Telangana Congress: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా మారుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా కనిపిస్తోంది. దేశంలో నానాటికి పరిస్థితి దిగజారిపోతోంది. ఒక హిమాచల్ ప్రదేశ్ లో విజయం సాధించినా మిగతా చోట్ల పార్టీ మనుగడ కష్టంగానే ఉంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. సీనియర్లు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ మునిగిపోతున్న నౌకలా తయారయింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలతోనే సతమతమవుతున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయంపై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేయడం సంచలనం కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేకపోయినా అనవసర సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించినట్లు వాదనలు వస్తున్నాయి.

ప్రతి పార్టీకి వ్యూహరచన విభాగం (వార్ రూం) ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్, మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర హెడ్ ఆఫీస్ ఉంది. మంగళవారం రాత్రి సైబర్ క్రైం పోలీసులు అకస్మాత్తుగా వెళ్లి సోదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారనే నెపంతో సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు సీజ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఎలాంటి ఆధారాలు లేకపోయినా పోలీసులు అత్యుత్సాహం చూపారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని ప్రాంతాల్లో నిరసనలు తెలపాలని సూచించింది. ప్రభుత్వ తీరు సమంజసంగా లేదని చెబుతున్నారు. ఏదైనా ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షాల విధి మాత్రమే. దానికి దాడులు చేయడం తగదని హితవు పలుకుతున్నారు. కాంగ్రెస్ వార్ రూం నుంచి ఎలాంటి అసత్య ప్రచారాలు లేకపోయినా సైబర్ క్రైమ్ పోలీసులు దాడులకు పాల్పడటం అనుమానాలకు తావిస్తోంది.

కంప్యూటర్, ల్యాప్ టాప్ లు సీజ్ చేయడంతో కాంగ్రెస్ కు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అందులో ఉండే సమాచారం పోలీసుల వద్దకు చేరే ప్రమాదం ఉంది. ప్రతి పార్టీ తమ వ్యూహాలను అమలు చేసేందుకు ఏవో మార్గాలు అన్వేషిస్తుంటుంది. దీంతో ఇప్పుడు సైబర్ క్రైం పోలీసుల తీరుతో కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి బీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుకు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దురుద్దేశంతోనే పార్టీ సామగ్రిని తీసుకెళ్లిందని నిరసన తెలుపుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ మేరకు స్పందిస్తూ బీఆర్ఎస్ తీరును తప్పుబట్టారు.