Raj Gopal Reddy: మొన్నామధ్య కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేరిట పే ఫర్ సీఎం పేరిట వాల్ పోస్టర్లు అంటించడం అప్పట్లో కలకలం సృష్టించింది. ఇప్పుడు తాజాగా అటువంటి ప్రచారమే మునుగోడు నియోజకవర్గం లోని చుండూరులో కలకలం సృష్టిస్తున్నది. ఇక్కడ పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్థులు చుండూరులో కాంట్రాక్టు పే అంటూ వేల పోస్టర్లను రాత్రికి రాత్రే అంటించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఆస్తులు, అప్పులు, పోలీసు కేసులు, ఇతరత్రా వివరాలతో కూడిన అఫిడవిట్ ను సోమవారం రిటర్నింగ్ అధికారికి అందజేసి నామినేషన్ వేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఆస్తులకు సంబంధించి అవినీతి ఆరోపణలు చేసిన ప్రత్యర్థులు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఏకంగా పోస్టర్లు ప్రచురించి గోడలకు అంటించారు.

ఫోన్ పే తరహాలో
రాజగోపాల్ రెడ్డి స్వతహాగా కాంట్రాక్టర్ కావడంతో ఆయన ప్రత్యర్థులు చుండూరులో ఫోన్ పే తరహాలో కాంట్రాక్టు పే అంటూ పోస్టర్లు అంటించారు. చుండూరులో రాత్రికి రాత్రే వేలాది పోస్టర్లు గోడలకు అంటించారు. సుమారు 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటాయించారంటూ ” బిజెపి 18 వేల కోట్లు” అనే ట్రాన్సాక్షన్ ఐడిని ఫోన్ పే తరహాలో పోస్టర్లో ప్రింట్ చేయించారు. 500 కోట్ల బోనస్ సంపాదించారంటూ ఈ పోస్టర్లో పొందుపరిచారు. ఈ పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఈ పోస్టర్ల వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడుతున్నది. మొన్న కర్ణాటకలో ఇదే తరహా విష ప్రచారం చేశారని , ఇప్పుడు దానిని మునుగోడు లోనూ కొనసాగిస్తున్నారని బిజెపి నాయకులు అంటున్నారు. దీని వెనుక ఉన్నది టిఆర్ఎస్ నాయకులు అని విమర్శిస్తున్నారు. మునుగుడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూసుకుపోతున్న నేపథ్యంలోనే దానిని జీర్ణించుకోలేక ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కాగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటు చేయడం ఇది తొలిసారి కాదు.

రాజీనామా చేసిన దగ్గర నుంచి వ్యతిరేకంగా ఎక్కడో ఒకచోట పోస్టర్లు కలకలం రేపుతూనే ఉన్నాయి. కాగా ఇప్పటివరకు ప్రధాన పార్టీల నుంచి కేవలం ఒక రాజగోపాల్ రెడ్డి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారంలో కూడా దూకుడు పెంచారు. మునుగోడు నియోజకవర్గాన్ని మొన్నటిదాకా పట్టించుకోలేదని, తాను రాజీనామా చేయడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని ఆయన జనాల్లోకి తీసుకెళుతున్నారు. పైగా తనను ఓడించేందుకు టిఆర్ఎస్ అధినాయకత్వం అనేక కుటిల ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచార ఆరంభంలోనే మునుగోడు లో పరిస్థితి ఇలా ఉంటే.. ముందు ముందు ఇంకా ఎలాంటి పరిణామాలను చవిచూడాల్సి వస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక ప్రత్యర్థి పై ఇలాంటి విష ప్రచారం చేయడం సరికాదని వారు నొక్కి వక్కానిస్తున్నారు.