Rahul Gandhi Telangana Tour: తెలంగాణలో నేటి నుంచి రెండు రోజుల పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. వరంగల్ లో నిర్వహించే రైతు సంఘర్షణ సభతో కాంగ్రెస్ లో నూతనోత్తేజం నింపాలని టీడీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే జనసమీకరణ కోసం అహర్నిశలు శ్రమస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటనతో నేతల్లో ఉత్తేజం రావాలని ఆకాంక్షిస్తున్నారు. విభేదాలు పక్కనపెట్టి ఏకతాటిపై నిలిచి తమ బలం నిరూపించుకోవాలని భావిస్తున్నారు. దీనికి గాను ఎంతటి త్యాగానికైనా వెనుకాడటం లేదు. ఎంత ఖర్చయినా పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ దినపత్రికలలో ఇచ్చిన జాకెట్ ప్రకటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. తెలంగాణలో ఇన్నాళ్లు పార్టీ ఏ కార్యక్రమాలు చేపట్టకుండా ఉండటంతో ప్రజల్లో కూడా పార్టీ ఉందనే భావన పోతోంది. ఈనేపథ్యంలో పార్టీ తన ఉనికి చాటుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది. దీనికి గాను రాహుల్ పర్యటనను విజయవంతం చేసి తద్వారా లబ్ధి పొందాలని చూస్తోంది. అందుకే జనసమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భారీగా జనాన్ని తరలించి తమ సత్తా చాటాలని నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెసే అయినా ఫలితాలు మాత్రం కేసీఆర్ అనుభవిస్తున్నాడు. అమరవీరుల రక్తపు బొట్టను తన పదవులకు ఆయుధాలుగా వాడుకున్నాడని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇకపై కేసీఆర్ ఆటలు చెల్లవనే ఉద్దేశంతోనే ఇక టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో కేసీఆర్ కు భంగపాటు తప్పదనే సంకేతాలు ఇస్తోంది. మరోవైపు బీజేపీ కూడా పుంజుకోవడంతో రాష్ట్రంలో త్రికోణ పోటీ ఉంటుందని చెబుతున్నారు.
హైదరాబాద్ లో కూడా రాహుల్ పర్యటనను దిగ్విజయం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నా అక్కడ పరిస్థితులు అనుకూలించడం లేదు. ఓయూ వీసీ అనుమతి నారాకరించడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనే దానిపై అందరికి అనుమానాలు ఉన్నాయి. ఓయూలో విద్యార్థులతో మిలాఖత్ అవ్వాలని ప్రయత్నాలు చేసినా అవి తీరేలా కనిపించడం లేదు. కానీ రాహుల్ పర్యటనలో ఏ అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకుని లాభం పొందాలని పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి నేతలతో మాట్లాడారు. పరిస్థితులకనుగుణంగానే నిర్ణయాలు తీసుకుని ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలని మార్గాలు అన్వేష్తున్నట్లు తెలుస్తోంది.