PM Modi Visakha Tour: ఇప్పుడు ఏపీ ప్రజలు, రాజకీయ నాయకుల చూపు నవంబరు 11న పైనే ఉంది. ఆ రోజు దేశ ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తుండడమే అందుకు కారణం. ఎన్నో చిక్కుముళ్లకు ఆ రోజు సమాధానం దొరుకుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. విభజన హామీలకు మోక్షం కలుగుతుందని ప్రజలు భావిస్తుండగా.. తమ రాజకీయ ప్రయోజనాల విషయంలో ప్రధాని కీలక ప్రకటన జారీచేసే అవకాశముందని నేతలు భావిస్తున్నారు. అయితే ఎవరి ఆశ వారిది. ప్రధాని వస్తున్నది అధికారిక కార్యక్రమాలకు. అయినా పార్టీ ప్రయోజనాలను కాపాడడం కూడా ఒక రాజకీయ పార్టీనేతగా ప్రధాని ప్రయత్నిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. వాస్తవానికి ప్రధాని విశాఖ వస్తున్నది సమస్యలు పరిష్కరించడానికో.. రాజకీయాలు మాట్లాడడానికో కాకపోయినా… మనిషి ఆశాజీవి కనుక ఏవేవో ఊహాగానాలు చేస్తున్నారు. అయితే వాటిపై ఎటువంటి స్పష్టతనిస్తారో తెలియక.. ప్రధాని పర్యటనతో ఏదో జరగబోతుందన్న ప్రచారం అయితే ఊపందుకుంది.

నవంబరు 11న విశాఖలో ప్రధాని తీరిక లేకుండా గడపనున్నారు. రూ.400 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్ ను ఆధునీకరించే పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోనే దీ బెస్ట్ రైల్వేస్టేషన్ గా విశాఖను తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే విభజన హామీల్లో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ గా ప్రకటిస్తారని గత ఎనిమిదేళ్లుగా ప్రజలు ఆశిస్తున్నారు. దీనిపై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నారు. అటు ఎప్పటి నుంచో అనుకుంటున్న బీజేపీ కార్యాలయ నిర్మాణానికి ప్రధాని శంకుస్తాపన చేయనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, పార్టీ బలోపేతం, ఎన్నికల్లో ప్రయాణం వంటి వాటిపై శ్రేణులకు దిశ నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కలిసి నడుస్తున్న పార్టీలు, కలిసి నడవబోయే పార్టీ గురించి స్పష్టమైన ప్రకటన జారీచేసే అవకాశముండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్రకు కేటాయించిన భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వంటి వాటికి ప్రధానితో శ్రీకారం చుట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే మొత్తం కార్యక్రమంలో ప్రధాన భూమిక మాత్రం విశాఖ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులే. అయితే ప్రజలు మాత్రం ఆశిస్తున్నది విశాఖ ప్రత్యేక రైల్వేజోన్. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం. దీనిపై ఏళ్ల తరబడి కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలు ఉద్యమిస్తున్నాయి. సమస్య ఎక్కడ ఉందో అక్కడికే ప్రధాని వస్తుండడంతో దీనిపై ఒక ప్రకటన చేసి సమస్యలకు చెక్ చెప్పే బాధ్యత ప్రధానిపై ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఒత్తిడి కూడా ఉంది. స్థానికుల అభిప్రాయాలను గౌరవిస్తారా? లేక విశాల దేశానికి ప్రధానిగా కఠిన నిర్ణయాన్ని ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

ఇక రాజకీయంగా కూడా కొన్ని ప్రశ్నలు సమాధానాలకు ఎదురుచూస్తున్నాయి. ప్రధాని పర్యటించే నాటికి ఈ ప్రాంతంలో అమరావతి రైతుల మహా పాదయాత్ర ఉంటుంది. దీంతో అమరావతి రైతులు ప్రధానిని కలిసే చాన్స్ ఉంది. సాక్షాత్ మీరే శంకుస్థాపన చేసిన అమరావతి, మీ పార్టీ మద్దతు ప్రకటించిన ఏకైక రాజధాని అమరావతి విషయంలో వైసీపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానికి ఫిర్యాదుచేసే అవకాశముంది. మరోవైపు రాష్ట్రంలో పొత్తుల విషయంలో కూడా ఒక రకమైన క్లారిటీ ప్రధాని పర్యనతోవచ్చే అవకాశం ఉంది. జనసేన, టీడీపీతో కలిసి నడవాలని బీజేపీలో ఒక వర్గం కోరుతుండగా…జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని మరో వర్గం ప్రచారం చేస్తోంది. అయితే దీనిపై కేంద్ర నాయకత్వం వద్ద సరైన సమాచారం ఉంటుంది. అందుకే దీనిపై బహిరంగంగా కాకుండా.. పార్టీ అంతర్గత సమావేశంలోనైనా ప్రధాని స్పష్టతనిచ్చే అవకాశముంది. మొత్తానికైతే ప్రధాని విశాఖ పర్యటన..ఒకే దెబ్బకు ఎన్నో పిట్టలు రాలిన చందంగా.. చాలా విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశముంది విశ్లేషకులు భావిస్తున్నారు. అటు విభజన సమస్యలు, ఇటు అమరావతి, స్టీలు ప్లాంట్ వివాదంతో పాటు రాజకీయాలు.. ఇలా అన్నీ ప్రధాని విశాఖ టూర్ కోసమే ఆశగా ఎదురుచూస్తున్నాయి.