ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వైసీపీ వర్సెస్ రఘురామ కృష్ణంరాజు గా సాగుతున్న రాజకీయాలు ప్రస్తుతం ప్రధాని కోర్టుకు చేరాయి. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై రఘురామ తాజాగా ప్రధానికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే జగన్ కు వ్యతిరేకంగా వారం రోజులుగా లేఖలు రాస్తున్నసంగతి తెలిసిందే. రాష్ర్టంలో జరుగుతున్న పరిస్థితులపై ప్రధానికి రఘురామ లేఖలో విన్నవించారు.
తాము లేవనెత్తిన అంశాలపై ప్రధాని మోడీ దృష్టి పెట్టాల్సిన అవసరముందని కోరారు.ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయాలని పేర్కొన్నారు. గవర్నర్లు, సీఎంలకు లేఖలు రాసిన రఘురామ ప్రధానికి తొలిసారి రాయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానికి రాసిన లేఖలో రఘురామ ఏపీ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఎలా మారుతోందని గుర్తుచేశారు. పరిమితికి మించి రుణాలు తీసుకుంటున్నారని తెలిపారు. రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వ ఆస్తుల్ని ఎలా తాకట్టు పెడుతున్నారని వివరించారు.
బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలపై ప్రస్తావించారు. విపక్షాల విమర్శల్ని సైతం పట్టించుకోకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తెస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్లు అప్పు తీసుకున్నారని గుర్తు చేశారు. ఉచిత పథకాల అమలుకు మరో రూ.3 వేల కోట్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితికి మంచి అప్పులు చేస్తోందని, సుమారు రూ.35 వేల కోట్లకు పైగా అప్పులు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. గతేడాది సగటు నెలకు రూ.9226 కోట్ల అప్పులు చేశారని వివరించారు. ఉచిత పథకాల కోసం రూ.13 వేల కోట్లు అప్పు చేశారని తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వ తీరుతో ఆర్థిక వ్యవస్థ క్రమశిక్షణ గాడితప్పిందని గుర్తు చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని ఆర్థిక వ్యవస్థ మెరుగు పడటానికి సహకరించాలని కోరారు. ప్రజాసంక్షేమం ముసుగులో వ్యక్తిగత లబ్ధి నెరవేర్చుకునే విధానం కనిపిస్తోందని పేర్కొన్నారు.