https://oktelugu.com/

Prashanth Kishore : 100 కోట్ల స్ట్రాటజీ లెక్కలు చెప్పిన పీకే.. ఇరకాటంలో పడిన పార్టీలు..!

దేశవ్యాప్తంగా కీలక రాష్ట్రాల్లో గెలుపు కోసం పనిచేసిన ఆయన.. 2023లో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఐ-ప్యాక్ వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తానే స్వయంగా ఓ పార్టీని ప్రకటించారు. జన సూరజ్ పేరిట కొత్తగా పార్టీని పెట్టారు. ఈ మేరకు బిహార్ రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన పాదయాత్ర సైతం చేశారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 5, 2024 1:47 pm
    Prashanth Kishore

    Prashanth Kishore

    Follow us on

    Prashanth Kishore : సక్సెస్‌ఫుల్ ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్ కిషోర్‌కు మంచి పేరుంది. ఆయన ఏ రాష్ట్రంలో ఏ పార్టీ తరఫున పనిచేసినా.. అక్కడ ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న భరోసా ఉంది. అలా దేశవ్యాప్తంగా ఆయన పలు కీలక పార్టీలకు సలహాదారుగా పనిచేశారు. అంతేకాకుండా 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలో రావడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. బీజేపీకి సలహాదారుగా పనిచేసి.. కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడ్డారు. అలాగే.. 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సలహాదారుగా పనిచేశారు. ఆ సమయంలోనూ జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత ఎన్నికల్లో పీకే చంద్రబాబు వెంట నడిచారు. ఆయన సలహాదారుగా పనిచేయడంతో పోయిన ఎన్నికల్లో చంద్రబాబు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఇక 2015లో బిహార్ ఎన్నికల్లో జేడీయూ-ఆర్జేడీల మహాఘట్ బంధన్‌కు వ్యూహకర్తగా పనిచేశారు. 2017లో పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం పనిచేశారు. ఇక.. 2020 ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీ ఘన విజయానికి కారణం అయ్యారు. అలాగే.. 2021లో తమిళనాడులో డీఎంకే, పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ గెలుపు కోసం కృషి చేశారు.

    దేశవ్యాప్తంగా కీలక రాష్ట్రాల్లో గెలుపు కోసం పనిచేసిన ఆయన.. 2023లో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఐ-ప్యాక్ వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తానే స్వయంగా ఓ పార్టీని ప్రకటించారు. జన సూరజ్ పేరిట కొత్తగా పార్టీని పెట్టారు. ఈ మేరకు బిహార్ రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన పాదయాత్ర సైతం చేశారు. ఇప్పుడు అక్కడ పలు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల బిహార్‌లోని బెలాగంజ్‌లో పీకే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏదైనా పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తే ఎంత తీసుకుంటారనే దానిపై రకరకాల ప్రచారాలు వినిపించాయి. కానీ.. తాను తీసుకునే రెమ్యునరేషన్‌పై పీకే ఒక్కసారిగా నోరుజారారు.

    తాను ఏ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసినా అందుకు ఫీజు కింద రూ.100 కోట్లు వసూలు చేస్తానని పీకే ఆ ప్రచారంలో భాగంగా చెప్పారు. కొన్ని పార్టీల వద్ద అంతకన్న ఎక్కువే తీసుకుంటానని వ్యాఖ్యలుచేశారు. దేశంలో పది ప్రభుత్వాలు తన వ్యూహాలతోనే అధికారంలో కొనసాగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీకి ఎన్నికలకు వ్యూహకర్తగా పనిచేస్తే.. తన పార్టీని రెండేళ్ల పాటు నడిపించవచ్చని అన్నారు. అయితే.. పీకే వ్యాఖ్యలతో ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న.. గతంలో అధికారంలో కొనసాగిన పార్టీలు గందరగోళంలో పడ్డాయి. పీకేకు ఇవ్వడానికి ఆ పార్టీల దగ్గర రూ.100 కోట్లు ఎక్కడివి..? దేని ద్వారా వాటిని సేకరించారు..? పీకేకు చెల్లించిన మొత్తాన్ని ఎన్నికల ఖర్చుల్లో చూపించారా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఒకవేళ చూపించనట్లయితే ముందు ముందు ఎన్నికల కమిషన్ ఆయా పార్టీల పట్ల ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా..? అన్న సందేహాలూ వినిపిస్తున్నాయి. అటు పార్టీలు సైతం రూ.100 కోట్ల అంశంపై ఎలా స్పందిస్తాయో చూడాలి మరి. మొత్తానికి పీకే వ్యాఖ్యలు ఆయా పార్టీలు తప్పనిసరిగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని తెచ్చాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.