Maharashtra Crisis: పార్టీల చేతిలో ప్రజాస్వామ్యం.. అమ్ముడు పోతున్న ఎమ్మెల్యేలు..!

Maharashtra Crisis: ప్రజాస్వామ్యం.. ఇది చాలా విలువైనది. ప్రజలు తమ పాలకులను, ప్రతినిధులను ఎన్నుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని చేసే పాలన. ఇక్కడ ప్రజలే పాలకులు. ఇది ప్రపంచ దేశాలన్నిటికీ వర్తిస్తుంది. అదే సమయంలో ప్రపంచ దేశాల్లో భారత ప్రజాస్వామ్యానికి ఎంతో విలువ ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజాస్వామ్య వినియోగం మాత్రం ప్రజల చేతుల్లో లేదు. రాజకీయ పార్టీల […]

Written By: Raghava Rao Gara, Updated On : June 24, 2022 2:25 pm
Follow us on

Maharashtra Crisis: ప్రజాస్వామ్యం.. ఇది చాలా విలువైనది. ప్రజలు తమ పాలకులను, ప్రతినిధులను ఎన్నుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని చేసే పాలన. ఇక్కడ ప్రజలే పాలకులు. ఇది ప్రపంచ దేశాలన్నిటికీ వర్తిస్తుంది. అదే సమయంలో ప్రపంచ దేశాల్లో భారత ప్రజాస్వామ్యానికి ఎంతో విలువ ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజాస్వామ్య వినియోగం మాత్రం ప్రజల చేతుల్లో లేదు. రాజకీయ పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయింది.. కాదు బలవంతంగా లాక్కున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ఏది చెబితే అదే ప్రజాస్వామ్యం..! ఏది చేస్తే అది ప్రజాస్వామ్యం అన్నట్లుగా మారిపోయింది. దీనికి తాజాగా ఉదారహరణ మహారాష్ట్ర సంక్షోభం.

Maharashtra Crisis

చీలిక.. ఎమ్మెల్యేల ప్రజాస్వామ్య హక్కు..
మహారాష్ట్రలో రాజకీయసంక్షోభం చాలా మందిని ఆశ్చర్యపర్చలేదు. ఎందుకంటే బాల్‌థాక్రే వారసుడిగా ఉద్దవ్‌థాక్రే తనదైన ముద్ర వేయలేదు. ముఖ్యమంత్రిగా ఆయన రాజనీతి పాటించారు. శివసేన సిద్ధాంతాలు ఆ రాజనీతిని ఎప్పుడూ పాటించలేదు. ఒకరిపై ఒకరిని ఎగదోసి రాజకీయం చేసి బలపడిన పార్టీ అది. కానీ ఉద్దవ్‌ మాత్రం పాలకుడిగా అలా చేయడం సమంజసం కాదనుకున్నారు. అదే ఆయన పీఠానికి ఎసరు లె చ్చింది. శివసైనికుల్లో ఎవరూ థాక్రేల మాట జవదాటరు అనుకుంటే.. కట్ట కట్టుకుని ఎమ్మెల్యేలంతా ఆయనను కాదని వెళ్లిపోయారు. కారణం వారికి అంతకు మించిన అధికారం అండ లభించడం. వారు చేసింది తప్పా అంటే కానే కాదు. అదే ప్రజాస్వామ్యం. ప్రజల ఓటు హక్కుద్వారా ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కును శివసేన ఎమ్మెల్యేలు ఉపయోగించుకున్నారు.

Also Read: KCR National Party: బీజేపీతో ఇప్పుడే వద్దు.. కేసీఆర్ జాతీయ పార్టీ గోవిందా..!

బీజేపీ ఆశీస్సులు లేకుంటే అంతే..
దేశంలో బీజేపీ ఆశీస్సులు లేని సంకీర్ణ ప్రభుత్వాలన్నీ కూలిపోతున్నాయి. కారణం ప్రస్తుతం కేంద్రంలో ఆ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలో ఉంది. ఎనిమిదేళ్ల రాజకీయాలను చూస్తే.. తమ ప్రమేయం లేని సంకీర్ణ ప్రభుత్వాలన్నింటినీ బీజేపీ కూలగొట్టి తమ ప్రమేయంతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. అది అతి చిన్న ఈశాన్య రాష్ట్రమైనా.. అత్యంత కీలకమైన బీహార్, కర్ణాటక అయినా అంతే. ఇప్పుడు మహారాష్ట్ర వంతు వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య తక్కువే. సీట్ల సంఖ్య కూడా తక్కువే. అయినప్పటికీ అక్కడ నడిచేది సంకీర్ణ ప్రభుత్వాలే. ఇలాంటి ప్రభుత్వాలు శరవేగంగా కూలిపోయాయి. మళ్లీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ మద్దతుతో ఏర్పాటయ్యాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ పూర్తి సీట్లు రాలేదు. మెజార్టీకి అవసరం అయిన సీట్లు కొన్ని తక్కువే సాధించింది. ఇండిపెడెంట్ల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ చివరికి.. నిలబెట్టుకోలేకపోయింది. అక్కడ బీజేపీ ప్రభుత్వమే మళ్లీ వచ్చింది. అదే పరిస్థితి కర్ణాటకలోనూ వచ్చింది. కర్ణాటకలో పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేసినా ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్‌ కలిశాయి. కానీ బీజేపీ కొన్నాళ్లు వేచి చూసి వాళ్లంతట వాళ్లు కూలిపోకపోయే సరికి ఆపరేషన్‌ కమల్‌ పూర్తి చేసింది. ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉంది. మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి. రేపోమాపో మహారాష్ట్రæ కూడా బీజేపీ పాలిత రాష్ట్రం అయ్యే సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అంటే.. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తమకు ఉన్న బలంతో ప్రజాస్వామ్యాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటోంది. ఎక్కడా చట్ట విరుద్ధం.. రాజ్యాంగ విరుద్ధం అన్న ప్రశ్నే లేదు. పైగా ప్రజాస్వామ్యం అంటున్నారు. మెజార్టీ మీద నడిచే ప్రజాస్వామ్యంలో ఏదీ తప్పు కాదు ! బలమే ఫైనల్‌ ! భారతదేశం ప్రజాస్వామ్యం మెజార్టీ మీద ఆధారపడి ఉంది. మెజార్టీ అభిప్రాయమే గెలుపు. ఓట్లు అయినా సీట్లు అయినా అదే పరిస్థితి.

Uddhav thackeray and Eknath

సంక్షోభంలో సంకీర్ణ సర్కార్లు..
రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు కూటములుగా ఏర్పడటం అయినా.. ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడినా ఓట్లు కలుపుకోవడమో.. సీట్లు కలుపుకోవడమో చేసి మెజార్టీ సాధించడమే లక్ష్యం. అయితే ఇప్పుడు ఈ సంకీర్ణాలకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. మారుతున్న రాజకీయాల కారణంగా సంకీర్ణ ప్రభుత్వాలు మనుగడ సాధించే పరిస్థితి లేకుండా పోయింది. 2014 ఎన్నికల ముందు వరకు మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో ఏకపార్టీ ప్రభుత్వం లేదు. ఓటర్లు ఏ ఒక్క పార్టీకీ పూర్తి మెజారిటీ కట్టబెట్టలేదు. అప్పుడంతా దేశ రాజకీయాల్లో సంకీర్ణ శకం నడిచింది. అనేక పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల మంత్రివర్గంలో విభేదాలు తలెత్తడం, వేడివేడి చర్చలు, సంప్రదింపులు,బుజ్జగింపుల తర్వాత ఏకాభిప్రాయ సాధనతో ప్రధాన మంత్రులు విధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చాలా సార్లు ఈ సంకీర్ణ ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. అదే సమయంలో రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో సంకీర్ణాలు విజయవంతంగా నడిచాయి. మహారాష్ట్రలోనే బీజేపీ– శివసేన ప్రభుత్వం కూడా విజయవంతంగా నడిచింది. అయితే గత దశాబ్దకాలంగా పరిస్థితి మారిపోయింది. ఏ ఒక్క సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు లేని సంకీర్ణం మనుగడ సాగించడం లేదు. ఇక్కడ సంకీర్ణాలు మనుగడ సాగించడం సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకపోవడం సమస్య. అంటే కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేయగలదని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ ఓ పాలకపక్షంగా ఉన్న సంకీర్ణాలు సాఫీగానే సాగుతున్నాయి. ఈ పరిణామాలతోనే దేశ రాజకీయాల్లో మౌలికమైన మార్పులు వస్తున్నాయి. సంకీర్ణాలే కాదు అరకొర మెజార్టీ వచ్చినా ప్రభుత్వాలూ నిలబడటం కష్టం. తప్పు రాజకీయ పార్టీలది కాదు ప్రజాస్వామ్యాన్ని అమ్ముకుంటున్న రాజకీయ నేతలదే!

నాడు కాంగ్రెస్‌ ఇదే చేసింది..
ఈ రాజకీయ పరిణామాల్లో బీజేపీని రాజకీయ వ్యూహాలను కానీ తప్పు పట్టాల్సిన పని లేదు. అప్పట్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే చేసింది ఇదే. గాంధీల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలను ఏకపక్షంగా డిసాల్వ్‌ చేయడం చేలాసార్లు జరిగింది. ఆ ప్రజాస్వామ్య వాడకాన్నే ఇప్పుడు బీజేపీ అందిపుచ్చుకుంది. అందులో సందేహం లేదు. కాకపోతే ఇప్పుడు మరింత విస్తృతమైంది. అసలు రాజకీయ నేతలు నిబద్ధతతో ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు. మహారాష్ట్ర పరిణామాలనే తీసుకుంటేం ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి పాలన చేస్తున్నామన్నసంగతి గుర్తించినట్లుగా కొత్త వాదన లెవనెత్తుతున్నారు. ఆయన తిరుగుబాటు చేయాలనుకున్నారు చేస్తున్నారు.. అందరూ అంతే. ఇలాంటి రాజకీయాల కారణంగానే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. వీరంతా ఓ సిద్దాంతానికి కట్టుబడి ఉంటేం ఇలాంటి పరిస్థితులు తలెత్తవు. ఈ పరిస్థితి రావడానికి రాజకీయాల్లో పడిపోతున్న విలువలే కారణం. రాజకీయ నేతలు తమను ప్రజలు ఎన్నుకున్నారని.. తాము ఏం చేసినా ప్రజల కోసమే చేస్తున్నామని ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ తరహాలో ప్రజాస్వామ్యాన్ని వాడేస్తే ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే ! అయితే ఈ ప్రజాస్వామ్య వాడకంలో ప్రజలు ఎప్పటికీ బాధితులు అవుతున్నారు. రాజకీయ పార్టీలు.. రాజకీయ నేతలు.. డెమెక్రసీని ఇష్టారీతిన ఉపయోగించుకుని.. తమదైన రాజకీయం చేస్తున్నారు.

Also Read:Atmakur By Poll: ఆత్మకూరులో 64.7 శాతం పోలింగ్.. గెలుపెవరిది?

Tags