భారీ వర్షాలు కేరళను మరోసారి ముంచెత్తుతున్నాయి. గత పదేళ్లలో రెండు సార్లు రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టించాయి. తాజాగా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో రోడ్లు ధ్వంసమయ్యాయి.. ఇళ్లు కొట్టుకుపోయాయి.. కొండచరియలు విరిగిపడుతున్నాయి.. మొత్తంగా ఈ విలయంతో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ను ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను ప్రారంభించింది.
కేరళ్లలో ఇలాంటి వరద బీభత్సం జరగడం మూడోసారి. 2018, 2019ల్లోనూ వరుసగా ఇలాంటి విపత్తే జరిగింది. ఈ వరదలతో ఎక్కువగా కొట్టాయం, ఇడుక్కి, కొట్టిక్కళ్, పెరువనంథనం, కొక్కయార్ గ్రామాల్లో భారీగా నష్టం ఏర్పడుతోంది. వీటితో పాటు ఎర్నాకుళం, అలప్పుజ, త్రిశూర్, మళప్పురం, కొల్లం, పాలక్కాడ్ జిల్లాల్లోనూ వరద నష్టం భారీగానే ఉంటోంది. తాజాగా కురుస్తున్న వర్షాలకు కొట్టాయం, ఇడుక్కి, పథనందిట్ట జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు.
కేరళలో కురుస్తున్న వర్షాలకు రోడ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తేయాకు తోటలు ఉండే గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపుగా రాష్ట్రం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొట్టాయం జిల్లాలో ఆర్టీసీ బస్సు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు తాళ్లు వేసి బయటికి లాగారు. అందులో ఉన్న 25 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పథనంథిట్ట జిల్లావ్యాప్తంగా గ్రామాలు నీట మునిగాయి.
భారీ వర్షాల కారణంగా కేరళలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. ఇంకా చాలా మంది వరదనీటిలో కొట్టుకుపోయారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇడుక్కి జిల్లాలోని కంఝూర్ గ్రామంలో వరద ప్రవాహంలో కారు కొట్టుకు వచ్చింది. అందులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే మరిన్ని ప్రాణాలు కోల్పోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొందరికి పాఠశాలల్లో, ఇతర భవనాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు.
భారీ వర్షంతో ఇక్కడి ప్రాజెక్టులు నీటికుండల్లా మారాయి. ప్రతీ వైపు నుంచి నీరు చేరడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టు సమీపంలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇడుక్కి, పథనం థిట్ట, కొట్టాయం జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం తప్పలేదని అధికారులు తెలుపుతున్నారు. కొన్నిచోట్ల వరద తీవ్రమవడంతో హఠాత్తుగా గేట్లు ఎత్తాల్సి వచ్చిందని అంటున్నారు.