PM Modi : ప్రధాని మోదీ కాన్వాయ్‌ని పంజాబ్‌లో అడ్డుకున్న విషయం తెలిసిందే. 2022 జనవరి 5వ తేదీన జరిగిన ఈ సంఘటన జరిగింది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ కు కొందరు అడ్డుకున్నారు. మోదీ భద్రతలో జరిగిన లోపానికి సంబంధించిన దర్యాప్తులో పంజాబ్ పోలీసులు కొత్త మలుపు తీసుకొచ్చారు. ఈ హై ప్రొఫైల్ కేసులో ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) లోని సెక్షన్ 307 (హత్యాయత్నం) ను చేర్చారు. అప్పుడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఫిరోజ్‌పూర్‌లో నిరసనకారులు తన కాన్వాయ్‌ను ఆపడానికి ప్రయత్నించారు. కేసు దర్యాప్తు నివేదిక ఆధారంగా ఇప్పుడు ఈ కేసులో మొత్తం 24 మంది నిందితుల పేర్లు నమోదు చేశారు.
ఈ సంఘటన జనవరి 5, 2022న జరిగింది. హుస్సేనివాలా సరిహద్దు నుండి 30 కిలోమీటర్ల దూరంలో నిరసనకారుల కారణంగా ప్రధాని మోడీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే నిలిచిపోయింది. ఈ సమయంలో పంజాబ్ ప్రభుత్వం, పోలీసులు భద్రతా ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారని ఆరోపించారు. ఆ పొరపాటు కారణంగా ప్రధానమంత్రి తన షెడ్యూల్ చేసిన కార్యక్రమాలను రద్దు చేసుకుని తిరిగి వెళ్ళవలసి వచ్చింది.
కోర్టులో కొత్త సెక్షన్ వెల్లడి
జిల్లా కోర్టులో నిందితుడి ముందస్తు బెయిల్‌పై విచారణ సందర్భంగా ఐపీసీ సెక్షన్ 307ను చేర్చినట్లు తాజా అప్‌డేట్ వెల్లడించింది. నిందితుడి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కొత్త సెక్షన్ చేరికతో విషయం మరింత తీవ్రమైంది. దర్యాప్తులో వెల్లడైన వాస్తవాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ పోలీసులు చెబుతున్నారు.
రైతు సంఘాల ప్రకటన
ఈ సంఘటన తర్వాత రైతు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. హత్యాయత్నం సెక్షన్ కింద ఏ రైతునైనా అరెస్టు చేస్తే వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతామని ఆ సంస్థలుహెచ్చరించాయి. ఇది తమకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని రైతు సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలి. ఈ కొత్త పరిణామం పంజాబ్‌లో రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది. ఒకవైపు బిజెపి దీనిని ప్రధానమంత్రి భద్రతకు భంగం కలిగించిందని భావిస్తుండగా, మరోవైపు, ఇది రాజకీయ ప్రతీకార చర్య అని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం, పోలీసులు ఈ సెన్సిటివ్ విషయాన్ని ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.