https://oktelugu.com/

న్యాయవ్యవస్థకు శస్త్రచికిత్స జరగాలి

ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కార నేరం కేసుపై మాజీ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, ప్రముఖ మేధావులు స్పందించిన తీరుచూస్తే ఒకింత ఆశ్చర్యం , మరొకవైపు వీరి స్పందనా ప్రతిభ కున్న సామర్ధ్యం చూసి ముక్కున వేలేసుకోక తప్పదు. నిజంగా వీరికి న్యాయవ్యవస్థ పై, వ్యక్తి స్వాతంత్రం, ప్రాధమిక హక్కులపై ఇంత ఆందోళన, ఆవేదన ఉందా అని ఆశ్చర్యమేసింది. ఇదే ఆవేశం, ఆందోళన జస్టిస్ కర్ణన్ విషయం లో ఏమయ్యిందో అర్ధంకావటంలేదు. ఆయన ఆరు నెలలు జైలు శిక్ష […]

Written By:
  • Ram
  • , Updated On : August 21, 2020 / 01:33 AM IST
    Follow us on

    ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కార నేరం కేసుపై మాజీ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, ప్రముఖ మేధావులు స్పందించిన తీరుచూస్తే ఒకింత ఆశ్చర్యం , మరొకవైపు వీరి స్పందనా ప్రతిభ కున్న సామర్ధ్యం చూసి ముక్కున వేలేసుకోక తప్పదు. నిజంగా వీరికి న్యాయవ్యవస్థ పై, వ్యక్తి స్వాతంత్రం, ప్రాధమిక హక్కులపై ఇంత ఆందోళన, ఆవేదన ఉందా అని ఆశ్చర్యమేసింది. ఇదే ఆవేశం, ఆందోళన జస్టిస్ కర్ణన్ విషయం లో ఏమయ్యిందో అర్ధంకావటంలేదు. ఆయన ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించకుండా ఆపి వుండొచ్చు కదా. జస్టిస్ కర్ణన్ కి ఒక రూలు ప్రశాంత్ భూషణ్ కి వేరొక రూలా? జస్తిస్ కర్ణన్ దళితుడు, దక్షిణాదివాడు కావటం తో పట్టించుకోలేదా?  అసలు న్యాయవ్యవస్థ లోపభూయిష్టమయిందని ప్రశాంత్ భూషణ్ చెప్పే మాటలపై ఈ మేధావుల్లో ఎంతమంది ఏకీభవిస్తారో తెలియదు. ఇక్కడ సమస్య ప్రశాంత్ భూషణ్ వ్యక్తిత్వం గురించికాదు, తను మాట్లాడింది కోర్టు ధిక్కారమా కాదా అనేదే?

