ప్రభుత్వాలు తమ పనితీరు డొల్లగా మారినప్పుడు.. జనం దృష్టిని మళ్లించేందుకు ఇతరత్రా జిమ్మిక్కులు చేస్తుంటాయి. కాదేది దీనికి అనర్హం అన్నట్టుగా.. అవకాశం ఉన్న ప్రతిదాన్నీ వాడేస్తుంటాయి. ఇప్పుడు క్రీడలను వాడేస్తున్నాయి. తాజాగా.. ఒలింపిక్ పతకాలను తెచ్చిన వారిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నట్టుగా మీడియాలో ఫోకస్ అయ్యేందుకు కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అదేంటీ.. పతకం తెచ్చిన వారిని అభినందించడం తప్పా? అనే సందేహం రావొచ్చు. అది తప్పు కాదు.. ఆ పేరుతో రాజకీయం చేయడపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
40 కోట్ల జనాభాలేని అమెరికా టోక్యో ఒలింపిక్స్ లో అగ్రస్థానంలో నిలిచింది. 39 స్వర్ణాలతో 113 పతకాలు సాధించింది. జనాభాలో మనకన్నా ఒకమెట్టు పైన ఉన్న పొరుగు దేశం చైనా రెండో స్థానంలో నిలిచింది. 38 స్వర్ణాలతో 88 పతకాలు కొల్లగొట్టింది. మరి, దాదాపు 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ మోసుకొచ్చిన పతకాలెన్ని? ఒక్క స్వర్ణంతో కలిపి మొత్తం ఏడు! మనలో మూడోవంతు జనాభా ఉన్న దేశం అగ్రస్థానం సాధిస్తే.. మనకన్నా ఎక్కువున్న దేశం రెండో స్థానంలో నిలిచింది. మరి, ఇప్పుడు మన దేశ పాలకులు చేయాల్సింది ఏమిటి?
ఎక్కడ లోపం జరుగుతున్నదని కదా విశ్లేషించుకోవాల్సింది? క్రీడాకారులకు సరైన వసతులు కల్పించడంలో కదా దృష్టి పెట్టాల్సింది? నాణ్యమైన ఆట వస్తువులు అందించడంలో.. వారికి మైదానాలు ఏర్పాటు చేయడంలో కదా.. పోటీ పడాల్సింది? బడ్జెట్లో మరిన్ని నిధులు వెచ్చించడానికి కదా.. కృషి చేయాల్సింది? ఇవన్నీ.. చేయకుండా అభినందిస్తున్నామనే పేరుతో శాలువా కప్పి, ఫొటోలకు ఫోజులిస్తే సరిపోతుందా? అన్నది ప్రధానంగా ఎదురవుతున్న విమర్శ.
అంతేకాదు.. ఈ అభినందనలు తెలపడంలోనూ అసమానతలు వేలెత్తి చూపిస్తున్నాయి. దేశానికి మొట్ట మొదటి మెడల్ అందించిన మీరాబాయి చానూ దేశానికి తిరిగి వచ్చినప్పుడు స్వాగతం చెప్పడానికి రాజకీయ నేతలెవరూ ముందుకు రాలేదు. కేవలం వెయిట్ లిఫ్టింగ్ అఫీషియల్స్ మాత్రమే వెల్కమ్ చెప్పారు. కానీ.. సింధు వచ్చినప్పుడు మాత్రం రాజకీయ నేతలు ఎయిర్ పోర్టులో ఎదురేగి స్వాగతాలు పలికారు. ప్రధానితోనూ అపాయింట్ మెంట్ ఇప్పించారు. ఇందులో మరో విషయం ఏమంటే.. మీరాబాయి చానూ సాధించింది మొదటి పతకమే కాదు.. సిల్వర్ మెడల్. సింధు సాధించింది మాత్రం కాంస్యం. మరి, సింధుకు ఇచ్చినంత ప్రయారిటీ చానూకు ఇవ్వకపోవడం ఆమె స్థైర్యాన్ని దెబ్బతీయదా? ఇతర క్రీడాకారులు ఈ సంఘటనను ఎలా స్వీకరిస్తారు? అన్నది కూడా చర్చనీయాంశమైంది.
ఇక, ఇదే సందర్భాన్ని వేదిక చేసుకున్న కేంద్రం.. దేశ అత్యున్నత క్రీడా అవార్డు రాజీవ్ ఖేల్ రత్నకు పేరు మార్చేసింది. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పేరు పెట్టింది. ధ్యాన్ చంద్ పేరు విషయంలో ఎవరూ అభ్యంతరం చేయలేదుగానీ.. కేవలం కాంగ్రెస్ నాయకుడన్న కారణంగానే రాజీవ్ పేరు తొలగించిందనే అభిప్రాయం వ్యక్తమైంది. క్రీడా అవార్డుకు రాజకీయ నాయకుడి పేరు అవసరం లేదని అనుకున్నప్పుడు.. మరి, గుజరాత్ లోని ఇదే ప్రధానమంత్రి పేరు ఎలా పెట్టారు? అరుణ్ జైట్లీ పేరు ఎలా ఉంచారు? అనే ప్రశ్న తలెత్తక మానదు.
ఇలాంటివన్నీ చూసినప్పుడు.. క్రీడలకోసం ఏం చేయాలో అది చేయకుండా.. ఆ పేరుతో తమ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి ఉంటే.. పైన చెప్పుకున్న సౌకర్యాలన్నీ కల్పించాలి. అప్పుడే.. విశ్వక్రీడల్లో పతకాలు వరుస కడతాయి.. మువ్వన్నెల పతాకాలు రెప రెపలాడుతాయి.