Ram Gopal Varma Vyuham: రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువ అన్నట్టుంది ఏపీలో వైసిపి సర్కార్ వ్యవహార శైలి. ఏకంగా ఓ సినిమా చిత్రీకరణ కోసమే గంటకు పైగా ప్రకాశం బ్యారేజ్ ను మూసి వేయించారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్యారేజ్ మీదుగా హైకోర్టు,సెక్రటేరియట్ కు నిత్యం ఉన్నతాధికారులు వెళ్తుంటారు. ఈ కారణం తోనే బ్యారేజ్ పై ఎటువంటి ఆందోళనలకు, నిరసనలకు అవకాశం ఇవ్వరు. కానీ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ కోసం ఏకంగా గంట పాటు బ్యారేజీని మూసివేశారు. దీంతో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు జగన్ ఎదుర్కొన్న పరిణామాలపై వర్మ సినిమాను చిత్రీకరిస్తున్నారు. దానికి వ్యూహం అన్న టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రధానంగా జగన్ పాదయాత్ర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ పై జన సమూహం తో నాడు జగన్ చేసిన పాదయాత్ర ఎంతో హైలెట్ అయింది. దానికి తలదన్నేలా ఈ చిత్రంలో ఆ దృశ్యాన్ని ఆవిష్కరించాలని రామ్ గోపాల్ వర్మ భావిస్తున్నారు.

ఆదివారం బ్యారేజీపై పాదయాత్ర ఘట్టాలపై షూటింగ్ చేశారు. సాయంత్రం 3.50 గంటల నుంచి 4.55 వరకు వాహనాల రాకపోకలను పోలీసులు నిషేధించారు. అయితే ఉన్నట్టుండి ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. తాడేపల్లి, మంగళగిరి, కనకదుర్గమ్మ ఆలయం, హైదరాబాద్ వైపు వెళ్లి వాహనాలు ఒక్కసారిగా రోడ్లపై నిలిచిపోయాయి. తాడేపల్లి,సీతానగరం వైపు ప్రజలు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. గంటకు పైగా మూసివేసి సినిమా షూటింగ్ కు అనుమతించడాన్ని వాహనదారులు ప్రశ్నించారు. పోలీసుల అత్యుత్సాహం విమర్శలకు తావిచ్చింది.