    ప్రశాంత్ భూషణ్ నేపధ్యం

    ప్రశాంత్ భూషణ్ తండ్రి శాంతి భూషణ్  జనతాపార్టీ ప్రభుత్వం లో న్యాయ శాఖా మంత్రి. ప్రముఖ న్యాయవాది. దేశ రాజకీయాల్ని మలుపు తిప్పిన  ఇందిరా గాంధీ ఎన్నిక రద్దు అలహాబాద్ హైకోర్టు తీర్పులో రాజ్ నారాయణ్ తరఫున కేసు వాదించిన న్యాయవాది. ఆ విధంగా ప్రసిద్ది చెందిన కుటుంబంనుంచి వచ్చిన నేపధ్యం. ప్రశాంత భూషణ్ కూడా తండ్రికి తగ్గ తనయుడే. అభిప్రాయాల్ని చెప్పటం లో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం తండ్రి కొడుకులిద్దరికీ వున్న అలవాటు. తేడా అల్లా శాంతి భూషణ్ జనతాపార్టీ, భారతీయ జనతా పార్టీ లలో పనిచేస్తే తనయుడు వామపక్షభావాలు, మానవ హక్కుల ఛాంపియన్. అది అనేకసార్లు వివాదాలకు కూడా దారి తీసింది. కాశ్మీర్ ప్రజలు కోరుకుంటే దేశం నుంచి విడిపోయే హక్కు కూడా వాళ్ళ కివ్వాలని చెప్పటంతో అది పెద్ద సమస్యగా మారి సుప్రీం కోర్టు చాంబర్ లోనే ఆయనమీద దాడి జరిగింది. నక్సలైట్ల సమస్యల పై కూడా అదే పధ్ధతి లో సమర్ధిస్తాడు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్కృతి కి వ్యతిరేకంగా గళం విప్పటం లో ముందుంటాడు. పూర్తి ఆదర్శవాది కావటం తో     రాజకీయాల్లో ఎక్కడా ఇమడ లేకపోవటం ఆయన మార్కు ప్రవర్తన. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. కానీ  అక్కడా ఇమడలేక తనూ, యోగేంద్ర యాదవ్ కలిసి స్వరాజ్య అభియాన్ ని స్థాపించారు. కేసుల్లో కూడా తను మనసా వాచా కేసులో న్యాయముందనిపిస్తేనే వాదిస్తాడు. మిగతా న్యాయవాదుల్లాగా వృత్తిని కేవలం వ్యాపార దృక్పధం తో చూడడు. ఇన్ని మంచి గుణాలున్న ప్రశాంత భూషణ్ కోర్టు ధిక్కరణ ని ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది.

    నోరుపారేసుకోవటం వల్లనే సమస్యల్లా

    ప్రశాంత భూషణ్ కే కాదు చాలామంది న్యాయవాదులకీ ఈ సమస్య వుంది. కోర్టులపై ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకుంటూ వుంటారు. ముఖ్యంగా పేరుమోసిన న్యాయవాదులు న్యాయమూర్తుల్ని కంట్రోల్ చేయాలనుకోవటం, బ్లాక్ మెయిల్ చేయటం, సుప్రీం కోర్టు వ్యవహారాలు తమ కనుసన్నల్లో జరగాలని కోరుకోవటం సర్వసాధారణ మయింది. ఈ అభిప్రాయం ఎవరోకాదు ఇంతకు ప్రధాన న్యాయమూర్తినే వ్యక్తపరిచాడు. వీళ్ళందరూ కోట్ల రూపాయలు ఫీజు వసూలుచేస్తుంటారు. వీళ్ళ మీద ప్రశాంత భూషణ్ కి కూడా అంత మంచి అభిప్రాయ మేమీ  లేదు. కాకపోతే వీళ్ళు ఈరోజు ప్రశాంత భూషణ్ కేసులో సమర్ధించటానికి వీళ్ళ స్వార్ధం కూడా వుంది. రేపొద్దున వీళ్ళకీ ఇటువంటి పరిస్థితి ఏర్పడితోనో ? వృత్తి సంఘీభావమే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ న్యాయవాదులతో పోల్చుకుంటే ప్రశాంత్ భూషణ్  వ్యక్తిత్వం ఉన్నతమైనది. కాకపోతే ఈ నోరుపారేసుకోవటం మోతాదు మించటం చాలాసార్లు జరుగుతుంది. ప్రస్తుత కేసులో కూడా ఇదే జరిగింది. గత ప్రధాన న్యాయమూర్తులు చాలా మంది అవినీతిపరులని వ్యాఖ్యానించటం, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి లక్షల ఖరీదు చేసే బిజెపి వాళ్ళ బైకు పై హెల్మెట్ లేకుండా తిరిగాడని నోరుపారేసుకున్నాడు. న్యాయ వ్యవస్థ మీద జనరల్ గా వ్యాఖ్యానించటం వేరు నిర్దిష్టంగా వ్యక్తులపై కామెంట్ చేయటం వేరు. నిర్దిష్టంగా వ్యాఖ్యానించినప్పుడు ఆధారాలతో నిరూపించగలగాలి. అలా కాకుండా నేను ఏమి మాట్లాడినా చెల్లుతుందనుకోవటం కరెక్టు కాదు. వ్యక్తిగతంగా తను నిజాయితిగా వుండటం ఒక్కటే సరిపోదు. చట్టాల్ని గౌరవించాల్సిన బాధ్యతకూడా తన మీద వుంది.

