైదరాబాద్‌ను ముంచిన వర్షం.. నిన్నటి సాయంత్రం మరోసారి బీభత్సం సృష్టించింది. సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఎడతెరపి లేకుండా కురిసింది. మరోమారు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఓల్డ్‌ మలక్‌పేటలో రోడ్డుపై వెళ్తున్న ఓ కూలీ కరెంట్‌ షాక్‌తో చనిపోయాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాములుగా గుర్తించారు.

Also Read: ప్రగతి భవన్ టూ గజ్వేల్ రాకపోకలపై ఎమ్మెల్యే సీతక్క పంచ్

మొన్నటి వానకు ముంపు ప్రాంతాల్లోకి మరోసారి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. రోడ్లన్నీ మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. కాలనీల్లోకి నీరు చేరింది. ఇప్పటికే చాలా కాలనీల నుంచి నీరు కూడా పోలేదు. పోయిన చోటల్ల బురద నిండి ఉంది. దానిని క్లీన్‌ చేసే పనిలో అటు జనం, ఇటు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఉన్నారు. కానీ.. ఇంతలోనే మళ్లీ వాన ఊపందుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. అప్పుడైతే ఎలా స్పందించలేదో.. ఈసారీ ఆఫీసర్లు స్పందించలేదు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు.

శనివారం కురిసిన వర్షానికి రోడ్లు, కాలనీలు చెరువులను తలపించాయి. మెయిన్‌ రోడ్డుపైన కూడా మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. ముఖ్యంగా చింతల్‌కుంట, ఎల్బీనగర్‌‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, సాగర్‌‌ రింగ్‌ రోడ్డు, లక్డీ కా పూల్‌, ఖైరతాబాద్‌ సహా ప్రధాన ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది. నాలాలు, మ్యాన్‌ హోల్స్‌ ఉప్పొంగి నీరంతా రోడ్లపైకి వచ్చింది. అపార్ట్‌మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి.

ఆఫీసు పనులు పూర్తి చేసుకొని.. జనాలు రోడ్డెక్కే సమయంలోనే వర్షం పడడంతో ఫుల్‌ ట్రాఫిక్‌ జామైంది. చాదర్‌‌ఘాట్‌, కోఠి, బేగంపేట్‌, పంజాగుట్ట, మలక్‌పేట్‌, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌, సికింద్రాబాద్‌, ప్యారడైస్‌, రాణిగంజ్‌, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌‌, ఉప్పల్‌, టోలీచౌకి, గచ్చిబౌలి, సాగర్‌‌ రింగ్‌ రోడ్‌ ఏరియాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జనం గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.

మరోవైపు మాదాపూర్‌‌, నానక్‌ రామ్‌గూడ, రాయదుర్గం ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ స్తంభించడంతో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిని తెరిచి వాహనాలను అనుమతించారు. ప్రతీ వీకెండ్‌లో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి సందర్శనకు పర్మిషన్‌ ఇస్తుండగా.. వర్షాల నేపథ్యంలో వారం పాటు ఈ సదుపాయం తొలగించారు. అలాగే.. మేడిపల్లి నుంచి ఉప్పల్‌ వరకు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. విజయవాడ–హైదరాబాద్‌ హైవే, హైదరాబాద్‌–బెంగళూరు హైవేలపై నీరు చేరింది. బెంగళూరు–హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను ఔటర్‌‌ రింగ్‌రోడ్డుకు మళ్లించారు.

Also Read: దుబ్బాకలో హరీశ్‌ సీక్రెట్‌ టాస్క్‌?

ఇదిలా ఉండగా.. ఇప్పటికే భారీ వర్షాలతో నానా అవస్థలు పడుతున్న మహానగరం ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రస్తుతం రంగారెడ్డి, జీహెచ్‌ఎంసీ పరిధిలో కురుస్తున్న వానలు చివరి రోజుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలకూ విస్తరిస్తాయని పేర్కొంది. మరో రెండు రోజుల పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.