India Three Layer Anti Terrorism Strategy: భారతదేశం ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు మూడంచెల విధానాన్ని అమలు చేస్తోంది. ఇది కేవలం దాడులను అడ్డుకోవడమే కాకుండా, ఉగ్ర నెట్‌వర్క్‌లను వేళ్లతో సహా పెకిలించడంపై దృష్టి సారిస్తుంది. తాజాగా ఢిల్లీలో లష్కర్–ఎ–తోయిబా కమాండర్ షబ్బీర్ అహ్మద్ లోన్ అలియాస్ రాజా కశ్మీరీని అరెస్టు చేసి ఈ వ్యూహంలో కీలక విజయంగా నిలిచింది.
మూడంచెల వ్యూహం ఇలా..
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన ‘ప్రహార్’ జాతీయ ఉగ్రవాద వ్యతిరేక విధానం ఈ మూడు స్తంభాలపై ఆధారపడి ఉంది. మొదటిది డీక్యాపిటేషన్. పాకిస్తాన్లో దాగి ఉన్న అత్యున్నత నేతలు, వ్యూహకర్తలను లేపేస్తోంది. రెండోది మిడిల్ హ్యాండ్లర్ల నిర్మూలన.. ఇందులో హ్యాండ్లర్లు, లాజిస్టిక్స్ సపోర్టర్లు, నేతలు మరియు భూమిపై ఉన్న ఉగ్రవాదుల మధ్య లింక్ తెంచుతోంది. చివరిది గ్రౌండ్ నెట్వర్క్ భగ్నం.. స్లీపర్ సెల్స్, రిక్రూటర్లు, ఫైనాన్సియర్లు కొత్త దాడులు జరగకుండా చూడటం, రిక్రూట్మెంట్ ఆపడం వంటి చర్యలు చేపడేతోంది.
డీక్యాపిటేషన్ స్ట్రాటజీ..
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లో సురక్షితంగా కూర్చుని భారత్‌పై దాడులకు కుట్ర పన్నే అత్యున్నత నేతలను లక్ష్యంగా చేసుకోవడం ఇది. హాఫిజ్ సయీద్, మసూద్ అజహర్ వంటి వారిని అంతర్జాతీయంగా ఒంటరి చేయడం, వారి ఆస్తులను స్తంభింపజేయడం ఇందులో భాగం.
2. మిడిల్–లెవల్ హ్యాండ్లర్ల వేట..
ఇది అత్యంత కీలకమైన దశ. పాకిస్తాన్ నుంచి ఆదేశాలు తీసుకుని, భారత్‌లోని స్లీపర్ సెల్స్‌కు అందించే హ్యాండ్లర్లను పట్టుకుంటే పై నేతలకు, కింద పనిచేసే ఉగ్రవాదులకు మధ్య సంబంధం తెగిపోతుంది. షబ్బీర్ అహ్మద్ లోన్ ఇలాంటి కీలక హ్యాండ్లరే.
గ్రౌండ్ నెట్‌వర్క్‌ను పెకిలించడం..
భారత్‌లోని స్లీపర్ సెల్స్, రాడికలైజ్ అవుతున్న యువత, ఆర్థిక సహకారం అందించేవారిని గుర్తించి అరెస్టు చేయడం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ (విజయవాడ), బిహార్, ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఇటీవల జరిగిన ఎన్ఐఏ దాడులు ఇందుకు నిదర్శనం.
20 ఏళ్లుగా లష్కర్‌తో అనుబంధం..
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఇటీవల అరెస్టు చేసిన షబ్బీర్ అహ్మద్ లోన్ కేసు, కేంద్రం వ్యూహాన్ని స్పష్టంగా చాటిచెబుతోంది. జమ్మూకశ్మీర్‌లోని కాంగన్‌కు చెందిన ఇతను 2007లోనే మొదటిసారి అరెస్టయ్యాడు. హాఫిజ్ సయీద్, జాకీర్ రహ్మాన్‌లకు సన్నిహితుడు. 2018లో బెయిల్‌పై విడుదలై, 2019లో బెయిల్ షరతులు ఉల్లంఘించి పరారయ్యాడు. తర్వాత బంగ్లాదేశ్‌కు పారిపోయి, అక్కడ స్థానిక మహిళను వివాహమాడి స్థిరపడ్డాడు. బంగ్లాదేశ్‌లో ఉంటూనే పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు భారత్‌లో ఉగ్రవాద కుట్రలు రచించాడు. బంగ్లాదేశ్, కోల్‌కతా, చెన్నై, తిరుచిరాపల్లి, బిహార్, విజయవాడల్లో కీలక నెట్‌వర్క్‌ను నిర్మించాడు. నెల రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌తో ఢిల్లీ సరిహద్దులో ఇతణ్ని పట్టుకున్నారు. ఇతని అరెస్టుతో బంగ్లాదేశ్ లింక్ ఉన్న పెద్ద ఉగ్ర మాడ్యూల్ భగ్నమైంది.
తర్వాతి టార్గెట్ షేక్ సజ్జార్ గుల్
లోన్ అరెస్టు తర్వాత, ఎన్ఐఏ దృష్టి ఇప్పుడు మరో కీలక ఉగ్రవాద నేత షేక్ సజ్జార్ గుల్‌పై పెట్టింది. లష్కర్–ఎ–తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అధినేత. 2002లో అరెస్టై, 2017లో జైలు శిక్ష పూర్తిచేసుకుని బంగ్లాదేశ్ వెళ్లాడు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా బంగ్లాదేశ్‌లో దాగి ఉన్నట్లు భావిస్తున్నారు. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్లో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన ఉగ్రదాడికి ఇతనే సూత్రధారి అని ఎన్ఐఏ గుర్తించింది. ఇతనిపై ఎన్ఐఏ రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది.
కేంద్రం అమలు చేస్తున్న ఈ మూడంచెల వ్యూహం ఉగ్రవాదాన్ని కేవలం అణచివేయడమే కాకుండా, దాని వేళ్లను పెకిలించడంపై దృష్టి సారిస్తుంది. షబ్బీర్ అహ్మద్ లోన్ అరెస్టు వంటి విజయాలు, షేక్ సజ్జార్ గుల్ వంటి వారిపై ఉన్న వేట ఈ వ్యూహం యొక్క తీవ్రతను చాటిచెబుతున్నాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌లలోని ’మధ్యవర్తులను’ తొలగించడం ద్వారా, పై నేతల ఆదేశాలు కింది స్థాయి ఉగ్రవాదులకు చేరకుండా చేయడమే ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యం.