Bandi Sanjay: బదిలీల కోసం ఉద్యోగులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. దీనిని సంబంధించి ప్రభుత్వం ఇటీవలే 317 జీవోను రిలీస్ చేసింది. కానీ ఈ జీవోలోని అంశాలు అందరికీ న్యాయం చేసేలా లేకపోవడంతో ఈ జోవో ఉద్యోగులకు నచ్చలేదు. దీంతో ఈ అంశం రాజకీయ రూపాన్ని సంతరించుకుంది. ఈ విషయంలో ఉద్యోగులకు అండగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్‌లో ఈ నెల 2న దీక్ష చేపట్టారు.

ఈ దీక్ష ఎలాగైనా జరగకూడదనే ఉద్దేశంలో పోలీసులు అందుకు అనుమతినివ్వలేదు. అందరూ ఇది రాజకీయ దీక్షేనంటూ అనుకున్నారు. కానీ, పోలీసులు మాత్రం దీనిని శాంతిభద్రతల సమస్యగా మార్చివేశారు. రాత్రి పది గంటలకు పోలీసులు కరీంనగర్ లోని ఎంపీ ఆఫీసు వద్దకు చేరుకుని హంగామా సృష్టించారు. ఇందులో సీపీ సత్యనారాయణ సైతం లాఠీచార్జ్ చేశారు.
Also Read: స్టార్ హీరో పైత్యం.. ఇక కోటి ఇవ్వడం ఎందుకు దండగ !
దీక్ష కోసం బండి సంజయ్ తన పార్టీ ఆఫీస్‌కు రాకుండా చేసేందుకు పోలీసులు ముందు నుంచే అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన పోలీసుల కళ్లుగప్పి బైక్ పై పార్టీ ఆఫీస్ కు చేరుకుని లోపలి నుంచి గడీ పెట్టుకున్నారు. దీంతో పోలీసులు రాత్రి సమయంలో అక్కడికి చేరుకుని స్పింకర్లతో పార్టీ ఆఫీస్ లోపలికి నీటిని కొట్టారు. తలుపులను పగులగొట్టి ఎంపీ బండి సంజయ్ ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వాస్తవం చెప్పాలంటే పోలీసుల నిర్బంధాలే బీజేపీ నేతలు రెచ్చిపోవడానికి కారణమయ్యాయి.
ఒమిక్రాన్ నిబంధనల పేరుతో సభకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరిస్తూ వచ్చారు. దీంతో బీజేపీ నేతలు పట్టువిడవకుండా దీక్ష నిర్వహించి తీరాలని నిర్ణయించుకున్నారు. మరో వైపు టీఆర్ఎస్ లీడర్లకు వర్తించని రూల్స్ తమకెందుకని విపక్షాలు సైతం విమర్శలకు దిగుతున్నాయి. ఎప్పడైనా ఎవరైనా దీక్ష చేస్తే.. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేస్తారు. ఇది కామనే. కానీ ఇక్కడ దీక్ష నిర్వహించకుండా పోలీసులు పట్టుదలకు పోయారు. ఫలితంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తిరిగి వీటిని అదుపులోకి తీసుకొచ్చేందుకే లాఠీఛార్జి చేశామనేది పోలీసుల వాదన.