Konaseema Agitation: కోనసీమ జిల్లా పేరు మార్పు చిచ్చుపెట్టింది. నిరసనకారుల ఆందోళనలతో అమలాపురం అట్టుడికింది. ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లా అల్లర్లు, హింసతో వార్తల్లోకెక్కింది. ఇది ప్రభుత్వ వైఫల్యమని ప్రతిపక్ష జనసేన,బీజేపీ, టీడీపీ ఆరోపిస్తుంటే.. ప్రతిపక్షాల కుట్ర అని అధికార వైసీపీ కౌంటర్ ఇస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య ‘కోనసీమ’ మాటల మంటలు అంటుకున్నాయి.

తాజాగా అమలాపురంలో అల్లర్లలో ‘అన్యం సాయి’ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడంటూ సోషల్ మీడియాలో అతడి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అన్యం సాయి గతంలో వైసీపీ మంత్రి విశ్వరూప్ కు ఫ్లెక్సీ కట్టించిన ఫొటో.. అలాగే వైసీపీ కీలక నేత సజ్జలతో సెల్ఫీ దిగిన ఫొటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నాడు. కోనసీమ అల్లర్లలో అన్యం సాయి చొక్క చింపుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతడిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నాడు.
అమలాపురం అల్లర్లకు కీలక సూత్రధారిగా అన్యం సాయిని అభివర్ణిస్తున్నారు. ఇతడు వైసీపీకి చెందిన నేత అని జనసేన,టీడీపీ ఫొటో సాక్ష్యాలతో నిరూపిస్తుండగా.. ఇతడు జనసేనకు చెందిన వ్యక్తి అని స్వయంగా వైసీపీనేత సజ్జల రామకృష్ణరెడ్డి ఆరోపించడం విశేషం. జనసేనకు చెందిన వాడంటూ కొన్ని ఫొటోలను వైసీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురంలోని కలెక్టర్ ఎదుట అన్యం సాయి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరని ఆరాతీస్తే.. అతడు అమలాపురానికి చెందిన వైసీపీ నేత ఒంటెద్దు వెంకటనాయుడికి అనుచరుడిగా చెబుతున్నారు. గతంలో వైసీపీ కార్యక్రమాల్లోనూ అన్యం సాయి పాల్గొన్న ఫొటోలు వైరల్ అయ్యాయి.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత వంటి నేతలతో అన్యం సాయి దిగిన ఫొటోలను జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.అయితే అన్యం సాయి జనసేన కార్యకర్తనే అని వైసీపీ ఆరోపిస్తోంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ‘వైసీపీ-జనసేన’ కార్యకర్తల మధ్య ఇప్పుడు ఇదే విషయంపై వార్ జరుగుతోంది. అన్యంసాయి ఏ పార్టీ? ఎవరి కోసం ఇలా చేశాడన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది.