Petrol prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలుగా ఉంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే లీటర్ పెట్రోల్ ధర మరో 15 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉందని వార్తలు వస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

ప్రస్తుతం క్రూడ్ ధరలు బ్యారెల్ కు 85 డాలర్ల వరకు ఉండగా రాబోయే ఆరు నెలల్లో క్రూడ్ ధరలు బ్యారెల్ కు 100 డాలర్ల వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దేశంలో లీటర్ కు 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు 15 రూపాయల వరకు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.
ఇరాక్ చమురు మంత్రి ఎహ్సాన్ అబ్దుల్ జబ్బారి మాట్లాడుతూ రాబోయే రెండు త్రైమాసికాలలో ముడిచమురు ధరలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. రాబోయే రోజులలో పండుగలు, వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తెరుచుకోవడంతో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరిగింది.
ముడిచమురు ఉత్పత్తి పెరుగుతున్నా లభ్యత అవసరంతో పోలిస్తే 14 శాతం తక్కువగా ఉండటంతో క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి. బొగ్గు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న ముడిచమురుకు డిమాండ్ పెరుగుతోంది.