PM Kisan 21th Installment: భారతదేశం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన దేశం. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు అనేక రకాల ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటాయి. రైతులకు పెట్టుబడి సహాయంగా ఇచ్చేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా విడుదలవారీగా దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఏడాదికి ఆరు వేలు చొప్పున సహాయం చేస్తూ రైతుల ఖాతాలో నిధులను జమ చేస్తున్నారు. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 3.70 లక్షల కోట్లకు పైగా నిధులు 11 కోట్ల కుటుంబాలకు చేరినట్లు తెలుస్తోంది. తాజాగా మరోసారి నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో భాగంగా 21వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 19న రైతుల ఖాతాల్లో 21వ విడత కు సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి రూ. 2000 చొప్పున మొత్తం రూ. 18 వేల కోట్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పీఎం కిసాన్ సమ్మన్ నిధులు పక్కదారి పట్టకుండా ఇప్పటికే ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా నిజమైన రైతులకు ఈ నిధులు అందించేందుకు రైతులను ఈ కేవైసీ పూర్తి చేయాలని కోరుతుంది. కానీ చాలామంది ఈ ప్రాసెస్ చేయకపోవడంతో వారికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు అందడం లేదు. దీంతో గ్రామస్థాయిలోనే ప్రత్యేకంగా సభలు నిర్వహించి రైతుల వివరాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశాల్లో రైతుల ఆధార్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్, భూమికి సంబంధించిన వివరాలు సేకరించనున్నారు.
అయితే ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేయని రైతులు ఆన్లైన్లోనూ ప్రాసెస్ చేసుకోవచ్చును. సమీపంలోని మీ సేవలోకి వెళ్లి తమ ఈ కేవైసీను పూర్తి చేసుకుంటేనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఖాతాలో జమ అవుతాయని అధికారులు తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం మూడు విడతల్లో ఈ నిధులను విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో రెండు విడతలుగా నిధులు విడుదల చేశారు. మూడో విడతగా నవంబర్ 19న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ప్రతి రైతు కుటుంబానికి ఒక గుంట నుంచి ఎంత భూమి ఉన్నా కూడా ఈ నిధులు పొందడానికి అర్హులే. అయితే రైతులకు సంబంధించిన భూమి వివరాలతో పాటు అన్నిరకాల ధ్రువపత్రాలను సరైన విధంగా ఉండేలా చూసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు.