విద్యా వ్యాపారమైంది.. లక్షల ఫీజులు కడితేనే పిల్లలను చదివించే దుస్థితి దాపురించింది. ప్రభుత్వ విద్య మిథ్య అయిన వేళ ప్రైవేటు విద్య పెను భారమైంది. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల దోపిడీని అరికట్టే నాథుడే లేకుండాపోయారు. ప్రభుత్వం పట్టించుకోదు.. అసోసియేషన్లు దృష్టిసారించవు.. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఇంతటి కరోనా టైంలోనూ దోపిడీని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాయి..
కరోనా లాక్ డౌన్ తో విద్యావ్యవస్థ మార్చి చివరి వరకే నిలిచిపోయింది. అప్పటికే అన్ని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒక సంవత్సరం ఫీజును లాగేశాయి. అది పరీక్షల టైం కావడంతో అందరూ కట్టేశారు. కానీ ఎప్పుడైతే కరోనా లాక్ డౌన్ విధించారో.. అప్పటి నుంచి పాపం ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు జీతాలు కట్ చేశాయి ప్రైవేట్ యాజమాన్యాలు.. ఇదెక్కడి దుర్మార్గం అని వారంతా బయటపడలేక నిస్సహాయంగా రోదిస్తున్నారు.
అసలు ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు జరుగుతున్న ఈ దోపిడీని అటు అసోసియేషన్లు, ఇటు ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. వారేమో ఉద్యోగం పోతుందని అభద్రతతో అడగడం లేదు. దీంతో మార్చి నుంచి ఇప్పటిదాకా అసలు జీతాలే లేకుండా కుటుంబం గడవక వారంతా అష్టకష్టాలు పడుతున్నారు.
కరోనా వేళ కూడా ఇలా పీక్కుతింటారా?
ప్రస్తుతం కరోనాతో స్కూళ్లు, కాలేజీలన్నీ మూతపడ్డాయి. ఇప్పట్లో తెరిచే ఆలోచన లేదు. దీంతో ఈ జూన్ లో ఈ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు కొత్త ఎత్తుగడ వేశాయి. ఆన్ లైన్ క్లాసులంటూ పాఠాలను జూమ్ యాప్ లో వినిపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎక్స్ ట్రా ఫీజులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. అయితే వసూలు చేస్తున్న ఈ ఫీజుల నుంచి టీచర్లకు, లెక్చరర్లకు మాత్రం ఇవ్వడం లేదు.
కర్ణాటక రాష్ట్రంలోనూ ఇలానే ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల బాధలు తీర్చేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా కలిసి వాలంటీర్ గా నడుం బిగించారు. వారంతా రూ.32 కోట్లను చందాలుగా వసూలు చేశారు. ఈ టైంలో జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్స్ దరఖాస్తు చేసుకుంటే వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి చొరవ మచ్చుకైనా లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు టీచర్స్ ను, లెక్చరర్ల పరిస్థితి దుర్భరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరికీ 5వేలు, 10వేల రూపాయలు ఇస్తూ వారిని ఆర్థికంగా దోచుకుంటున్నాయి ప్రైవేట్ యాజమాన్యాలు. కనీస వేతనాలు అస్సలు ఇవ్వడం లేదు. పైగా ఫ్లోర్ లకు ఫ్లోర్ లు ఉన్న పెద్ద పెద్ద బిల్డింగులు ఎక్కిస్తూ.. క్యాంపస్ లు తిప్పుతూ వారిని పీల్చి పిప్పి చేస్తూ ఉదయం నుంచి రాత్రి దాకా పాఠాలు చెప్పిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సంవత్సరం మొత్తం ఫీజును ఇప్పటికే ప్రైవేట్ యాజమాన్యాలు వసూలు చేశాయి. 20 నుంచి 30 ఏళ్లుగా వారితో వెట్టి చాకిరీ చేయించుకున్న ప్రైవేట్ యాజమాన్యాలు ఇలాంటి కరోనా టైంలో టీచర్లు, లెక్చరర్లను అర్థాంతరంగా రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని వారంతా ప్రశ్నిస్తున్నారు. వాళ్ల సంక్షేమం ప్రైవేట్ యాజమాన్యాలకు ఎందుకు పట్టదన్నది ప్రశ్న. వీరి విషయంలో ప్రైవేట్ టీచర్ల సంఘాలు.. లేబర్ కమీషన్లు, మానవ హక్కుల సంఘాలు ఎందుకు ఏం చేయడం లేదు.?
ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో నాలుగు నెలలుగా జీతాలు లేక యాజమాన్యాలు తీసేసిన లెకర్చర్లు, టీచర్లు చాలా మంది పొట్టకూటి కోసం గ్రామాలకు వెళ్లి వ్యవసాయమో.. లేక చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. చదివిన చదువుకు.. చేస్తున్న వృత్తికి సంబంధం లేకుండా అష్టకష్టాలు పడుతున్నారు. ఈ మొత్తం ప్రైవేట్ దందాలో ఫీజుల పేరిట దోచుకుంటున్న యాజమాన్యాలు.. టీచర్లకు, లెక్చరర్లకు మాత్రం పైసా విదిల్చకపోవడం దారుణమని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు, సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది.
-ఎన్నం