    Also Read: ఇంతకన్నా నీచం ఉంటుందా? కులాల వారిగా క్వారంటైన్ సెంటర్లు

    భావ వ్యక్తీకరణ స్వేచ్చ కి కూడా కొన్ని పరిమితులున్నాయని మరిచిపోవద్దు. మాట్లాడే మేధావులందరూ దీన్ని బూచిగా చూపి అసలు విషయాన్ని మరుగున పడేయాలని చూస్తున్నారు. ఇదేమాట అన్నందుకే కదా కర్ణన్ ని జైలు లో పెట్టింది. మరి ఆరోజు వీళ్ళెవ్వరూ ఎందుకు మాట్లాడలేదు. న్యాయమూర్తులు నిన్నకూడా ప్రశాంత భూషణ్ కి మరో అవకాశమిచ్చారు. తను మాట్లాడింది తప్పని చెప్పమన్నారు. అక్కడ అహంకారం, అభిజాత్యం అడ్డొస్తుంది. ఇది మంచిది కాదు. ఇదే మాటలు ఒక సామాన్యుడు అని వుంటే వీళ్ళందరూ ఒకటై వాళ్ళమీద కోర్టు ధిక్కరణ నేరం మోపేవారు. అంతెందుకు మన తెలుగు రాష్ట్రం లో జరుగుతున్న వ్యవహారమే చూద్దాం. జగన్ ప్రభుత్వానికి అనేక కేసుల్లో కోర్టు వ్యతిరేక తీర్పులు ఇస్తుంది. దానిపై కొంతమంది సాంఘిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారని వారిపై అభియోగాలు మోపారు. కారణం న్యాయమూర్తులపై అకారణంగా విమర్శలు చేసారని . అంటే న్యాయమూర్తులపై , న్యాయ స్థానాలపై ఎలా బడితే అలా మాట్లాడితే వాళ్ళు శిక్షార్హులనే కదా. మరి ఇదేపని ప్రశాంత భూషణ్ కానీ ఇంకో పేరుమోసిన న్యాయవాది చేస్తే వాళ్ళూ శిక్షార్హులే నని మరవొద్దు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఆరోపణలకు ఆధారాలైనా చూపాలి లేకపోతే ఆరోపణలు ఉపసంహరించుకోవాలి. అంతేకానీ భావవ్యక్తీకరణ పేరుతో ఏదిబడితే అది మాట్లాడకూడదు కదా.

