https://oktelugu.com/

Surat Diamond Bourse: ఏమిటీ సూరత్ డైమండ్ బోర్స్.. మోడీ ఎందుకు అంత ఘనంగా చెప్పుకుంటున్నారు

ఆదివారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సూరత్ డైమండ్ బోర్డు వ్యాపార సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం. ఇది అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కంటే చాలా పెద్దది. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 18, 2023 12:46 pm
Follow us on

Surat Diamond Bourse: మన దేశంలో బంగారం వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దక్షిణ భారతంలో అయితే బంగారం వినియోగం తారస్థాయిలో ఉంటుంది. అయితే మనకు ఇప్పటివరకు బంగారం గురించి.. దాని ఆధారంగా సాగే కార్యకలాపాల గురించి మాత్రమే తెలుసు.. కానీ అదే స్థాయిలో మనదేశంలో వజ్రాల వ్యాపారం జరుగుతుంది. అయితే మన దేశంలోకి శుద్ధి అయిన తర్వాతే బంగారం వస్తుంది. వజ్రాల విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధం. ఎందుకంటే మన దేశంలో వజ్రాలను శుద్ధి చేసే కర్మాగారాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ శుద్ధి అయిన తర్వాత వజ్రాలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. వీటి ద్వారా మన దేశానికి భారీగా విదేశీ మారకద్రవ్యం లభిస్తుంది. మనదేశంలో సూరత్, ముంబై మహానగరాలు వజ్రాల ప్రసిద్ధి కేంద్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ వజ్రాల శుద్ధి పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు సూరత్ నగరంలో భారీ సముదాయం ఏర్పాటయింది. దీనిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. ఈ సముదాయాన్ని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంతకు ఏమిటి ఈ వ్యాపార సముదాయం.. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆదివారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సూరత్ డైమండ్ బోర్డు వ్యాపార సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం. ఇది అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కంటే చాలా పెద్దది. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. వ్యాపారుల కోసం 9 టవర్లలో 4,500 కార్యాలయాలు ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించుకుంటూ సూరత్ కీర్తి కిరీటంలో అతిపెద్ద వజ్రం చేరిందని నరేంద్ర మోడీ కితాబు ఇచ్చారంటే దీని గొప్పదనం ఏమిటో తెలుసుకోవచ్చు. పైగా ఇది 1.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అక్కడి వ్యాపార వర్గాలు అంటున్నాయి.. సూరత్ కేంద్రంగా సాగుతున్న వజ్రాల పరిశ్రమ సుమారు 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది.. ఇక ఈ కేంద్రం ద్వారా అదనంగా మరో 1.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ కేంద్రాన్ని ప్రారంభించుకుంటూ ఇది నవభారత శక్తికి, సంకల్పానికి చిహ్నమని నరేంద్ర మోడీ అభివర్ణించారు. అంతేకాదు తను మూడవసారి ప్రధానమంత్రి అయితే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తుందని మోడీ పునరుద్ఘాటించారు.. అటు ప్రైవేటు ఇటు ప్రభుత్వ పరంగా చూసుకుంటే విస్తీర్ణం విషయంలో సూరత్ డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయంగా రికార్డు సృష్టించింది. ఇది అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ పేరు మీద ఉండేది. పెంటగాన్ విస్తీర్ణం 66.73 లక్షల చదరపు అడుగులు.

ఇక ఈ సూరత్ డైమండ్ బోర్స్ వాణిజ్య సముదాయాన్ని ఖాజోడ్ అనే గ్రామంలో నిర్మించారు. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఇది 9 టవర్లతో కూడి ఉంటుంది. ఒక్కొక టవర్లో 15 అంతస్తులున్నాయి. వజ్రాల వ్యాపారుల కోసం 4500 కార్యాలయాలు ఏర్పాటు చేశారు. వజ్రాలపై పరిశోధన, వ్యాపార నగరంలో భాగంగా 35.54 ఎకరాల్లో దీనిని నిర్మించారు. ఇక 2015 ఫిబ్రవరిలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ ఈ వ్యాపార సముదాయానికి భూమి పూజ చేశారు. నిర్మాణానికి 3200 కోట్లు ఖర్చయింది. అయితే ఇందులో పని చేసే ఉద్యోగులకు కార్పొరేట్ కంపెనీలకు మించిన స్థాయిలో వ్యాపారులు వసతులు కల్పించారు. జీతభత్యాల విషయంలో కూడా అదే స్థాయిలో విధానాలను అవలంబించారు. ప్రస్తుతం సూరత్ డైమండ్ బోర్స్ కార్యాలయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ లో నెంబర్ వన్ గా ఉంది. ఈ సముదాయానికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.