
తెలుగు రాష్ట్రాల సీఎంలు జనాలకు ‘చీకట్ల’తో చుక్కలు చూపిస్తున్నారు. పేరుకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలంగాణలో కేసీఆర్.. ఏపీలో సరిపడా విద్యుత్ ఇస్తున్నానని సీఎం జగన్ డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ క్షేత్ర స్థాయిలోకి వెళితే మాత్రం చిమ్మీ చీకట్లు పల్లెలను వెక్కిస్తున్నాయి. కరోనా కాలంలో అంతా వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసుల వేళ ఈ కోతలు వివిధ షాపుల వారిని పనిచేసుకోనివ్వకుండా.. విద్యార్థులను చదువులు చదువుకోనీయకుండా.. ఉద్యోగులను ఉద్యోగాలు చేసుకోనీయకుండా చేస్తోందన్న విమర్శలు క్షేత్రస్థాయి నుంచి వినిపిస్తున్నాయి. 24 గంటల కరెంట్ అంటూ ఊదరగొట్టడమే కానీ.. క్షేత్రస్తాయిలో ప్రతీసారి ఏదో కారణం చెప్పి పల్లెల్లో విద్యుత్ లేకుండా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్, జగన్ లు గొప్పలకు పోయి జనాలకు కరెంట్ వాతలు పెడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
-తెలంగాణలో 24 గంటల నో వే!
తెలంగాణలో 24 గంటల కరెంట్ అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ నుంచి మొదలు కొని మంత్రులు కేటీఆర్, హరీష్ సహా టీఆర్ఎస్ నేతలంతా డబ్బా కొట్టుకుంటారు. కానీ ఏదో ఒక కారణంగా పట్నాలు, పల్లెలకు కరెంట్ తీసేస్తూనే ఉన్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. ప్రతి శనివారం సబ్ స్టేషన్లలో మెయింటనెన్స్ పేరిట పట్నాలు, పల్లెలు ఉదయం అంతా కరెంట్ తీసేస్తున్నారు. ఇక సోమవారం చెట్ల కొమ్మలు అంటూ అదో తంతు.. ఇక బుధ, గురువారాల్లో వర్షం పడితే ఇక కరెంట్ సంగతి అంతే. ఇలా ఏదో ఒక కారణంగా.. టెక్నికల్ ఇష్యూలు, లేదంటే ఏదో మెయింటనేన్స్ అంటూ తెలంగాణలో పల్లెలకు మరీ దారుణంగా కరెంట్ తీసేస్తున్నారు. పట్నాల్లో కొంత మెరుగ్గా అదీ 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-ఏపీలో మరీ దారుణం
ఏపీలో 24 గంటల కరెంట్ అని అధికారికంగా చెప్పకున్నా కడుపునిండా కరెంట్ ఇస్తున్నామని జగన్ తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ నిస్తున్నారు. అయితే వ్యవసాయానికి విద్యుత్ పేరిట కరెంట్ డిమాండ్ వల్ల పల్లెలకు కోతలు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏపీలో పట్నాలకు కొంత వరకు కరెంట్ ఉన్నా.. పల్లెల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో కారణం చెప్పి కరెంట్ తీసేస్తున్నారని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి. అసలు వర్షకాలం తుమ్మితే బంద్ అయ్యే కరెంట్ . ఇక ఇదే కాకుండా కరోనాతో ఉద్యోగులు, విద్యార్థులు ఇంటినుంచే పనిచేస్తున్నారు. విద్యార్థులకు ఆన్ లైన్ చదువుల కష్టాలు, ఉద్యోగులకు కరెంట్ లేక వారి పనులు సాగక నరకయాతన అనుభవిస్తున్నారు.
– 24 గంటల కరెంట్ ఉత్తిదేనా కేసీఆర్, జగన్ సార్?
తెలంగాణలో సెకన్ పాటు కూడా కరెంట్ పోదని సభల్లో కేసీఆర్ గొప్పలకు పోతారు. కానీ మెయింటెన్స్ లంటూ, ప్రతీ వారంలో ఒకటి రెండు రోజులు ఏదో కారణంతో పట్నాల్లోనే కరెంట్ తీసేస్తున్నారు. ఇక పల్లెల్లో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అభివృద్ధి పనులని, మెయింటెనెన్స్ అనీ, పోల్స్ మారుస్తున్నామంటూ ఏదో కారణం చెప్పి నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంట్ కోతలు అమలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పల్లెల్లో అయితే 24 గంటల కరెంట్ ఒట్టి మాటేనని ఆరోపిస్తున్నారు. ఏపీ పల్లెల్లోనూ ఇదే పరిస్థితి అని.. కరోనా వేళ విద్యార్థులు, ఉద్యోగులు ఇంటినుంచి తమ విధులు నిర్వర్తించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
-విద్యార్థులు, ఉద్యోగుల భవిష్యత్ ‘అంధకారం’
కరోనా కల్లోలంలో స్కూళ్లు బంద్ అయిపోయాయి. కంపెనీలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు మొత్తం తమ గ్రామాలకు చేరారు. మెజార్టీ పల్లెల్లోనే ఉండి ఆన్ లైన్ చదువులు, వర్క్ ఫ్రం హోం పేరిట ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి కరెంట్ సరఫరా అత్యంత కీలకం. కానీ జగన్, కేసీఆర్ సర్కార్ లు మాత్రం పల్లెలకు పూర్తిగా కరెంట్ తీసేస్తూ వారి భవిష్యత్ ను అంధకారం చేస్తోంది. విద్యార్థుల చదువులు సాగక.. ఉద్యోగులకు పనికాక నానా ఇబ్బందులు పుడుతన్నా అస్సలు పట్టించుకునే వారే కరువయ్యారు.
-వ్యవసాయం కోసం పల్లెలకు కట్?
నిజానికి సరిపడా విద్యుత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా వానాకాలం రావడం.. వ్యవసాయ పనులు సాగుతుండడంతో వ్యవసాయ 3 ఫేజ్ విద్యుత్ కోసం కేసీఆర్, జగన్ సర్కార్ లు పల్లెలకు కోతలు పెట్టి రైతులకు ఇస్తున్నట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికోసం పల్లెల్లో ఏదో కారణం చెప్పి పొద్దంతా కరెంట్ తీసేస్తున్నారని చెబుతున్నారు. వ్యవసాయం కోసం పల్లెలకు తీసేస్తుండడంతో ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులకు పనులు కాక వారి భవిష్యత్ కే చేటు తెచ్చేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
ఇప్పటికైనా ప్రభుత్వాలు 24 గంటల కరెంట్ అని ఊదరగొట్టే బదులు.. పల్లెలకు కడుపునిండా కరెంట్ ఇచ్చి ప్రజల కష్టాలు తీర్చాలని గ్రామ వాసులు కోరుతున్నారు. లేకుంటే అందరి భవిష్యత్ కు ఇది పెను విఘాతం అవుతుందంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఆన్ లైన్ చదువులు సాగవని.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంతో పనులు కావని అంటున్నారు. ఇప్పటికైనా పల్లెలకు,పట్నాలకు పూర్తి స్థాయిలో కరెంట్ ఇవ్వాలని కోరుతున్నారు.