ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటికే 23 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. నక్సలైట్లు నలుగురు చనిపోయారని తేలింది. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు చిక్కిన కోబ్రా కమాండో పోలీసు రాకేష్ మున్హాన్ ఫొటోను తాజాగా మావోయిస్టులు విడుదల చేశారు. మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట ఈ లేఖను విడుదల చేశారు. ఇప్పుడిది వైరల్ గా మారింది.
కమాండ్ పోలీసు రాకేష్ క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అడవిలో తాటాకులతో వేసిన చిన్న గుడిసెలో ఈ పోలీసును నక్సల్స్ ఉంచారు. కింద ప్లాస్టిక్ కవర్ పై రాకేష్ సింగ్ ను కూర్చొని ఉన్న ఫొటోను విడుదల చేశారు.
చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్ ను వదిలేస్తామని మంగళవారం నక్సల్స్ షరతు విధించారు. ప్రస్తుతం జవాన్ ను బంధీగా చేసుకొని నక్సల్స్ పోలీసుల దాడి నుంచి తప్పించుకునే ఎత్తుగడను వేసినట్టు తెలుస్తోంది.
బీజాపూర్-సుకుమా జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈనెల 3న మావోయిస్టులకు-పోలీసులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. పక్కా ప్రణాళికతోనే నక్సలైట్లు పెద్ద ఎత్తున దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 23 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో రాకేష్ సింగ్ అనే కమాండో కనిపించకుండా పోయాడు. అయితే అతడిని బందీగా చేసుకున్నట్లు నక్సలైట్లు తెలిపారు. సురక్షితంగా ఉన్న అతడిని విడిపించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.