    న్యాయవ్యవస్థకు శాస్త్ర చికిత్స జరగాలి 

    దీనర్ధం న్యాయవ్యవస్థ బాగుందని సర్టిఫికేట్ ఇచ్చినట్లు కాదు. న్యాయవ్యవస్థ లో వున్న లోపాలపై భావ వ్యక్తీకరణ ను నాకు తెలిసి ఏ కోర్టు అడ్డుకోలేదు. నేను కూడా ఎన్నోసార్లు న్యాయవ్యవస్థ లోపాలపై వ్యాసాలూ, టివి లలో చర్చల్లో వ్యాఖ్యానించాను. అవేమీ కోర్టు ధిక్కరణ కిందకు రావు. ఈ రోజు న్యూయార్క్ టైమ్స్ లో దీనిపై వ్యాసం ప్రచురించారు. గత కొన్ని దశాబ్దాలలో కొన్ని వందలమంది పోలీసుల కస్టడీలో చనిపోయారని అయినా వీటిపై ప్రజా ఉద్యమాలు రాలేదని , ఒకవిధంగా ప్రజలే చాలా సందర్భాల్లో వీటికి మద్దతిచ్చారని సవివరంగా రాసారు. దీనికంతటికీ కారణం అవినీతికరమైన న్యాయవ్యవస్థ, న్యాయస్థానాల్లో న్యాయం దీర్ఘకాలం పెండింగ్ లో వుండటం, ఈ కేసుల్లో శిక్ష ఖరారైన సందర్భాలు తక్కువగా వుండటం ఈ ప్రజాభిప్రాయానికి కారణంగా పేర్కొంది. స్థూలంగా ఇది వాస్తవమే. ఇందులో ప్రధాన బాధ్యత న్యాయవాదుల పైనా వుంది. న్యాయమూర్తుల, న్యాయవాదుల మధ్య మిలాఖత్ ఒప్పందాల తోనే ఇలా జరుగుతుందని అందరకీ తెలిసిన విషయమే. అటువంటప్పుడు ప్రజలకు న్యాయ వ్యవస్థ పై నమ్మకం సడలటం సహజమే. సామన్యుడెవరూ సుప్రీం కోర్టు మెట్లు కూడా ఎక్కలేడు. న్యాయవాదుల ఫీజులు లక్షలు, కోట్ల లో వుంటే న్యాయం కోసం కోర్టు గడప తొక్కలేడు కదా. దానితోపాటు ఏళ్లతరబడి కేసులు వాయిదాలు పడుతుంటే సహజంగానే సామాన్యుడు ప్రత్యామ్నాయ న్యాయం కోసం ప్రయత్నిస్తాడు.

    Also Read: జగన్ కి ముందుంది ముసళ్ళ పండుగ..? కేసీఆర్ కాస్కొని ఉన్నాడు

    హైదరాబాద్ ఎన్ కౌంటర్ అయినా, కాన్పూర్ ఎన్ కౌంటర్ అయినా ప్రజలు అందుకే నీరాజనాలు పట్టారు. స్థూలంగా చూస్తే ఆ వ్యాసం ఉద్దేశం న్యాయవ్యవస్థలో న్యాయం జరగటం లేదుకాబట్టి ప్రజలు పోలీసుల న్యాయానికే మొగ్గుచూపుతున్నరనేది. ఇది అక్షర సత్యం. ఇప్పటికైనా న్యాయస్థానాలు కళ్ళు తెరుస్తాయా? ఈ దేశం లో సంస్కరణలు అన్నింటికన్నా ముందుగా జరగాల్సింది న్యాయవ్యవస్థలో . ‘సత్వర న్యాయం, అందుబాటులో న్యాయం’ ఆదర్శంగా ఈ సంస్కరణలు జరిగాల్సి వుంది. ఈ మాట్లాడే మేధావులు వాటిపై ఎందుకు స్పందించారు? ప్రశాంత భూషణ్ లాంటి పెద్ద వాళ్ళు సమాజం లో అత్యంత ప్రభావితులని మరిచిపోవద్దు. అంతకుముందు ఒకసారి ఇండియన్ ఎక్స్ ప్రెస్ సర్వే లో ప్రశాంత భూషణ్ దేశం లోని అత్యంత ప్రభావితుల్లో 74 వ వాడుగా వచ్చాడు. కాబట్టే అంతమంది మద్దత్తుగా నిలిచారు. వాస్తవానికి తనకు వీళ్ళ మద్దత్తు అవసరం లేదు. కావాల్సింది సామాన్య ప్రజలకి. ఇంతమంది బయటకు వచ్చి ‘సత్వర న్యాయం, అందుబాటులో న్యాయం’ కోసం ఉద్యమించవచ్చు కదా. సమాజం లో ప్రభావిత వ్యక్తులకోసం మనం పెట్టే వ్యయ ప్రయాసల్లో సగమైనా న్యాయ సంస్కరణల కోసం పెడితే సమాజానికి మేలు చేసిన వారు అవుతారు. గుడ్డెద్దు చేలో పడినట్లు ఎవరో ఎదో మొదలు పెట్టగానే వాటిని ప్రచారం లో పెట్టేముందు ఈ దిశగా ఆలోచించటానికి ఓ ప్రయత్నం చేయండి. సమాజానికి మేలుచేసినవారు అవుతారు.