Ponguleti Srinivasa Reddy- BJP: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలోకి చేరబోతున్నారని కొద్ది రోజుల నుంచి చెప్పుకుంటున్నాం కదా… ఇవాళ దానిని మరింత నిజం చేసే పరిణామం జరిగింది..మొన్న జనవరి 1 నాడు అధిష్టానం పై నిరసనగళం వినిపించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి కారణమయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాస్ రెడ్డికి భద్రతను తగ్గించింది. దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు పొంగులేటికి గ్యాప్ మరింత పెరిగింది. దీంతో కమలం రంగంలోకి దిగింది. పొంగులేటి ని లైన్ లోకి తెచ్చుకుంది.

అమిత్ షా ఫోన్
అయితే ఈ పరిణామం తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారని వినికిడి.. ఈ క్రమంలో పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించారని తెలుస్తోంది.. సంక్రాంతి తర్వాత తన అనుచరులతో పార్టీలో చేరుతానని శ్రీనివాస్ రెడ్డి అమిత్ షాకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేంద్రం భద్రతను కల్పించింది.. ఈ పరిణామంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.
అనుచరులకు టికెట్లు
అయితే పొంగులేటి ఖమ్మం లేదా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.. అదే విధంగా తన అనుచరులు పాయం వెంకటేశ్వర్లు, మట్టా దయానంద్ విజయకుమార్, కోరం కనకయ్య కు పినపాక, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఇవ్వాలని కోరగా… అందుకు బిజెపి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు చెబుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలిపించే పూచి తనది అని పొంగులేటి బీజేపీ పెద్దలకు హామీ ఇచ్చినట్టు సమాచారం. పొంగులేటి రాకను బిజెపి జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, ఇతర నాయకులు స్వాగతిస్తున్నారు. ఇదే క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాకను ఆయన పెదనాన్న కుమారుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు.. ఏనాడు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని పొంగులేటి సుధాకర్ రెడ్డి మాటను బిజెపి అధిష్టానం పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు..

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మారతాయి
పొంగులేటి రాకతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. ముఖ్యంగా ఇది భారత రాష్ట్ర సమితి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.. పాయం వెంకటేశ్వర్లు, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, మువ్వ విజయబాబు, మట్టా దయానంద్ విజయ్ కుమార్, మార్క్ ఫెడ్ స్టేట్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ పలువురు బిజెపిలో చేరే అవకాశం ఉంది. దీనివల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిజెపి మరింత బలోపేతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.