https://oktelugu.com/

శ్రీ కాళహస్తిలో అలజడి రేపుతున్న కరోనా

స్వర్ణముఖి నదీతీరంలో నెలకొన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నేడు కరోనా వైరస్ తో తీవ్రమైన అలజడికి గురవుతున్నది. తొలి రోజులలో అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల అహంకార ధోరణి కారణంగా వైరస్ అదుపు తప్పింది. కరోనా కట్టడి విధులలో ఉన్న 17 మందికి కూడా ఈ వైరస్ సోకడంతో ప్రభుత్వ విధులు అంటేనే భయపడుతున్నారు. కేవలం 85 వేల జనాభా గల ప్రశాంతతకు పేరొందిన ఈ పట్టణం నుండి చుట్టుపక్కల మండలాలకు సహితం ఈ వైరస్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 25, 2020 / 11:43 AM IST
    Follow us on

    స్వర్ణముఖి నదీతీరంలో నెలకొన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నేడు కరోనా వైరస్ తో తీవ్రమైన అలజడికి గురవుతున్నది. తొలి రోజులలో అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల అహంకార ధోరణి కారణంగా వైరస్ అదుపు తప్పింది.

    కరోనా కట్టడి విధులలో ఉన్న 17 మందికి కూడా ఈ వైరస్ సోకడంతో ప్రభుత్వ విధులు అంటేనే భయపడుతున్నారు. కేవలం 85 వేల జనాభా గల ప్రశాంతతకు పేరొందిన ఈ పట్టణం నుండి చుట్టుపక్కల మండలాలకు సహితం ఈ వైరస్ వ్యాపించింది. దానితో మొత్తం పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటించవలసి వచ్చింది.

    చిత్తూర్ జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ ఇక్కడి నుండే వచ్చింది. ఇప్పుడు జిల్లాలో మొత్తం 73 కేసులు నమోదయ్యాయి, వారిలో మూడింట రెండు వంతులకు పైగా 50 వరకు ఈ చుట్టుప్రక్కలనే ఉన్నాయి.

    మార్చి 12 తర్వాత లండన్ నుండి వచ్చిన వారు, తర్వాత ఢిల్లీలోని తబ్లిఘి జమాత్ సదస్సు నుండి వచ్చిన వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారి నుండే ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందింది. వచ్చిన వారు నిర్లక్ష్యంగా పట్టణంలో తిరిగినా వారికి మాత్రం వైద్యం చేసి, వారి కుటుంబ సభ్యులకు, వారితో తిరిగిన వారిని పరీక్షించకుండా అశ్రద్ధ చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది.

    మొదటగా, మార్చి 18న లండన్ నుండి వచ్చిన ఒక యువకుడు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా, వైరస్ సోకున్నట్లు 25న నిర్ధారణ అయింది. అతను అప్పటి వరకు కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో గడపడమే కాకుండా, ఉరి బైట ఉన్న డాబాల వద్దకు స్నేహితులతో కలిసి వెళ్ళాడు.

    ఆ యువకుడిని, కుటుంబసభ్యులను మాత్రమే క్వారంటైన్‌కు తరలించిన అధికారులు, అతడి ఇంటికి రాకపోకలు సాగించిన ఇరుగుపొరుగువారిని, స్నేహితులను విస్మరించారు. దానితో నెల తర్వాత అతడి ఇరుగుపొరుగున ఉన్న నలుగురికి, అతని స్నేహితుడొకరికి పాజిటివ్‌ అని తేలింది.

    ఇక శ్రీకాళహస్తి నుంచి ఢిల్లీ మర్కజ్‌ జమాత్‌ సమావేశాలకు వెళ్లిన 13 మందిలో మార్చి 17న ఆరుగురు, 18న ముగ్గురు విమానంలో తిరుపతికి వచ్చి శ్రీకాళహస్తి చేరుకున్నారు. 19న నలుగురు రైలులో గూడూరు మీదుగా శ్రీకాళహస్తి చేరుకున్నారు.

    కేంద్ర నిఘా విభాగం మార్చి 29న హెచ్చరించే దాకా వీరిని జిల్లా యంత్రాంగం గుర్తించలేదు. అప్పుడు హడావిడిగా 30,31 తేదీలలో వీరినీ, కొంతమంది బంధువులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు.

    అయితే రిజర్వేషన్‌ లేకుండా ఢిల్లీ నుంచి వచ్చిన వారి గురించిన సమాచారం లేకపోవడంతో వారు పట్టణంలో ఇళ్లలోనే గడిపేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన ఒక వ్యక్తినీ, అతని భార్యను క్వారంటైన్‌కు తరలించిన అధికారులు వీరి ఇద్దరు కుమారులను పట్టించుకోలేదు.

    ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో వ్యక్తి కుటుంబాన్ని క్వారంటైన్‌ చేసిన అధికారులు అతడి అన్న కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదు. వారు ఇంట్లోనే ఉంటూ సాధారణ జీవితం గడిపారు. ఈ నెల 21న అతడి అన్నకు, అన్న కుమార్తెకు వైరస్‌ సోకినట్టు తేలింది.

    మరో ‘ఢిల్లీ వ్యక్తి’ పొరుగింట్లో ఉన్న మహిళకు కూడా అదే తేదీన పాజిటివ్‌గా తేలింది. ఇంకో ఢిల్లీ వ్యక్తి ఇంట్లోనే అద్దెకున్న ప్రభుత్వాస్పత్రి మహిళా ఉద్యోగి ఒకరు వైరస్‌ బారిపడినట్లు ఈ నెల 23న వెల్లడైంది. మొత్తం మీద నిర్లక్ష్యంపై శ్రీ కాళహస్తి ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.