Hyderabad Power Island: నదులు ఉన్నచోట నాగరికత వెలిసింది. అది వెనుకటి చరిత్ర. ఆధునిక చరిత్రలో ఎక్కడ విద్యుత్తు ఉంటే అక్కడ ఆర్థికాభివృద్ది కేంద్రీకృతమై ఉంటున్నది. మానవ అభివృద్ధి కూడా అక్కడే అధికంగా ఉంటున్నది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పుష్కలంగా ఉన్నది. అందువల్లే తెలంగాణ రాజధాని హైదరాబాద్ భారత దేశపు పవర్ ఐలాండ్ గా అవతరించింది.. దీనివల్ల ప్రతి అంతర్జాతీయ సంస్థ హైదరాబాదులో ఏర్పాటు అవుతున్నది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయాలంటే 150 మెగా వాట్ల విద్యుత్ అవసరం. ప్రస్తుతం అలాంటి 10 సెంటర్లు ఏర్పాటు చేసినా విద్యుత్ అవసరాలు తీర్చే సత్తా తెలంగాణకు ఉంది.. ఒకవేళ 10 సెంటర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన వస్తే విద్యుత్ అవసరాలు తీర్చే సత్తా హైదరాబాద్ మినహా మిగతా నగరాలకు కూడా లేవు.. పుష్కలంగా విద్యుత్తు, విస్తారంగా భూమి ఉండడం వల్లే హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు వివిధ కంపెనీలు మూడేసి చొప్పున 15 డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నాయి.. అందుకు ట్రాన్స్ కో అధికారులు కూడా ఆమోదం తెలుపుతున్నారు.. ఫలితంగా హైదరాబాద్ దేశానికే పవర్ ఐలాండ్ గా మారింది.
హైదరాబాద్ మేటి
కేరళలో విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుంది.. బెంగళూరులో సరిపడా సబ్ స్టేషన్లు లేవు.. తమిళనాడులో డిమాండ్, సరఫరా మధ్య బోలెడు వ్యత్యాసం.. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కొంచెం మెరుగు.. హైదరాబాద్ పరిస్థితి వీటన్నింటికంటే పూర్తి విభిన్నం.. ఇక్కడ విద్యుత్ డిమాండ్ 3,400 మెగావాట్లు.. ఇప్పటికిప్పుడు 6,000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ను కూడా తట్టుకునే సామర్థ్యం హైదరాబాద్ కు ఉన్నది. వీటన్నిటికీ మించి జాతీయ గ్రిడ్ విఫలమైనా హైదరాబాద్ పవర్ ఐలాండ్ స్వతంత్రంగా పనిచేసేలా అధికారులు రూపొందించారు.
మూడు వలయాలు
హైదరాబాద్ నగరం చుట్టూ మూడు వలయాలు ఉన్నాయి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్డు వ్యవస్థకు అనుగుణంగా విద్యుత్ వలయాలు ఏర్పాటు చేశారు.. నగరం చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నాయి. త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు కూడా వస్తున్నది.. హైదరాబాద్ విద్యుత్ ఐలాండ్ ను నగర కేంద్రంగా చుట్టూ 25 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేశారు.. నగరం చుట్టూ మరో వంద కిలోమీటర్ల పరిధిలో ఒకటి, 200 కిలోమీటర్ల పరిధిలో మరో ఐలాండ్ నెలకొల్పారు.. హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు మూడు విద్యుత్ వలయాలు ఉన్నాయి .. దక్షిణాది రాష్ట్రాల్లో చెన్నై, నైవేలీ, కూడంకళం, విశాఖపట్నంలోనూ విద్యుత్ ఐలాండ్ లను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 400 సబ్ స్టేషన్లను నిర్మించింది.. వేల కొద్దీ ట్రాన్స్ఫార్మర్లను అమర్చింది.. వేల కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసింది.. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 13 వేల కోట్ల విలువైన పనులను పూర్తి చేసి హైదరాబాద్ ప్రాంతాన్ని విద్యుత్ ఐలాండ్ గా మార్చింది.
ఎలా పనిచేస్తుందంటే
గ్రేటర్ పవర్ గ్రిడ్ ను నేషనల్ గ్రిడ్ తో పాటు మరో మూడు పవర్ ప్రాజెక్టులకు అనుసంధానించారు. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్- భూపాలపల్లి, సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్_ మంచిర్యాల, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్_ రామగుండం తో కలిపారు. మూడు పవర్ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం 3700 మెగావాట్లు. వీటిలో సగటున 80 ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది . ఈ మూడు ప్రాజెక్టుల నుంచి సుమారు 2,960 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.. దీంతో సుమారు 2,916 మెగావాట్లను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసే వీలవుతుంది.. ఒకవేళ భారత దేశ పవర్ గ్రిడ్ లో లోపం తలెత్తితే క్షణాల్లో గ్రేటర్ పవర్ గ్రిడ్ ఆక్టివేట్ అవుతుంది.. వెంటనే నేషనల్ పవర్ గ్రిడ్ నుంచి ఈ గ్రిడ్ వేరవుతుంది.. ఆ వెంటనే పై మూడు పవర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ సరఫరా అవుతూ ఈ ఐలాండ్ స్వతంత్రంగా పనిచేస్తుంది.. దీంతో హైదరాబాదులో ఒక్క క్షణం కూడా కరెంటు పోదు. ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే ప్రఖ్యాత సంస్థలు తమ కేంద్రాలను హైదరాబాదులో ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి.. మునుముందు హైదరాబాద్ దేశ ఆర్థిక రాజధానిగా ఎదిగినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.