Sunil Kanugolu: దేశంలో బీజేపీ హవా సాగిస్తున్న సమయంలో కర్ణాటక ఫలితాలు కమలానికి షాక్ ఇచ్చాయి. దక్షిణాదిలో ఒకే ఒక్క రాష్ట్రం ఉందని చెప్పుకునే స్థాయి లేకుండా చేశాయి. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పెద్ద కసరత్తే జరిగింది. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారు. వీటికి తోడు రాహుల్ గాంధీ జోడోయాత్ర, ప్రముఖ నేతలు పర్యటనలు ప్లస్ పాయింట్ గా మారాయి. అయితే ఈ గెలుపులో మరో వ్యక్తి పేరు కీలకంగా వినిపిస్తోంది. ఆయన వేసిన వ్యూహరచనలే కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు మార్గం చూపాయని అంటున్నారు. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించేందుకు ఆయన జాతీయ వ్యూహకర్తగా మారారట. ఇంతకీ ఆయన ఎవరంటే?
సునీల్ కానుగోలు.. ఈయన పేరుగానీ.. ఫొటో గానీ.. ఎక్కడా ఇదివరకు కనిపించలేదు. అయితే అంతకుముందు బీజేపీ కోసం పనిచేసన ఆయన గతేడాది కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారు. రోజుకు 20 గంటలు వారానికి 7 రోజులు పనిచేసి వ్యూహం రచించారు. ఏ యే నియోజకవర్గాల్లో ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి? ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేయాలి? అనే విషయాలపై పక్కగా ప్లాన్ వేసేవారు.
కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై కు దగ్గరి వ్యక్తి అయినా కాంగ్రెస్ పై ఉన్న అభిమానంతో ఆయన హస్తం పార్టీలోనే కొనసాగారు. ఆయన పార్టీలో చేరే నాటికి కాంగ్రెస్ వర్గపోరుతో సతమతమవుతోంది. సునీల్ చేసిన సంప్రదింపులతో సిద్ధ రామయ్య, డీకే ఒక్కటయ్యారు. కలిసి పనిచేసేలా సునీల్ ప్లాన్ చేశారు. రాహుల్ జోడో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ముగిసే వరకు ఆయనతోనే ఉండేవారు. ఆయన యాత్రలో జరిగిన కార్యక్రమాల బాధ్యత అంతా సునీల్ దేనని చెప్పుకుంటున్నారు.
సులీన్ వేసిన స్కెచ్ లతో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఆయన వచ్చే తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లోనూ పనిచేయనున్నారు. ఇప్పటికే ఆయన పలు వ్యూహాలను రచించిపెట్టినట్లు తెలుస్తోంది. కనీసం మరో రెండు రాష్ట్రాల్లోనైనా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో సునీల్ పేరు మీడియా వ్యాప్తంగా మారుమోగుతోంది.