
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో వైసీపీ పార్టీ కష్టాలు పడుతోంది. ఆయనను నిలువరించడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయినా ఫలితం ఉండడం లేదు. ఇరువైపుల పట్టింపులకు పోతే పార్టీకే నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా విజయసాయిరిడ్డి వినడం లేదు. రఘురామను ఏదో చేయాలనే ధోరణిలో పార్టీకి అగాధం తెస్తున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని లేకపోతే పార్లమెంట్ నే స్తంభింపచేస్తామని స్పీకర్ కే అల్టిమేటం జారీ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైసీపీలో అసలు ఏం జరుగుతుందోననే అనుమానాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. చిన్నపాటి వ్యవహారానికి ఇంత రాద్దాంతమా అని ప్రశ్నిస్తున్నారు.
రఘురామ వ్యవహారంలో సభాపతినే ప్రశ్నించడం బీజేపీకి ఆగ్రహం కలిగిస్తోంది. ఉద్దేశ పూర్వకంగానే జాప్యం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో ఈనెల 19న మొదలయ్యే లోక్ సభ సమావేశాల్లో రఘురామపై వేటు వేయాలని, ఆయన పార్టమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా చూడాలని పార్టీ ఆలోచన. కానీ అవి ఫలించే అవకాశాలు లేవు. తనపైపోలీసుల దాడి సంఘటనకు సంబంధించి సభాహక్కుల ఉల్లంఘన ప్రతిపాదనకు రఘురామ ఇతర పార్టీల మద్దతు కూడగడుతుండడంతో వైసీపీకి ఇబ్బందిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
మొదట్లో సీఎంకు రఘురామకు విభేదాలు లేవు. ఏడాది క్రితం విజయసాయిరెడ్డినే ఆయనను కెలకింది. రఘురామ బీజేపీ సభ్యులతో కలిసి తిరిగేవారు. ఇది విజయసాయిరెడ్డికి నచ్చలేదు. దీంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కానీ రఘురామ తనకు సీఎం ఒక్కరే బాస్ అని ఎవరో చెబితే నేను వినను అని మొండికేశాడు. దీంతో ఇద్దరి మధ్య అగాధం పెరిగింది. ఫలితంగా పట్టింపులు పెరిగిపోయాయి. చివరికి అవి ముదిరిపోయి పెద్దవైపోయి విమర్శలకు దారి తీశాయి. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాడని సీఎం జగన్ కు సైతం నూరిపోశారు. ఫలితంగా ముఖ్యమంత్రితో కూడా దూరం పెరిగి ఇంత గొడవ జరుగుతోంది.
రఘురామ కృష్ణంరాజుపై అనర్హతవేటు వేయించాలని వైసీపీ ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. చట్టంలో ఉన్నరెండునిబంధనలు వర్తించకపోవడంతో స్పీకర్ సైతం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ విప్ ను ధిక్కరించడం, స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం చేస్తే ఆటోమేటిగా ఎంపీగా అనర్హుడు అవుతాడు. కానీ ఆయన తెలివిగా తన ప్రభుత్వంలోని తప్పులను ఎత్తి చూపుతున్నాడు. పార్టీకి అప్రదిష్ట తెస్తున్నాడు. దీంతో వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. సొంత పార్టీలోనే ప్రతిపక్ష నేతను పెట్టుకున్నట్లు భావిస్తోంది. రఘురామ వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పిగా భావిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం రఘురామపై రాజద్రోహం కేసు సైతం నమోదు చేసి ఆయనను జైలు పాలు చేసింది. దీంతో ఈ విషయాన్ని న్యాయస్థానాలు, ప్రభుత్వం, లోక్ సభలో ఇతర పార్టీల దృష్టికి తీసుకెళ్లడంతో రఘురామకు సానుభూతి పెరిగింది. ప్రభుత్వంపై మచ్చ పడింది. సొంత పార్టీ ఎంపీనే ఇలా చేయిస్తారా అనే కోణంలో పలువురు నిలదీశారు. ఈ విషయమై పార్టీ డోలాయమానంలో పడింది. రఘురామ వ్యవహారాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదించనున్నట్లు తెలుస్తోంది.
లోక్ సభ సభ్యుడిపై భౌతిక దాడి చేయించిందంటూ ప్రివిలేజ్ మోషన్ కోసం ప్రయత్నిస్తున్నారు రఘురామ. కనీసం సభలో అయిదు నిమిషాలు మాట్టాడటానికి అవకాశం కల్పించాలని సభాపతిని కోరారు. ఇదే జరిగితే మిగతా సభ్యుల మద్దతు కూడగట్టుకుని రఘురామ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకు తక్షణమే అతనిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ పై ఒత్తిడి పెంచుతోంది. లేకపోతే సభను స్తంభింపజేస్తామని వైసీపీ సభ్యులు పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. దీంతో సభ నిర్వహణ రసకందాయంలో పడేట్లు కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో నెలకొన్న సమస్యలపై ఏనాడు పెదవి విప్పని సభ్యులు రఘురామ వ్యవహారంపై మూకుమ్మడిగా మాట్లాడడం నివ్వెరపరుస్తోంది. ఒక వ్యక్తిగత సమస్యను పార్టీ ఇంత సీరియస్ గా తీసుకుని రాద్దాంతం చేయడంపై పలు పార్టీల్లో అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. రాష్ర్టంలో ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ, ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ విభజన తదితర సమస్యలుండగా సాధారణ సమస్యను పట్టుకుని స్పీకర్ కే అల్టిమేటం జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రతిష్ట మసకబారిపోతోందిన నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే భవిష్యత్ లో జగన్ కష్టాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.