Punjab CM Mann Meets KCR: కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిన చందంగా మారుతోంది బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిస్థితి. కేంద్రంలో బీజేపీని గద్దె దించాలన్న ఎజెండాతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ దానిని విస్తరించడానికి తంటాలు పడుతున్నారు. కలిసి వస్తామన్న నేతలు హ్యాండ్ ఇవ్వడంతో ఒంటరైన కేసీఆర్ వెనక్కి తగ్గితే పరువు పోతుందని భావిస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్లో అసమ్మతి రాగం మొదలైంది. ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా మంత్రిపై అధికార పార్టీ నేతలు తిరుగుబాటు చేశారు. తనపై చిన్న విమర్శ చేసినా సహించని కేసీఆర్ పార్టీలో అసమ్మతి చలరేగినా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

పంజాబ్ సీఎంతో భేటీ..
బీఆర్ఎస్ విస్తరణపై కసరత్తు మొదలు పెట్టిన కేసీఆర్‌కు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సోమవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ప్రగతిభవనలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. సుమారు గంట పాటు చర్చలు జరిపారు. తర్వాత పంజాబ్ వెళ్లిపోయారు.
భేటీపై సీఎంవో తప్పుడు ప్రకటన..
భగవంత్ మాన్‌సింగ్‌తో కేసీఆర్ భేటీపై సోమవారం సాయంత్రం తెలంగాణ సీఎంవో నుంచి ప్రకటన విడుదల అయింది. దీంట్లో సీఎం కేసీఆర్ భగవంత్‌మాన్‌తో రాజకీయ అంశాలపై చర్చించనట్లు పేర్కొంది. కేంద్రాన్ని ఎలా గద్దె దించాలి, భవిష్యత్‌లో ఎలా కలిసి పనిచేయాలి.. అనే అంశాలు చర్చించారని తెలిపింది. భవిష్యత్‌లో పొత్తు కుదిరే అవకాశం ఉందన్నట్లుగా ప్రకటన సారాంశం ఉంది. అయితే పంజాబ్ సీఎంవో నుంచి కూడా మంగళవారం మరో ప్రకటన విడుదల అయింది. ఇందులో తాను తెలంగాణ ముఖ్యమంత్రితో రాజకీయాలు చర్చించలేదని భగవంత్‌మాన్ స్పష్టం చేశారు. తాను పెట్టుబడులు ఆహ్వానించేందుకు తెలంగాణ వ్యాపారులతో సమావేశం నిర్వహించేందుకు వెళ్లానని తెలిపారు. కేసీఆర్‌తో రాజకీయాలు చర్చించలేదని వెల్లడించారు.
బీఆర్ఎస్ కోసమే తప్పుడు ప్రకటనా?
బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు ఏ రాజకీయ పార్టీ ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వచ్చిన భగవంత్‌మాన్ కావాలనే ప్రగతిభవన్‌కు పిలిపించుకుని రాజకీయాలు చర్చించినట్లు, బీఆర్ఎస్తో పొత్తుకు ఆప్ ఆసక్తి చూపుతున్నట్లు మీడియాలో ప్రచారం చేసుకునే ప్రయత్ననం చేశారు. పంజాబ్ సీఎంవో ప్రకటనతో కేసీఆర్ పరువు పోగొట్టుకున్నారు.

పొత్తులకు ఆప్ విరుద్ధం..
ఆమ్ ఆద్మీపార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పార్టీపరమైన నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు. ఆయనకు తెలియకుండా ఎలాంటి పొత్తులు, చర్చలు జరుగవు. కానీ తెలంగాణ సీఎం మాత్రం పంజాబ్ సీఎంతో రాజకీయాలు మాట్లాడామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా మారింది. వాస్తవానికి ఆప్ పొత్తుకు దూరంగా ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలకు పొత్తులు విరుద్ధం. ఎక్కడైనా కొంటరిగానే పోటీ చేస్తోంది. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆప్ తమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతోందని ప్రచారం చేసుకోవలని చూసి తప్పులో కాలేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆమ్ ఆద్మీతో దోస్తీ చేస్తే.. ఉత్తర భారత దేశంలో బీఆర్ఎస్ మైలేజీ పెరుగుతుందని భావిస్తున్న కేసీఆర్.. మొత్తంగా ఏదో చేయబోతే.. ఏదో అయింది అన్నట్లుగా మారింది.