
BJP Focus Telangana: నరేంద్రమోదీ.. తొమ్మిదేళ్ల క్రితం వరకు ఇది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పేరు మాత్రమే.. కానీ ఇప్పుడు ఈ పేరు బీజేపీకి ఒక బ్రాండ్ అంటే అతిశయోక్తి కాదు. గడిచిన ఐదేళ్లుగా బీజేపీ మోదీ పేరుతోనే దేశంలోని పలు రాస్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ మోదీ ప్రధాని అయితేనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావించారు. అందుకే పార్టీని చూడకుండా కమలాన్ని బంపర్ మెజారిటీతో గెలిపించారు. 2014 ఎన్నికల కంటే ఎక్కువ ఎంపీలను గెలిపించారు. అయితే ఉత్తరాదిన తిరుగులేని పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీకి దక్షిణాదిన పట్టు చిక్కడం లేదు. కర్ణాక మినహా దక్షిణాదిలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి పెద్దగా బలం కూడా లేదు. ఈ తరుణంలో ఈ ఏడాది 8 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో దక్షిణ భారత దేశంలో కర్ణాక, తెలంగాణ అసెంబ్లీ ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ దానిని నిలబెట్టుకోవడంతోపాటు కొత్తగా తెలంగాణలోనూ పాగావేయాలని చూస్తోంది. పార్టీ అంతర్గత సర్వేల ద్వారా దక్షిణ భారత దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అని గుర్తించిన కమలనాథులు.. ఈమేరకు ఏడాదిగా అధికార బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఫైట్ చేస్తున్నారు. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అనుకునేలా హైప్ తీసుకొచ్చారు.
కదనరంగంలోకి కమలనాథులు..
తెలంగాణలో ఎన్నికల మూడ్ మొదలైంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కమలనాథులు అస్త్రశస్త్రాతలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ పార్టీ బ్రాండ్ అయిన ప్రధాని నరేంద్ర మోదీనే ఇక్కడ కూడా ముందుంచాలని భావిస్తోంది. రెండేళ్లుగా బీజేపీతో కయ్యానికి కాలుదువ్వుతున్న బీఆర్‌ఎస్ ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చిన ప్రతీసారి హైదరాబాద్‌లో బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వడం లేదు. బీఆర్‌ఎస్ పథకాలతో హోర్డింగ్స్ నింపేస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా, ఇతర కార్యక్రమాలకు రెండుసార్లు వచ్చినప్పుడు కూడా బీఆర్‌ఎస్ ఇదేవిధంగా వ్యవహరించింది.
టిట్ ఫర్ టాట్…
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టిపెట్టిన బీజేపీ అధిష్టానం.. కేసీఆర్ సర్కార్‌కు దీటుగా ఇప్పుడు హైదరాబాద్‌లో హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేస్తూ హోర్డింగ్స్ వెలిశాయి. డబుల్ బెడ్రూం బాధితుల సంఘం, గిరిజన యూనివర్సిటీ సాధన సమితి, హైదరాబాద్ మధ్య తరగతి ప్రజలు, హైదరాబాద్ నర్సింగ్ విద్యార్థులు, గిరిజన విద్యార్థి సమాఖ్య పేరుతో వీటిని ఏర్పాటు చేశారు. దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు 79 వేల కోట్లు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ డబుల్ బెడ్రూం బాధితుల పేరిట హోర్డింగ్ ఏర్పాటు చేశారు.

మోదీ మానియా తెచ్చేందుకే..
అయితే ఈ హోర్డింగ్స్ వివిధ సంఘాల పేరిట వెలిసినా, వాటి వెనుక బీజేపీ ఉందన్నది కాదనలేని నిజం. ఎన్నికలకు సద్ధిమవుతున్న కమలనాథులు మోదీ పేరు, పార్టీ సింబల్‌ను మరింతగా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లడం, యూత్‌ను అట్రాక్ట్ చేయడమే లక్ష్యంగా ఈ హోర్డింగ్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
మొత్తంగా ఈ హోర్డింగ్స్ ద్వారా ఎన్నికలకు తాము అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని అధికార బీఆర్‌ఎస్‌కు కమళనాథులు పరోక్షంగా సంకేతాలు పంపించారు.