Telangana Congress: తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం అధికార బీఆర్‌ఎస్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటుండగా, విపక్ష కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఆధిపత్య కోసం ప్రయత్నిస్తున్నాయి. అధికార పార్టీని ఓడించేందుకు పోటీ పడాల్సిన విపక్షాలు.. బీఆర్‌ఎస్‌ను ఓడించేంది తామంటే తామని కొట్టుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ మేమేనని మొన్నటి వరకు బలంగా చెప్పిన బీజేపీ తాజా రాజకీయ పరిణామాలతో డైలమాలో పడుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అని భావించిన వేళ తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల రాజకీయం రివర్స్ అయ్యింది.
ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు..
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు కొనసాగిన సమయంలో దుబ్బాక, హుజురాబాద్‌లో బీజేపీ గెలిచింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటింది. మొన్నటి వరకు అదే దూకుడును కొనసాగించింది. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగిందని అందరూ భావించారు. అయితే తాజా పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న అంతర్గత పోరు, రాష్ట్ర అధ్యక్షుడు మార్పు అంశం, పలువురు బీజేపీ ముఖ్య నాయకుడు పార్టీని వీడుతారని జరుగుతున్న ప్రచారం వెరసి బీజేపీ మూడేళ్లు కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ మసకబారుతోంది.
స్పీడ్ పెంచిన కాంగ్రెస్..
ఇక తెలంగాణలో ఏం చేసినా మళ్లీ పైకి వచ్చే అవకాశమే లేదని భావించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో స్పీడ్ పెంచింది. అనూహ్య రీతిలో పుంజుకుంటోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు బూస్ట్ ఇచ్చాయి. తాజాగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ బాట పట్టడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. తెలంగాణలో ఉనికే లేదని భావించిన కాంగ్రెస్ వరుస చేరికలతో జవసత్వాలను నింపుకుంటోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ పర్యటనలు, రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న సభలు సైతం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకునేలా తాజా పరిణామాలు మారాయి.
కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న బీఆర్‌ఎస్
తాజా పరిణామాలతో ఇన్నాళ్లూ బీజేపీపై విమర్శలు చేసిన అధికార బీఆఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన అంటే ఎలా ఉంటుందో ప్రజలకు వివరిస్తున్నారు. రూ.200 పింఛన్ అయితది అని భయపెడుతున్నారు. ఇన్నేళ్లు ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో తలకిందులుగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పార్టీల పరిస్థితులలో కూడా మార్పు వస్తుంది. తాజా పరిణామాలతో బీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయం ఎవరన్న ఆసక్తికర చర్చ తెలంగాణలో జరుగుతోంది.