PK TRS: పీకే సర్వే లీక్.. టీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా?

PK TRS: తెలంగాణ సాధించిన పార్టీగా రెండు సార్లు అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ కు ముచ్చటగా మూడోసారి గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. అందుకే దేశంలోనే ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఏరికోరి తెచ్చుకుంది. ఆయన సూచనలు, సర్వేల ప్రకారం ముందుకెళుతోంది. దేశంలోనే అపరచాణఖ్యుడు లాంటి కేసీఆర్ తన ఐడియాలను పక్కనపెట్టి మరీ ప్రశాంత్ కిషోర్ ను తన ఆస్థాన సలహాదారుడిగా పెట్టుకోవడం విశేషం. ఈ క్రమంలోనే వచ్చేసారి సగానికి పైగా ఎమ్మెల్యేలను మార్చేయాలని […]

Written By: NARESH, Updated On : June 23, 2022 10:16 am
Follow us on

PK TRS: తెలంగాణ సాధించిన పార్టీగా రెండు సార్లు అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ కు ముచ్చటగా మూడోసారి గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. అందుకే దేశంలోనే ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఏరికోరి తెచ్చుకుంది. ఆయన సూచనలు, సర్వేల ప్రకారం ముందుకెళుతోంది. దేశంలోనే అపరచాణఖ్యుడు లాంటి కేసీఆర్ తన ఐడియాలను పక్కనపెట్టి మరీ ప్రశాంత్ కిషోర్ ను తన ఆస్థాన సలహాదారుడిగా పెట్టుకోవడం విశేషం.

ఈ క్రమంలోనే వచ్చేసారి సగానికి పైగా ఎమ్మెల్యేలను మార్చేయాలని పీకే సలహా ఇచ్చినట్టు సమాచారం. తన సర్వేలో 40 మందికి పైగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని.. వారిని మార్చాల్సిందేనని నివేదిక ఇచ్చినట్టు టీఆర్ఎస్ లో ప్రచారం సాగుతోంది. అయితే దీన్ని వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ అధిష్టానం పీకే సర్వేను మీడియా ద్వారా లీక్ చేసినట్టు తెలుస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండా మీడియా ద్వారా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఎగురగొట్టే ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.

తెలంగాణలో పరిస్థితులపై పీకే సర్వే చేసి ఇచ్చిన నివేదికను టీఆర్ఎస్ కావాలనే లీక్ చేసినట్టు తెలిసింది. ఇందులో ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. ఒకటి వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఇప్పటి నుంచే సాగనంపే ప్రక్రియతోపాటు.. రాష్ట్రంలో టీఆర్ఎస్ దే అధికారం అని.. రెండో స్థానం కాంగ్రెస్ దని.. అసలు బీజేపీ పోటీయే కాదని ప్రజల్లోకి తీసుకెళ్లే ఎత్తుగడ వేసింది.

-అసలు పీకే సర్వేలో ఏముంది?
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు కాస్త సీట్లు తగ్గినా ఎంఐఎంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కనీసం 50 సీట్లు గ్యారెంటీ అని మరోసారి టీఆర్ఎస్ దే అధికారం అని పీకే సర్వేలో తేలిందట.. ఇక రెండోస్థానంలో కాంగ్రెస్ నిలుస్తుందని పీకే తేల్చాడు. ఇక బీజేపీ హడావుడి పెద్దగా ఉన్నా రాష్ట్రమంతా ఆ పార్టీకి బలం లేదు. అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసేంత నాయకులు లేరని.. ఆ పార్టీ సీట్లు 20లోపే వస్తాయని తేలింది.

-నెపం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైకి..
తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైకి నెట్టేసి వారికి వచ్చేసారి టికెట్లు నిరాకరించి కొత్త వారికి ఇచ్చి గెలిపించుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఆ ప్రకారం పీకే సర్వేలోనూ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని.. వారిని మార్చాల్సిన అవసరం ఉందని లీకులు ఇస్తోంది. ఇప్పటికే వారిని ప్రిపేర్ చేస్తోంది. ఆయా సిట్టింగ్ లకు వచ్చేసారి సీట్లు ఉండవని ముందుగానే మీడియా ద్వారా లీకులు ఇస్తూ సంకేతాలు పంపిస్తున్నారు.

-ప్రభుత్వంపై వ్యతిరేకత..
ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ల విషయంలో చాలా ఆలస్యం అవుతోంది. వారంతా అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఒక్క రైతులు తప్పితే తెలంగాణ సమాజంలో ఎవరూ ఆనందంగా లేరు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో జనాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇంతటి వ్యతిరేకతలో ఎలా గెలవాలన్నది పీకే రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. కానీ ముచ్చటగా మూడోసారి టీఆర్ఎస్ గెలుపు పీకే వచ్చినా.. ఇంకెవరు వచ్చినా అంత ఈజీ మాత్రం కాదన్నది వాస్తవం. మరి గులాబీ దళపతి కేసీఆర్ ఈ విషయంలో ఎలాంటి ముందుకెళుతాడు? ఎలాంటి సంస్కరణలు చేస్తాడన్నది వేచిచూడాలి.