
Punjab CM Resignation: పంజాబ్ లో ముఖ్యమంత్రిని మార్చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అది కూడా.. ఎన్నికలకు ఏడాది ముందు! అసలే.. దేశంలో అధికారం కోల్పోయి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దశలో.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా సాహసోపేతమే. అయితే.. ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న పంజాబ్ పంచాయితీకి ముగింపు పలకకపోతే.. రాబోయే ఎన్నికల్లో మరింత ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉందని భావించిన కాంగ్రెస్.. మొత్తానికి కఠిన నిర్ణయం తీసేసుకుంది. అయితే.. ఈ నిర్ణయం పంజాబ్ కే పరిమితమా? లేదంటే.. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లకూ విస్తరించే అవకాశం ఉందా? అనే చర్చ సాగుతోంది.
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్(Amarinder singh) కు, పీసీసీ చీఫ్ సిద్ధూ (siddhu)కు మధ్య వివాదం ఎప్పుడో బజారుకెక్కింది. ఇన్నాళ్లూ ఆచితూచి వ్యవహరించిన కాంగ్రెస్.. ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో ప్రధాన పాత్ర రాహుల్, ప్రియాంకదే అంటున్నారు విశ్లేషకులు. అమరీందర్ 80వ పడిలో ఉన్నారు. అందువల్లే సిద్ధూకు అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు సీఎం మార్పుతో.. వీరి నిర్ణయమే ఫైనల్ అయ్యిందని అంటున్నారు.
అంతేకాదు.. ఈ నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీలోని వారు ఎవరైనా అధిష్టానం సూచనల ప్రకారమే నడుచుకోవాలనే సంకేతం ఇచ్చేందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. నిజానికి.. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత పలువురు సీనియర్లు అధిష్టానానికి తరచూ నల్ల జెండాలు చూపిస్తూనే ఉన్నారు. ఓ గ్రూపుగా ఏర్పడిన కొందరు సీనియర్ నేతలు.. అధిష్టానాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో.. అధిష్టానం పార్టీపై పట్టు పెంచుకోవడానికి కూడా ఈ చర్యను వినియోగించుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే.. సీఎం మార్పు అనేది పంజాబ్ కే పరిమితమైనా హెచ్చరికలు మాత్రం రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ వరకు పాకించారని అంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. కానీ.. ఇక్కడ కూడా అసంతృప్తులు గట్టిగానే ఉన్నాయి. రాస్థాన్లో యువ నేత సచిన్ పైలట్ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకుండా సీఎం అశోక్ గెహ్లాట్ వ్యవహరిస్తున్నారని, దీనిపై అధిష్టానం గుర్రుగా ఉందనే వార్తలు వస్తున్నాయి. అటు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ పదవీ కాలం టి.ఎస్. సింగ్ దేవ్ తో పంచుకోవాలని సూచించినా.. వినట్లేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ సీఎంను మార్చేయడం ద్వారా.. వీరికి కూడా హెచ్చరికలు జారీచేసింది కాంగ్రెస్ అధిష్టానం అని అంటున్నారు. మరి, ఈ వార్నింగ్ ఎంత వరకు పనిచేస్తుంది? అన్నది చూడాలి.