
AP Political Survey 2023: సర్వే ఏజెన్సీలు, సంస్థలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా సర్వే చేస్తున్న రోజులివి. అటువంటిది రాజకీయ పార్టీలే నేరుగా సర్వేలు చేసుకుంటే మరెంత అనుకూలంగా ప్రకటించుకుంటాయో చెప్పనక్లర్లేదు. ఆంధ్రా అక్టోపస్ గా పేరుపొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తొలినాళ్లలో చేసిన సర్వేలు అంచనాకు దగ్గరగా ఉండేవి. అయితే 2018లో తెలంగాణలో మహా కూటమి, 2019లో టీడీపీ అధికారంలోకి వస్తుందని తన సర్వే ద్వారా వెల్లడించారు. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. రాజగోపాల్ సర్వే క్రెడిబిలిటీ పూర్తిగా పడిపోయింది. దీంతో సర్వేలు చేయనని రాజగోపాల్ మీడియా ముందు ప్రకటించి ఇప్పటివరకూ వాటి జోలికి వెళ్లలేదు. అయితే ఇటీవల ఏపీలో ఈ సర్వే లెక్కలను పార్టీలు మైండ్ గేమ్ గా వాడుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి.
మొన్నఆ మధ్యన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఒక సర్వే హల్ చల్ చేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 135 సీట్లు వచ్చే చాన్స్ ఉందన్నది ఈ సర్వే సారాంశం. అటు జనసేనతో కలిసి పోటీచేస్తే 150 సీట్ల వరకూ దక్కే చాన్స్ ఉందని.. వైసీపీకి 20 స్థానాలకే పరిమితం కాబోతుందన్నది సర్వే వెల్లడించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఇది ప్రశాంత్ కిశోర్ టీమ్ వైసీపీ గురించి చేసిన సర్వేనంటూ టాక్ నడిచింది. అటు ఆంధ్రజ్యోతిలో పీకే టీమ్ సర్వే అంటూ కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో జగన్ హడలెత్తిపోతున్నారంటూ ప్రచారం చేశారు. అయితే వైసీపీ కోసం పీకే టీమ్ పనిచేస్తుంది గనుక సర్వే చేయడంలో తప్పులేదు. అయితే సర్వే వివరాలను సాక్షికో…లేకుంటే అనుకూల మీడియాకు ఇస్తారు తప్ప.. ఆంధ్రజ్యోతికి ఇవ్వరు కదా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
ఇక్కడ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు జగన్, ఇటు పవన్ టార్గెట్ గా ఎల్లో మీడియా ఎన్నిరకాలుగా ప్రచారం చేయ్యాలో చేస్తోంది. వైసీపీని పూర్తిగా డిఫెన్స్ లో పెట్టడంతో పాటు పవన్ బలాన్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నాలు చేయాలన్నది ఎల్లో మీడియా టార్గెట్. అందుకు అనుగుణంగా జగన్ గ్రాఫ్ అమాంతం పడిపోతోందని.. తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందని చూపెట్టడానికి తెగ ఆరాటపడుతోంది. అదే సమయంలో పవన్ కలిసి రాకపోయినా టీడీపీకి పర్వాలేదని.. మ్యాజిక్ మార్కు దాటి భారీ మెజార్టీ వైపు దూసుకుపోతోందని నమ్మించడానికి ఈ కొత్తగా సర్వేల పేరిట హడావుడి చేస్తున్నారు. తమ మాటను ప్రత్యర్థి నోట నుంచి వచ్చిందంటూ పీకే టీమ్ సర్వేనంటూ ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు.

అయితే దీనికి విరుగుడుగా వైసీపీ కూడా కొత్త ప్రచారానికి తెరలేపింది. టీడీపీ బలం అమాంతం పడిపోతోందని సోషల్ మీడియాలో సర్వేల పేరిట హడావుడి చేస్తోంది. 2022 అక్టోబరు నాటికి 33 శాతం ఉన్న టీడీపీ బలం.. ఫిబ్రవరి వచ్చేనాటికి 29 శాతానికి పడిపోయిందంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఇది కేవలం మైండ్ గేమ్ గా విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ చేసిన ప్రచారానికి విరుగుడుగా పడిపోతున్న ఓటు షేర్ ను తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు. మొత్తానికైతే సర్వేల క్రెడిబులిటీని దిగజార్చే విధంగా ఏపీలో రాజకీయ పార్టీలు సరికొత్త క్రీడను ప్రారంభించాయి. ఎన్నికల మున్ముందు ఇలాంటి చిత్రవిచిత్రాలు ఎన్నో చూడాలి మరీ.