Hyderabad: తలసరి ఆదాయంలో గ్రేటర్ హైదరాబాద్ దేశ ఐటీ రాజధాని బెంగళూరును దాటేసింది.. ఇప్పటికే పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానానికి చేరుకుంది. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లా బెంగళూరు ను మించింపోయింది. ఈ క్రమంలో పలు అంతర్జాతీయ సంస్థలు కొన్ని వేల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ నగరానికి తరలివస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహానగరం ఉపాధి కేంద్రంగా మారుతున్నది. అంతేకాదు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ప్రజల తలసరి ఆదాయంలో భారీగా అభివృద్ధి నమోదు అవుతున్నది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా దేశ ఐటీ రాజధానిని మించిపోవడం గమనార్హం.. దీంతో కొన్ని ప్రధాన నగరాల కన్నా దేశంలో హైదరాబాద్ గ్రేటర్ అని మరొకసారి రుజువు చేసుకుంది.

రంగారెడ్డి టాప్
హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా ప్రజల తలసరి ఆదాయంలో సత్తా చాటింది. 6.25 లక్షల తలసరి ఆదాయంతో టాప్ ప్లేస్ లో నిలిచింది.. ఇప్పటివరకు బెంగళూరు అర్బన్ జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉండేది. అక్కడి జిల్లా తలసరి ఆదాయం 5.42 లక్షలు.. దక్షిణాది రాష్ట్రాల ప్రజల జీవనస్థితిగతులపై ఇండియా. ఇన్. పిక్సెల్స్ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఇక ఈ నివేదిక ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.. 2020_21 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ తలసరి ఆదాయం 2.79 లక్షలు. ఇదే సమయంలో జాతీయ సగటు 1.27 లక్షలు
టీఎస్ డి పి ఎస్ నివేదిక ప్రకారం
ఈ నివేదిక ప్రకారం జిల్లాల వారీగా తలసరి ఆదాయం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 6.59 లక్షలు ఉంటే.. కనిష్టంగా వికారాబాద్ జిల్లాలో 1.32 లక్షలు గా ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, పరిసర జిల్లాల పరిధిలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది.. రంగారెడ్డి తర్వాత హైదరాబాద్ జిల్లా 3.51 లక్షలతో రెండవ స్థానంలో ఉన్నది. అయితే తర్వాత స్థానంలో నిలిచిన జిల్లాల్లో హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలోనివే ఎక్కువ.
ముంబాయిని కూడా మించింది
కేవలం బెంగళూరు మాత్రమే కాకుండా రంగారెడ్డి జిల్లా దేశ ఆర్థిక రాజధాని ముంబాయిని కూడా తలసరి ఆదాయంలో అధిగమించింది.. ముంబైలో తలసరి ఆదాయం 6.43 లక్షలు.. కాగా రంగారెడ్డి జిల్లా 6.59 లక్షలతో దాన్ని అధిగమించింది. గుజరాత్ లోని అహ్మదాబాద్, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, కేరళలోని ఎర్నాకులం జిల్లాలను దాటి రంగారెడ్డి జిల్లా దూసుకుపోయింది.

అంతర్జాతీయంగా..
హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకుపోతోంది.. ఎగుమతులు 4 రెట్లు పెరిగాయి. పారిశ్రామికంగా అనేక అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్, మెటా, అమెజాన్, ఆపిల్ వంటి సంస్థలు వేలకోట్ల పెట్టుబడులు హైదరాబాదులో పెట్టాయి. దీంతో ఆఫీస్ స్పేస్ విభాగంలో హైదరాబాద్ ఇతర మెట్రో నగరాలను మించిపోయింది. అంతేకాదు అత్యంత జీవన యోగ్యమైన నగరాలలో హైదరాబాద్ కు వరుసగా ఐదు సార్లు అవార్డులు వచ్చాయి.. కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ ఊపందుకోవడంతో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.