PM Modi: పంజాబ్ అసెంబ్లీకి ఆ మధ్య ఎన్నికలు జరిగినప్పుడు ప్రచారం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్లారు. అత్యంత గోప్యంగా రూట్ మ్యాప్ ఉంది. భద్రత దృష్ట్యా ప్రధానమంత్రి సెక్యూరిటీ ఈ విషయాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పలేదు. అప్పటికే రైతు చట్టాలకు సంబంధించి కేంద్రం ఒక అడుగు వెనక్కి వేసింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా వాయు మార్గంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్రంలో అడుగు పెట్టారు. ఆయన ప్రచారం నిర్వహించే వేదిక వద్దకు రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. ఎలా తెలిసిందో తెలియదు గాని ఖలిస్థానీ వేర్పాటు వాదులు ఆ మార్గం వద్దకు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఆ సమయంలో వారు దాడి చేసే విధంగా కనిపించారు. ప్రధానమంత్రి భద్రతను పర్యవేక్షించే బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కేంద్ర వైమానిక దళానికి చెందిన విమానం వచ్చేంతవరకు ఆయనకు కాపలా కాశాయి. ప్రధాని తన వాహనం లో నుంచి లేకుండా దాదాపు 30 నిమిషాల వరకు అందులోనే కూర్చున్నారు.. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ” మీ ముఖ్యమంత్రి కి చెప్పండి . నేను ప్రాణాలతో బయటపడ్డానని” అని అప్పటి పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.. సీన్ కట్ చేస్తే అప్పటి ఆ ఘటన వెనుక కెనడా నుంచి పనిచేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాదులు ఉన్నట్టు తెలిసింది. సమయం కోసం ఎదురుచూస్తున్న ప్రధాని ఇప్పుడు ఆ ఖలిస్థానీ వేర్పాటు వాదాన్ని పెకిలించే పనిలో పడ్డారు.
కెనడా వేదికగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిక్స్ ఫర్ జస్టిస్’ సంస్థ అధిపతి గుర్‌పత్‌వంత్ సింగ్ పన్నూ ఆస్తులను ఎన్‌ఐఏ తో జప్తు చేయించడం ద్వారా తన అసలు ఉద్దేశం ఏమిటో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖలిస్థానీ ఉగ్రవాదులకు చాటిచెప్పారు. అతడు మాత్రమే కాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా 19 మంది ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించారు కూడా. వీరంతా అమెరికా, కెనడా, బ్రిటన్, పాకిస్తాన్, దుబాయ్ ప్రాంతాలలో నివాసం ఉంటూ భారతదేశం మీద విద్వేష ప్రచారం చేస్తున్నారు. పరారీలో ఉన్న వీరిని భారత దేశ భద్రతా సంస్థలు వెంటాడుతున్నాయి. అయితే వీరు వివిధ ప్రాంతాల్లో నక్కి భద్రతా దళాలకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా భారత వ్యతిరేక ప్రసంగాలు చేస్తున్నారు. ఆ మధ్య ఆస్ట్రేలియా, కెనడా దేశాలలో భారత కాన్సులేట్ భవనాల ఎదుట నిరసనలు చేపట్టారు. జాతీయ జెండాలు తొలగించి ఖలిస్థానీ జెండాలను ప్రదర్శించారు.
ఇక పన్నూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దూకుడుగా వ్యవహరిస్తోంది.
పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా ఖాన్‌కోట్ గ్రామంలో ఉన్న 5.7 ఎకరాల వ్యవసాయ భూమి, చండీగఢ్‌లోని సెక్టార్ 15/సీలో ఉన్న ఓ ఇంటిలో నాలుగోవంతు భాగాన్ని జప్తు చేసింది. మొహాలీలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలతోనే ఈ ప్రక్రియ చేపట్టింది ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య నేపథ్యంలో, కెనడాలోని హిందువులు ఆ దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ పన్నూ బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్‌ఐఏ ఈ చర్య తీసుకోవటం విశేషం. ‘కెనడాలోని ఖలిస్థాన్ అనుకూల సిక్కులందరూ ఈ దేశ రాజ్యాంగానికి బద్ధులై ఉన్నారు. మీరు మాత్రమే కెనడా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు. కాబట్టి, హిందువులారా మీరు కెనడాను వదిలి భారత్‌కు వెళ్లిపొండి!’ అంటూ పన్నూ ఇటీవల ఓ వీడియోను విడుదల చేశాడు. నిజ్జర్ హత్యలో కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ హస్తం ఉందా? లేదా? అన్నదానిపై అక్టోబర్ 29న ఓ రెఫరెండంను నిర్వహిస్తామని, కెనడాలోని సిక్కులందరూ పాల్గొనాలని పన్నూ ఇటీవల పిలుపునిచ్చాడు. కాగా, పన్నూపై 2019లో ఎన్‌ఐఏ తొలిసారిగా కేసు నమోదు చేసింది. 2020లో కేంద్ర హోంశాఖ అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పన్నూ ఇటీవల భారత దౌత్యాధికారులను అంతమొందిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశాడు. పంజాబ్ రాష్ట్రాన్ని స్వతంత్రదేశంగా ప్రకటించాలని కెనడా, ఆస్ట్రేలియాల్లోని సిక్కులతో రెఫరెండం నిర్వహించాడు. వీటిపై కెనడాకు భారత్ ఫిర్యాదు చేసినా కూడా అతడిపై ఆ దేశ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.