మోడీ చెప్పిన సీక్రెట్ : కాశీ నుంచి.. చీరకట్టుకొని పారిపోయిన బ్రిటీష్ గవర్నర్!!

warren hastings : సుమారు 250 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థం ఇది! ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్‌ జనరల్‌ హేస్టింగ్స్‌ చీరకట్టుకొని ప్రాణభయంతో పారిపోయాడు. ప్రస్తుతం మహా పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కాశీ నుంచి పలాయనం చిత్తగించాడు! మరి, అత్యంత బలవంతుడైన గవర్నర్‌ జనరల్‌ కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? చీర కట్టుకుని పారిపోవాల్సిన అగత్యమేంటి? ఈ విషయం ఇప్పుడెందుకు తెరపైకి వచ్చింది? అనే ప్రశ్నలకు.. ఈ స్టోరీలో సమాధానాలున్నాయి. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. అప్పుడు […]

Written By: K.R, Updated On : December 14, 2021 3:25 pm
Follow us on

warren hastings : సుమారు 250 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థం ఇది! ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్‌ జనరల్‌ హేస్టింగ్స్‌ చీరకట్టుకొని ప్రాణభయంతో పారిపోయాడు. ప్రస్తుతం మహా పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కాశీ నుంచి పలాయనం చిత్తగించాడు! మరి, అత్యంత బలవంతుడైన గవర్నర్‌ జనరల్‌ కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? చీర కట్టుకుని పారిపోవాల్సిన అగత్యమేంటి? ఈ విషయం ఇప్పుడెందుకు తెరపైకి వచ్చింది? అనే ప్రశ్నలకు.. ఈ స్టోరీలో సమాధానాలున్నాయి.

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. అప్పుడు కాశీ రాజ్యాన్ని బలవంత్‌ సింగ్‌ పాలిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు రాణులు. దీంతో.. సహజంగానే కుర్చీ కోసం వారసుల పంచాయితీ మొదలైంది. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి రెడీ అయ్యారు ఆంగ్లేయులు. తాము చెప్పినట్టు వింటాడని.. రెండో భార్య కొడుకు చేత్‌సింగ్‌కు మద్దతిచ్చారు. పాలన ప్రశాంతంగా సాగుతుండగా.. 1770లో అయోధ్య నవాబు షుజాహుద్దౌలా కాశీపై దండెత్తాడు. కానీ.. ఇద్దరూ మధ్యే మార్గంగా రాజీ కుదుర్చుకున్నారు. ఇదేదో తేడాగా ఉందని భావించిన బ్రిటీష్ సర్కారు.. చేత్‌సింగ్‌ రాజ్యాన్ని, ఆస్తులను స్వాధీనం చేసుకొని.. కేవలం జమీందార్‌గా ఉంచాలని నిర్ణయానికి వచ్చింది.

ఈ క్రమంలోనే.. ఇతర ప్రాంతాల్లో బ్రిటిష్‌ సర్కారు యుద్ధాలకు దిగింది. ఖర్చు పెరిగింది. దీంతో.. సంవత్సరానికి రూ.5 లక్షల చొప్పున మూడేళ్లపాటు కప్పం కట్టాలకని చేత్‌సింగ్‌ ను గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ ఆదేశించాడు. మొదటి ఏడాది డబ్బులిచ్చిన చేత్‌సింగ్‌.. ఆ తర్వాత చేతులెత్తేశాడు. కోపగించుకున్న హేస్టింగ్స్‌.. మరో లక్ష రూపాయలు జరిమానా వేసి, వెయ్యిమంది సైనికులను పంపాలని ఆదేశాలు జారీ చేశాడు. కానీ.. చేత్ సింగ్ సగం మంది సైనికులను వట్టి చేతులతో పంపించాడు.

కోపం నషాలానికి అంటింది. బ్రిటీష్ సైనిక పటాలాన్ని కాశీలో దించాడు హేస్టింగ్స్. 6 లక్షలతోపాటు సైనికుల ఖర్చులు భరించాలని ఆదేశాలు జారీ చేశాడు. మళ్లీ సేమ్ సీన్ రిపీట్. ఒక లక్ష రూపాయలు పంపించాడు చేత్‌సింగ్‌. బ్రహ్మాండం బద్ధలయ్యేంత కోపంతో.. స్వయంగా రంగంలోకి దిగాడు హేస్టింగ్స్. 1781 ఆగస్టు 15న తన సైనికులతో కాశీలో దిగాడు.

ఆ సమయంలో పూజకోసం గంగానది వద్దకు వెళ్లాడు చేత్ సింగ్. రెండు కంపెనీల సైన్యాన్ని పంపించిన హేస్టింగ్స్.. చేత్‌సింగ్‌ను ఈడ్చుకొని తీసుకురావాలని ఆదేశించాడు. పూజ కోసం వచ్చిన చేత్‌సింగ్‌ వద్ద కొద్దిమంది సైనికులే ఉన్నారు. అయితే.. రాజుపై దాడి జరుగుతోందని తెలియగానే.. స్థానికులు పరిగెత్తుకొచ్చి చేత్‌సింగ్‌కు అండగా నిలిచారు. భీకర పోరాటం సాగింది. ఆ పోరాటంలో.. దాదాపు 200 మంది బ్రిటిష్‌ సైనికులు మరణించారు. ఈ విషయం కాశీ పట్టణం మొత్తం వ్యాపించింది. స్థానికులు బ్రిటిష్‌ రెసిడెంట్‌ మార్కోమ్‌ ఇంటిపై దాడికి దిగారు. దీంతో.. ఆ ప్రాంతమంత రణరంగంగా మారిపోయింది. కాశీ పట్టణం శివారులో ఒక తోటలో రిలాక్స్ అవుతున్న వారెన్‌ హేస్టింగ్స్‌కు.. ఈ విషయం తెలిసింది. పరిస్థితి మామూలుగా లేదని, వెంటనే పారిపోవాలని ఆయన గుమాస్తాలు సూచించారు. లేదంటే ప్రాణాపాయం కూడా తప్పదని హెచ్చరించారు.

వాస్తవాన్ని గర్తించిన హేస్టింగ్స్.. పరారవడానికి సిద్ధమయ్యాడు. కానీ.. ఎవరైనా చూస్తే మొదటికే మోసం వస్తుంది భావించి.. బ్రిటిష్‌ దుస్తులను విప్పేసి, ఒక చీరకట్టించి.. పల్లకీ ఎక్కించి హేస్టింగ్స్‌ ను ఊరు దాటించేశారు. ఆ విధంగా.. అత్యంత బలమైన బ్రిటిష్‌ రాజ్యాధీశుడిని.. చీరకట్టుకును పారిపోయేలా చేసింది కాశీ పట్టణం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు గుర్తొచ్చిందంటే.. నిన్న వారణాసిలో కొత్త నవాడాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోడీ. ఈ సందర్భంగా నాటి ఈస్టిండియా కంపెనీ గవర్నర్‌ జనరల్‌ హేస్టింగ్స్‌ను మోడీ గుర్తు చేసుకున్నారు. దీంతో.. ఆయన చీర కథ మరోసారి చర్చనీయాంశమైంది.