ఏపీ సీఎం జగన్ పై మీడియాలో.. సోషల్ మీడియాలో ఇన్నాళ్లుగా రెచ్చిపోయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు చితక్కొట్టారా? ఆయన కాలి గాయాలు చూస్తే నిజంగానే కొట్టినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఎంపీ రఘురామ కాళ్లు దెబ్బలతో కందిపోయిన ఫొటోలు వైరల్ గా మారాయి. పోలీసులు కొట్టారా? లేక దెబ్బలు తగిలాయా? అన్నది తేలాల్సి ఉంది. తాజాగా ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా కోర్టులో బాంబు పేల్చారు. తనను పోలీసులు కాళ్లు వాచిపోయేలా కొట్టారని.. నిన్న రాత్రి వేధింపులకు గురిచేశారంటూ రఘురామకృష్ణంరాజు కోర్టు జడ్జీకి ఫిర్యాదు చేశారు. నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదును న్యాయమూర్తికి రఘురామ అందజేసినట్టు సమాచారం.
అంతకుముందు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు హైకోర్టు ఆదేశానుసారం సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. గుంటూరులోని సీఐడీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ను జడ్జీకి అందజేశారు. ఎంపీ కాలి గాయాలు చూసి రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించినట్టు సమాచారం. ఎంపీ రఘురామను వెంటనే వెంటనే మెడికల్ బోర్డుతో పరీక్ష చేయించాలని కోర్టు ఆదేశించింది. సెషన్స్ కోర్టు రికార్డు స్టేట్ మెంట్ ను వెంటనే హైకోర్టు ముందు ఉంచాలని సూచించింది.
ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై నమోదైన కేసులను విచారించేందుకు హైకోర్టులో స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటైంది. జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ లలిత ఆధ్వర్యంలోని బెంచ్ లో విచారణ జరుగుతోంది.
ఎంపీ రఘురామ బెయిల్ పిటీషన్ పై కోర్టులో వాదనలు కొనసాగాయి. సీఐడీ అధికారులు పెట్టిన సెక్షన్లు వర్తించవని.. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఆ సెక్షన్లను రద్దు చేయాలంటూ రఘురామ తరుఫు న్యాయవాది వాదించినట్టు సమాచారం. రఘురామ బెయిల్ పిటీషన్ తోపాటు అత్యవసర వైద్యసాయం కూడా అందించాలని మరో పిటీషన్ దాఖలు చేశారు.
కాగా రఘురామ రిమాండ్ రిపోర్టును సీఐడీ న్యాయస్థానం పెండింగ్ లో పెట్టింది. ఆయన అరికాళ్లపై గాయాలు, తదితర వివరాలను కోర్టు నమోదు చేసినట్టు సమాచారం. ఎంపీ కాళ్లకు తగిలిన గాయాల ఆధారాలను కోర్టు ముందు ఆయన న్యాయవాదులు ఉంచగా.. ఆయనను ఆస్పత్రికి తరలించాలని న్యాయస్థానం సూచించినట్టు సమాచారం. సీఐడీ కోర్టులో రఘురామ బెయిల్ పిటీషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. జిల్లా కోర్టులో రఘురామకు ఊరట లభిస్తుందా? లేదా? అన్నది చూడాలి.