Political War TDP Vs YSRCP: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉంది. అయినా అధికార, విపక్షాలు వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ, అదికారంలోకి రావాలని టీడీపీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. సంక్షేమ పాలనను అందించిన విషయాన్ని గుర్తుచేస్తూ అధికార పక్షం, ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ఎత్తిచూపుతూ విపక్షం ప్రజల బాట పట్టాయి. తొలుత జగన్ సర్కారు పన్నుల మోత, పాలనా వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంక్షేమ పథకాలు, చేసిన పనులను ప్రజలకు చెప్పుకునేందుకు తాజాగా అధికార వైసీపీ ‘గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో ఇరు పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి. రేపో..మాపో ఎన్నికలు అనే విధంగా కాక రేపుతున్నాయి. ఇరు పార్టీల శ్రేణుల దూకుడుతో బాదుడే బాదుడు వర్సెస్ గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం అన్నట్టు వార్ మారిపోయింది. ఇరు పార్టీలు కార్యక్రమాలను సవాల్ గా తీసుకున్నాయి. 2024 గెలుపునకు ఇవి దోహదం చేస్తాయని భావిస్తున్నాయి.

నాటి జగన్ మాటే..బాదుడే బాదుడు
జగన్ విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, పన్నులు, చార్జీల పెంపును నిరసిస్తూ తరచూ ‘బాదుడే బాదుడు’ అని వ్యాఖ్యానించే వారు. ప్రతీ సమావేశంలో ఇదే మాట అనే వారు. దేవుడు దయతలచి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాదుడును తగ్గిస్తానని కూడా చెప్పుకొచ్చేవారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత పన్నులు, చార్జీల పెంపు తప్పలేదు. ఆస్తిపన్ను, చెత్తపన్ను, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు ఇలా వరుసగా పెంచేసిన ఛార్జీలు, పన్నులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీన్ని గమనించిన విపక్ష టీడీపీ వెంటనే సీఎం జగన్ నోటీ నుంచి వచ్చిన ‘బాదుడే బాదుడు’ వ్యాఖ్యను గుర్తుచేస్తూ కార్యక్రమాన్ని రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని పక్కగా అమలు చేస్తోంది. . ఎక్కడికక్కడ టీడీపీ నేతల్ని రంగంలోకి దించి వైసీపీ ప్రభుత్వం బాదుడుని జనానికి వివరించే ప్రయత్నం చేస్తోంది. దీంతో జనంలో ఆదరణ కూడా దక్కుతోంది. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ఓ చేత్తో పంచుతున్న డబ్బును మరోవైపు ఎలా లాక్కుంటుందో టీడీపీ వివరిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇంటింటా కరపత్రాలు పంచుతూ.. పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో టీడీపీకి ఆదరణ తగ్గలేదని అధికార పక్షానికి తెలుగు తమ్ముళ్లు సవాల్ విసురతున్నారు.
Also Read: TTD JEO Dharma Reddy:టీటీడీ జేఈవో ధర్మారెడ్డి కోసం వైసీపీ సర్కారు ఆరాటం.. అందాకా వెళ్లిందా?
చేసింది చెప్పుకునేందుకు..
టీడీపీ చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా అధికార పక్షం తొలుత ‘గడపగడపకూ వైసీపీ’ కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. కానీ యంత్రాంగం లేకపోతే ప్రజలు ఎవరూ చేరని భావించి ‘గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం’గా మార్చింది. ఇన్నాళ్లూ చేపట్టిన సంక్షేమాన్ని జనంలోకి తీసుకెళ్లి మరోసారి ఓట్లు అడగాలని నిర్ణయించుకుంది. గతంలో నవరత్నాల్ని తీసుకెళ్లి గడప గడపలోఓట్లు అడిగిన వైసీపీ.. ఈసారి సంక్షేమం అమలును చూపించి జనంలో ఓట్లు అడగాలని నిర్ణయించుకుంది. దీంతో వైసీపీ గడప గడపకూ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయగలిగితే చాలు వైసీపీ 2024 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. అయితే కార్యక్రమానికి నిరసనల సెగ తగులుతుండడం అధికార పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్ని గడపలకూ చేరకపోవడమే. ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వంలోనూ దాదాపు సగానికి పైగా జనాభాకు సంక్షేమం చేరడం కల్లే. అయితే ఈసారి వైసీపీ సర్కార్ మాత్రం అర్హులైన వారిని వెతికి మరీ పథకాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్న తరుణంలో జనంలో ఆశలు పెరుగుతున్నాయి. ప్రజలు ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టడం లేదని.. కేవలం పథకాలు మాత్రమే అందడం లేదని చెబుతున్నారని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
జనంతో ఉండేవారికి చాన్ష్
ఎన్నికలకు పట్టుమని రెండు సంవత్సరాలు కూడా లేవు. చివరి సంవత్సరం అంతా ఎన్నికల ఫీవరే ఉంటుంది. అందుకే ఈ రెండేళ్లు ప్రజలతోనే ఉన్న వారే అధికారంలోకి రాగలని అటు అధికార, ఇటు విపక్ష నేతలు భావిస్తున్నారు. 2019లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం వెనుక జగన్ జనంలో నిరంతరం ఉండటమే కారణం. ఇప్పుడు మరోసారి 2024లో అధికారం కావాలంటే గడప గడపకూ ప్రభుత్వం రూపంలో జనంలో ఉండాలని జగన్ తన నేతలకు సూచిస్తున్నారు. తాను చివర్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇప్పుడు అదే మంత్రాన్ని ఒడిసి పట్టుకుని బాదుడే బాదుడు పేరుతో జనంలోకి వెళ్లేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సహజంగానే ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత, ఛార్జీల పెంపు బాధతో ఉన్న ప్రజల్లో టీడీపీ నేతలకు బాగానే ఆదరణ లభిస్తోంది. అయితే దీన్ని ఎన్నికల వరకూ కొనసాగించగలిగితే ఆ పార్టీకి అధికారం దక్కే అవకాశముంది. అలాగే దీనికి వైసీపీ నుంచి సరైన కౌంటర్ ఇవ్వగలిగితే మాత్రం జగన్ కూడా అదే స్థాయిలో చాన్స్ ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Also Read: Mahesh Babu Hard work: మహేష్ కష్టమంతా వృధా.. ఇది ఫ్యాన్స్ కి వ్యథే !