ఒక్క రూపాయి పెట్రోల్, డీజిల్ ధర పెరిగిందంటే.. అది అంతటితోనే ఆగిపోదు. పాల నుంచి కూరగాయల దాకా.. బియ్యం నుంచి వంట నూనె దాకా.. ఇంకా ఎన్నో నిత్యావసరాల సరుకుల మీద ఆ ప్రభావం పడుతుంది. దాంతో.. వీటి ధరలు కూడా పెరుగుతాయి. అంటే.. పెట్రోల్ ఒక్క రూపాయే అనుకోవడానికి లేదు. ఎన్ని సరుకులు కొంటామో వాటన్నింటి ధరలూ పెరుగుతాయని గమనించాలి.
ఇంతగా ప్రభావం చూపే ఆయిల్ ధరలు ఇష్టారాజ్యంగా పెరుగుతున్నా.. చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగే వరకూ కాస్త అదుపులో ఉన్న ధరలు.. ఎన్నికలు ముగియగానే పెరగడం మొదలు పెట్టాయి. రోజుకు కనీసం పావలా చొప్పున పెరుగుతూ పోతున్నాయి. అసలు.. ఈ పరిస్థితుల్లోనూ ధరలు పెంచడం తీవ్రస్థాయిలో విమర్శలకు అవకాశం ఇస్తోంది.
కరోనా విజృంభిస్తున్న వేళ అంతర్జాతీయంగానూ ఆయిల్ కు డిమాండ్ తగ్గింది. రవాణాపై ఆంక్షలు ఉండడంతో.. ప్రజలు పెద్దగా బయటకు వెళ్లట్లేదు. దీంతో.. పెట్రోల్, డీజిల్ కు డిమాండ్ లేదు. దీంతో.. అనివార్యంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. మరి, ఇలాంటి సమయంలో భారత్ లో పెట్రో ధరలు పెరగడమేంటీ?
ఇక, మరోవైపు కొవిడ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి లేక తినడానికి సరైన తిండి కూడా తినలేకపోతున్నారు. ఇక, కొవిడ్ సోకిన వారి పరిస్థితి అగమ్యగోచరం. ఆసుపత్రులకు డబ్బుల్లేక ఎన్నో విధాల అవస్థలు పడుతున్నారు. ఈ విధంగా దేశ ప్రజలు తీవ్ర కష్టాలు పడుతుంటే.. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ధరలు పెంచుతూ పీడించడంపై ఘాటు విమర్శలు ఎదురవుతున్నాయి.
నిజానికి పెట్రోల్ వాస్తవ ధరకన్నా.. కేంద్రం, రాష్ట్రాలు వేసే పన్నులే రెట్టింపు స్థాయిలో ఉండడం గమనించాల్సిన అంశం. పెట్రోల్ ధరలో దాదాపు 60 శాతంపైన, డీజిల్ ధరలో 57 శాతం వరకు పన్నులే ఉన్నాయంటే.. ఈ ప్రభుత్వాలు ప్రజలను ఎంతగా పీల్చి పిప్పిచేస్తున్నాయో అర్థం చేసువకోవచ్చు. ఇలాంటి ప్రభుత్వాలు.. కరోనా కండీషన్లో కనీసం టీకా కూడా సరిగా ఇవ్వలేకపోవడం గమనార్హం.