PM Modi Visakha Tour- Pawan Kalyan: ఏపీలో భిన్న రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పక్షంగా వైసీపీ ఉంది. ప్రధాన విపక్షంగా టీడీపీ కొనసాగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ పాత్రపైనే ఇప్పుడు అందరి దృష్టిపడింది. కేంద్ర పెద్దగా జగన్ సర్కారుతో సఖ్యతగా ఉంది. అటు రాష్ట్రంలో జనసేనతో అధికారికంగా మిత్రపక్షంగా కొనసాగుతోంది. మరోవైపు టీడీపీ తన పాత స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ బీజేపీకి దగ్గర కావాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈ పరిణామ క్రమంలో ప్రధాని మోదీ ఏపీలో అడుగు పెడుతున్నారు. ఈ నెల 11 న విశాఖ వస్తున్నారు. రెండు రోజుల పాటు సాగర నగరంలోనే గడపనున్నారు. అటు అధికారిక ప్రారంభోత్సవాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. పనిలోపనిగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్టీ వర్గాలకు స్పష్టమైన సూచనలు చేయనున్నారు. దీంతో కొన్ని అంశాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. అందుకే ప్రధాని టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఇటీవల జరిగిన పరిణామ క్రమంలో జనసేన, టీడీపీ మధ్య సానుకూల వాతావరణం ఏర్పడిన మాట వాస్తవం. ఎప్పటి నుంచో ఆ రెండు పార్టీల మధ్య స్నేహం కుదిరిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల పవన్ ను చంద్రబాబు కలిశారు. సంఘీభావం ప్రకటించారు. దీంతో అవి ఊహాగానాలు కాదు..తాము ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నవే అంటూ ఆ రెండు పార్టీల కలయికపై వైసీపీ నేతలు కామెంట్స్ మొదలుపెట్టారు. చంద్రబాబు టూర్ లో జనసేన జెండాలు సైతం కనిపిస్తున్నాయి. అయితే అది ప్లాన్ ప్రకారం చేస్తున్నారా? లేదా జనసేన శ్రేణులు నిజంగా పాల్లొంటున్నాయా? అన్నది తెలియడం లేదు. ఇప్పుడు విశాఖకు వస్తున్న ప్రధానికి జన సైనికులు స్వాగతం పలుకుతారా? లేదా? అన్నది కూడా సస్పెన్షే. ఎందుకంటే ఇప్పటికే కార్యక్రమాన్ని హైజాక్ చేసే ప్రయత్నంలో వైసీపీ ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వపరంగా పవన్ కు ఆహ్వానం ఉండదు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి మాత్రం తప్పకుండా వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ పవన్ కు ఆహ్వానం ఉండి.. ఆయన విశాఖ వస్తే మాత్రం జనసేన శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనే అవకాశమైతే ఉంది.
విశాఖలో జనసేనకు మంచి పట్టుంది. గత ఎన్నికల్లో పవన్ గాజువాక నుంచే పోటీచేశారు. కానీ ఓటమి ఎదురైంది. కానీ పవన్ ను అనవసరంగా వదులుకున్నామన్న బాధ మాత్రం ప్రజల్లో ఉంది. ఇది అభిమానంగా మారింది. పవన్ పట్ల ఆదరణ ప్రారంభమైంది. అటు పవన్ సామాజికవర్గం నేతలు కూడా ఇక్కడ అధికం. అందుకే పవన్ కు మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రధాని కార్యక్రమంలో పాల్గొన్నట్టు చేస్తే మాత్రం జనసేన శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొనే అవకాశముంది. అయితే అది కేంద్ర పెద్దల వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ విషయంలో వైసీపీ రాజకీయం వినియోగించి సక్సెస్ అయ్యింది. కానీ నాటి పరిణామాలకు మాత్రం బీజేపీ కార్నర్ అయ్యింది. అందుకే ఈసారి ప్రధాని పర్యటన విషయంలో కేంద్ర పెద్దలు కాస్తా జాగ్రత్త పడినట్టు కనిపిస్తోంది.

పవన్ తో బీజేపీ కలిసుండడం జగన్ కు ఇష్టం లేదు. అలాగని పవన్ వదులుకోలేమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒకటి మాత్రం నిర్థిష్టంగా చెప్పగలం. జనసేన, బీజేపీ మధ్య ఉన్న గ్యాప్ ప్రధాని పర్యటనతో తగ్గుతుందో.. లేక పెరుగుతుందో అన్నది మాత్రం చెప్పలేం. వైసీపీ ట్రాప్ లో పడి బీజేపీ పవన్ ను విస్మరిస్తే మాత్రం అందుకు బీజేపీ మూల్యం చెల్లించుకుంటుంది. కానీ 11న ప్రధాని విశాఖ పర్యటనతో మాత్రం అస్పష్టతపై కొంత క్లారిటీ వచ్చే అవకాశముంది. రాజకీయాల్లో మార్పులకు విశాఖ వేదిక కానుందని మాత్ర రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.