Vijayasai Reddy- MLA Balineni: వైసీపీలో బాలి నేని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజులుగా పార్టీ హై కమాండ్ పై అసంతృప్తి తో ఉన్న సంగతి తెలిసిందే. మంత్రివర్గం నుంచి తొలగింపు, వైవి సుబ్బారెడ్డి తో ఉన్న విభేదాలు, గతం కంటే తగ్గిన ప్రాధాన్యం తదితర కారణాలతో బాలినేని శ్రీనివాసరావు ఇంటికి పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా ఉన్నారు . ఒకానొక తరుణంలో ఆయన పార్టీని వీడుతారని ప్రచారం సాగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. ఈ తరుణంలో ఎంపీ విజయసాయిరెడ్డి చర్చలు జరపడం విశేషం.
2019 ఎన్నికల్లో గెలిచిన బాలినేని కి తొలి మంత్రివర్గంలో జగన్ స్థానం ఇచ్చారు. కీలక పోర్ట్ పోలియో కల్పించారు. కానీ మంత్రివర్గ విస్తరణలో బాలినేని ని తొలగించారు. అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ కు మాత్రం కొనసాగింపు లభించింది. తనను తొలగించవద్దని బాలినేని జగన్కు విజ్ఞప్తి చేసుకున్నా పరిగణలో తీసుకోలేదు. అయితే తన తొలగింపు వెనుక వైవి సుబ్బారెడ్డి ఉన్నారని బాలినేనికి అనుమానం. జిల్లాలో తనకు చెక్ చెప్పేందుకు వైవి సుబ్బారెడ్డి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారన్నది బాలినేని అభియోగం. దీనిపై పలుమార్లు హై కమాండ్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సమన్వయకర్త పదవిని వదులుకున్నారు. అప్పట్నుంచి ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది. బాలినేనిని బుజ్జగించిన ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో విజయసాయిరెడ్డిని ఆ పదవిలో కూర్చోబెట్టడానికి జగన్ డిసైడ్ అయ్యారు.
అయితే ఆ పదవి ని స్వీకరించడానికి విజయ్ సాయి రెడ్డి ఆసక్తి చూపడం లేదు. వై వి సుబ్బారెడ్డి తో వ్యవహారం ఎలా ఉంటుందో ఉత్తరాంధ్రలో విజయ్ సాయి రెడ్డి చూశారు. అందుకే ఆ మూడు జిల్లాల పదవిని తీసుకునేందుకు మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో బాలినేని ఒప్పించడానికి విజయ్ సాయి రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే పార్టీ హై కమాండ్ దూతగా కాకుండా తాను వ్యక్తిగతంగానే కలిసినట్టు తెలుస్తోంది. ఇకనుంచి వైవి మీ జోలికి రారని.. ఆయన ఉత్తరాంధ్ర కే పరిమితం అవుతారని చెప్పినట్టు సమాచారం. దీంతో బాలినేని పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
ఈ మొత్తం ఎపిసోడ్లో బాలినేనికి హై కమాండ్ కి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. బాలినేని వేరే పార్టీలో చేరుతారని ప్రచారం కూడా సాగింది.హై కమాండ్ సైతం బాలినేని అనుమానం చూపులు చూసింది. ఈ తరుణంలో వెనక్కి తగ్గితే మరింత అణచివేస్తారని అనుచరులు వారిస్తున్నారు. అందుకే బాలినేని ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బాలినేని భావిస్తున్నట్టు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.